
సాక్షి హైదరాబాద్: నగర మెట్రో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నవంబర్ 14 నాటికి రికార్డు స్థాయిలో మూడుకోట్ల మంది మెట్రోరైళ్లలో ప్రయాణించారు. నగరంలో మెట్రోరైళ్లు ప్రారంభమైన 351 రోజుల్లోనే రికార్డుస్థాయిలో ప్రయాణికులు మెట్రోరైళ్లలో ప్రయాణించడం తమకు గర్వకారణంగా ఉందని ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి అన్నారు. రెండు కోట్ల నుంచి మూడు కోట్లమంది ప్రయాణికుల మార్కును చేరుకునేందుకు కేవలం 71 రోజుల సమయం మాత్రమే పట్టిందని చెప్పారు. రోజువారీగా నగరంలో మెట్రో రైళ్లు 550 ట్రిప్పులు, 13 వేల కిలోమీటర్ల మేర ఎల్బీనగర్– మియాపూర్, నాగోల్–అమీర్‌పేట్ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయని పేర్కొన్నారు. మెట్రోరైళ్లలో రద్దీ అనూహ్యంగా పెరుగుతున్నప్పటికీ ఎవరికీ అసౌకర్యం కలగకుండా నిర్వహణ సంస్థ కియోలిస్ టీం అద్భుతంగా పనిచేస్తోందన్నారు.
నగరంలో మెట్రోప్రారంభమై ఇప్పటి వరకు 351రోజులు
ఇప్పటి వరకు రైళ్లు నడిపిన దూరం (కి.మీలలో) 25,53,422
మొత్తం ట్రిప్పులు : 1,64,198
ప్రయాణికుల సంఖ్య తేదీ ప్రారంభం నుంచి రోజులు
కోటిమంది 1 మే 2018 154
2 కోట్ల మంది 4 సెప్టెంబర్ 2018 280
3 కోట్ల మంది 14 నవంబర్ 2018 351