రోగాల‘పాల’వుతున్నాం

Milk Adulteration In Hyderabad - Sakshi

పాల ఉత్పత్తి పద్ధతులతో పెనుముప్పు

సాధారణ సమస్యల నుంచి సంతానలేమి దాకా..    

నేడు నేషనల్‌ మిల్క్‌ డే

నల్లని వన్నీ నీళ్లు..తెల్లని వన్నీ పాలు.. అంటూ స్వచ్ఛతకు మారు పేరుగా భావించే పాలు ఇప్పుడు మనల్ని రోగాలు పాలు చేస్తున్నాయా?ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు నగరానికి చెందిన అపోలో క్రెడిల్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌రాధికారెడ్డి పింగళి. దీనికి ప్రధానకారణం మిల్క్‌ అడల్ట్రేషన్‌(పాలను నిర్ణీత సమయానికి ముందే ఉత్పత్తి అయ్యేలా చేయడం) అని ఆమె చెప్పారు. ఇంకా రాధికారెడ్డి  చెబుతున్న అంశాలివి.

సాక్షి, సిటీబ్యూరో :నగరంలో చాలామంది ఇళ్లలో నిరంతర ప్రధానమైన డైట్‌ మిల్క్‌. ఇతర డైరీ సంబంధ ఉత్పత్తులు కూడా. ఈ  నేపథ్యంలో పాలు వినియోగం మన పాలిట శాపం కాకూడదు అంటే అవి ఎలా వచ్చాయి? ఎలా నిల్వ చేశారు? ఎలా సరఫరా చేశారు? అనేది ప్రధాన అంశంగా చూడాలి.

ప్యాకింగ్‌..షాకింగ్‌..
ప్యాక్డ్‌ మిల్క్‌ అనేది ఒక్కోసారి సంతాన లేమి సమస్యలకు కూడా కారణంగా మారుతోంది. ప్లాస్టిక్‌లో నిల్వ ఉంచే పాలు హాని చేసే అవకాశం  ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్‌లో ఉండే బీపీఏకి ఉన్న ఎండోక్రైన్‌ నిరోధకారి గుణం వల్ల ఫెర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. 

పాల కోసం పాపాలు
ప్రస్తుతం పాలకు ఉన్న భారీ డిమాండ్‌ వల్ల దాని పరిమాణాన్ని పెంచడానికి ఉపయోగిస్తున్న అవాంఛనీయ పద్ధతులు దాని నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా మన ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తున్నాయి. పాల ఉత్పత్తి కోసం పశువులకు పలు రకాల స్టెరాయిడ్స్, హోర్మోనల్‌ ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్స్, ఫార్మాలిన్, హైడ్రోజన్‌ పెరాక్సైడ్, డిటర్జంట్స్‌ వంటివి ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది. అయితే ఈ తరహాలో పాలను పెంపొందించేందుకు అమలు చేస్తున్న అవాంఛనీయ పద్ధతులను వెంటనే తనిఖీ చేయకపోతే 2025 కల్లా 87 శాతం ప్రజలు కేన్సర్‌ బారిన ప్రమాదం ఉందని భారత ప్రభుత్వాన్ని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ఒక సర్వే ప్రకారం మన దేశంలో లభ్యమవుతున్న పాలల్లో 67శాతం ఇలాంటి పద్ధతుల్లో ఉత్పత్తి చేసినవే.

రోజువారీగా పాలను విభిన్న రూపాల్లో వినియోగించే అలవాటు ఉన్న పరిస్థితుల్లో హార్మోన్ల అసమతౌల్యం ఫలితంగా అమ్మాయిల్లో వయసుకు మించిన ఎదుగుదల,  గైనెకొమాస్టియా (పురుషుల్లో  వక్షోజాలు పెరగడం), టెస్టోస్టెరాన్‌ తగ్గిపోవడం, కేన్సర్, చర్మవ్యాధులు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ సమస్యలు, హృద్రోగాలు, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు, దృష్టి లోపం, జ్ఞాపకశక్తి మందగించడం, అల్సర్స్‌ వంటివి రావచ్చు. కాబట్టి పాలను విరివిగా వినియోగించేవాళ్లు అవి తమ వద్దకు వస్తున్న విధానాన్ని ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకోవడమే మంచిది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top