
అనగనగా ఓ చెరువు
అనగనగా ఓ చెరువు.. దాని పేరు పెద్దకుంట. మంచిర్యాల పట్టణం రంగంపేట పరిధిలోనిది.
► మిషన్ కాకతీయలో అవినీతి బాగోతం
► చేయని పని చేసినట్లుగా.. గుత్తేదార్ల నమ్మించే ప్రయత్నం
► మంత్రి హరీశ్‌రావు ప్రారంభించిన పనులకు గ్రహణం
► ఏడాది దాటినా ప్రారంభం కాని వైనం
► ఎస్‌ఈపై నీటిపారుదల ఓఎస్డీ తీవ్ర అసంతృప్తి
► చెరువులోనే ఇటుకల తయారీ
సాక్షి, మంచిర్యాల : అనగనగా ఓ చెరువు.. దాని పేరు పెద్దకుంట. మంచిర్యాల పట్టణం రంగంపేట పరిధిలోనిది. మిషన్‌కాకతీయ పథకంలో మరమ్మతు పనులకు అవకాశం వచ్చింది. ఏడాది క్రితం స్వయంగా రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తట్టాలో మట్టి ఎత్తి.. పూడికతీత పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న గుత్తేదారు పనులు పూర్తి చేశాడు. ప్రభుత్వమూ బిల్లులు మంజూరు చేసింది. ఆ చెరువుకు మహర్దశ వస్తుందని అధికారులూ నమ్మారు. ఇలా ఏడాది గడిచింది. ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన సాగునీటి పారుదల శాఖ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఆకస్మికంగా ఆ చెరువును పరిశీలించారు. అసలు ప్రారంభమే కాని చెరువు పనులను చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు.. చెరువులో అక్రమంగా వెలసిన ఇటుకల తయారీ బట్టిని చూసీ అధికారులపై సీరియస్ అయ్యారు. చెరువు మర మ్మతు పనుల్లో జరిగిన జాప్యం విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. స్వయంగా మంత్రి ప్రారంభించిన ఈ పనుల్లో జరిగిన అవినీతి వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని అధికారులు ఆందోళనలో పడ్డారు. వెంటనే పనులు ప్రారంభించేలా సదరు గుత్తేదారుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇంకేముంది..? సదరు గుత్తేదారు.. మరుసటి రోజు నుంచే పనులు ప్రారంభించాడు. అయినా.. ఒప్పుకున్న పనులన్నీ ఆరు నెలల క్రితమే పూర్తి చేశానని గుత్తేదారు తేల్చి చెబుతున్నాడు. కాంట్రాక్టుకు సంబంధించని పనులు కూడా చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నాడు.
కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం 10 శాతానికి మంచి పనులు జరగలేదని పరిసర ప్రాంత ప్రజలు చెప్పడం గమనార్హం. అధికారులు సైతం సదరు కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే నిలిపేశాడని వివరణ ఇస్తున్నారు. చెరువు మరమ్మతు పనులు పూర్తయితే పరిసర ప్రాంతంలోని 50 ఎకరాల ఆయక ట్టుకు సాగునీరందుతుంది. ఆ ఊరికే వైభవం వస్తుందంటున్నారు.
నిధులు కాజేసే యత్నం..?
చెరువు మరమ్మతు పనులు పూర్తి చేయకుండానే నిధులు కాజేసే యత్నం జరిగిందా..? అసలు క్షేత్రస్థాయిలో పనులు జరగలేదా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వం ఒప్పందం ప్రకారం పనులన్నీ చేశామని గుత్తేదారు.. కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే నిలిపేశాడని ఇరిగేషన్ డీఈ సత్యనారాయణ వివరణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అసలు పనులు ప్రారంభమే కాలేదనే ఓఎస్డీ దేశ్‌పాండే నిర్ధారించడం నిధులు కాజేసేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెరువు పనులు చేపడుతున్న సదరు కాంట్రాక్టర్ తూర్పు ప్రాంతానికి చెందిన ఓ బడా ప్రజాప్రతినిధికి అనుచరుడు. స్వయానా ఓ ప్రజాప్రతినిధి కూడా. ఇంకేముంది.. ప్రభుత్వమే తనదనుకున్నాడో ఏమో కాంట్రాక్ట్ దక్కించుకుని ఏడాదైనా పనులు పూర్తి చేయలేదు. ఈ నెల 10న సాగు నీటిపారుదల శాఖ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పెద్దకుంట చెరువును ఆకస్మికంగా తనిఖీ చేయకపోతే అసలు ఈ విషయం వెలుగులోకి వచ్చేదే కాదని.. క్రమంగా బిల్లులు డ్రా చేసుకునే కుట్ర జరిగిందనే విమర్శలు వినవిస్తున్నాయి.
త్వరలోనే పూర్తి చేయిస్తాం..
చెరువు మరమ్మతు పనుల నిర్వహణపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బిల్లులు రావడం లేదంటూ.. మద్యలోనే పనులు నిలిపేశాడు. అందుకే ఆలస్యం జరిగింది. పనులు పూర్తి చేయాలని ఆదేశించాం. త్వరలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం - సత్యనారాయణ, డీఈ, ఇరిగేషన్. మంచిర్యాల