‘అమ్మ’కు హైబీపీ శాపం | Sakshi
Sakshi News home page

‘అమ్మ’కు హైబీపీ శాపం

Published Fri, Nov 29 2019 1:12 AM

Medical Health Report On Maternal Deaths To Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రసవ సమయంలో బీపీ పెరగటం కారణంగానే మాతృత్వపు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సంభవించిన మాతృత్వపు మరణాలను ఆ శాఖ విశ్లేషించింది. ఆ వివరాలతో కూడిన నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్‌ నెల నుంచి అక్టోబర్‌ మధ్య కాలంలో రాష్ట్రంలో 313 మాతృత్వపు మరణాలు సంభవించాయని నివేదిక వివరించింది.

అందులో బోధనాసుపత్రుల్లో 120 మంది, వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో 28 మంది, ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలోని ఆసుపత్రిలో ఒకరు, ఇంటి వద్ద జరిగిన ప్రసవాల్లో 31 మంది, ప్రయాణ సమయాల్లో 39, ఇతరత్రా కారణాలతో 12 మంది మరణించారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో 82 మంది మృతిచెందారు. పెద్దాసుపత్రుల్లో పరిశీలిస్తే అత్యధికంగా గాంధీ ఆసుపత్రిలో 49 మంది, ఉస్మానియా ఆసుపత్రిలో 21 మంది, వరంగల్‌ ఎంజీఎంలో 12 మంది చనిపోయారు. మరణాల్లో గర్భిణిగా ఉన్నప్పుడు 58 మంది చనిపోగా, ప్రసవ సమయంలో 63 మంది చనిపోయారు. ప్రసవమయ్యాక వారం రోజుల వ్యవధిలో అత్యధికంగా 124 మంది చనిపోవడం గమనార్హం. ఇక 7 నుంచి 42 రోజుల వ్యవధిలో 68 మంది చనిపోయారు.

బీపీ, రక్తస్రావం, షుగర్‌లతో.. 
మాతృత్వపు మరణాలకు గల కారణాలను వైద్య ఆరోగ్యశాఖ విశ్లేషించింది. ప్రసవ సమయంలో బీపీ పెరగడం, దాన్ని నియంత్రించలేని పరిస్థితుల్లో అధికంగా 81 మంది చనిపోవడం గమనార్హం. ఆ తర్వాత రక్తస్రావంతో 55 మంది చనిపోయారు. మధుమేహం తదితర కారణాలతో 45 మంది చనిపోయారు. ఇన్ఫెక్షన్లతో 44 మంది చనిపోయారు. గుండె సంబంధిత జబ్బుల కారణంగా 40 మంది మృతిచెందారు. తెలియని కారణాలతో 27 మంది, రక్తహీనత, మెదడులో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులపైన ప్రభావం చూపడం, సిజేరియన్‌ వికటించడం వంటి తదితర కారణాలతో మిగతా వారు మృతి చెందారు.

హైదరాబాద్‌లో అత్యధిక మరణాలు... 
ఈ ఏడు నెలల కాలంలో జరిగిన మరణాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే సంభవించాయి. నగరంలోనే 32 మంది చనిపోయారు. ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లాలో 18 మంది, రంగారెడ్డి జిల్లాలో 17 మంది, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 16 మంది చొప్పున మాతృత్వపు మరణాలు సంభవించాయని నివేదిక తెలిపింది. ఈ మాతృత్వపు మరణాల్లో బోధనాసుపత్రుల పరిధిలోనే 38 శాతం సంభవించాయి. ఇక ఇటీవల కేంద్రం విడుదల చేసిన 2015–17 ఎస్‌ఆర్‌ఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షకు 76 మాతృత్వపు మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఈ సంఖ్య 2001–03లో ఏకంగా 195 ఉండటం గమనార్హం.

Advertisement
Advertisement