వైద్యశాఖలో అక్రమ డెప్యూటేషన్లు రద్దు | Sakshi
Sakshi News home page

వైద్యశాఖలో అక్రమ డెప్యూటేషన్లు రద్దు

Published Mon, Mar 2 2015 3:45 AM

Medical Department In the Illegal deputations Cancel

- నల్లగొండ జిల్లాలో 60 మంది పారామెడికల్ సిబ్బంది వెనక్కి
- ప్రాంతీయ పరిధిలోని అక్రమ బదిలీల రద్దుకు సిఫార్సు?
- ‘సాక్షి’ కథనంతో కదిలిన డొంక... ఇంకా కొనసాగుతోన్న విచారణ

సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ ఆరో జోన్ ప్రాంతీయ పరిధిలో జరిగిన పారా మెడికల్ సిబ్బంది, సీనియర్ అసిస్టెంట్ కేడర్ అక్రమ డెప్యూటేషన్లను కొన్నింటిని రద్దు చేశారు.

ముందుగా నల్లగొండ జిల్లాలో 60 అక్రమ డెప్యూటేషన్లను రద్దు చేశారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్ ఇటీవల వాటిని రద్దు చేశారు. గత జనవరి 28వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన వైద్యశాఖలో అక్రమ బదిలీలు కథనానికి స్పందించిన సర్కారు విచారణ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నల్లగొండ జిల్లాతోపాటు రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ అక్రమ డెప్యూటేషన్లు జరిగాయి. వాటిపైనా విచారణ జరుగుతోంది.

విచారణ అనంతరం వాటిని రద్దు చేసే అవకాశం ఉందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, సరెండర్ పేరుతో రూ. 3 లక్షల వరకు తీసుకొని వైద్య ఉద్యోగులను వారికి ఇష్టమైన ప్రాంతానికి బదిలీలు చేశారు. వీటి పైనా విచారణ జరుగుతోంది. త్వరలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన సరెండర్‌లను అనంతరం జరిగిన 150 బదిలీల రద్దుకూ సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
కీలకాధికారిపైనా చర్యలు:ఆరో జోన్ పరిధిలోని ఆరు జిల్లాలకు వైద్య ఆరోగ్యశాఖలో కీలక అధికారుల్లో ఆయన ఒకరు. అక్రమ డెప్యూటేషన్లకు, సరెండర్లు అనంతరం జరిగిన బదిలీలకు ఆయనే సూత్రధారి అని విచారణ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. సరెండర్ పేరుతో ఇష్టమైన చోటుకు ఉద్యోగులను బదిలీ చేశారు. అందుకు రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. సరెండర్ కుదరకపోతే డెప్యూటేషన్ సదుపాయాన్ని వాడేసుకున్నారు.

రూ.50 వేలు తీసుకుని నల్లగొండలో 60 మంది పారామెడికల్, సీనియర్ అసిస్టెంట్‌లను కోరుకున్న చోటికి పోస్టింగ్ ఇచ్చారు. ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధి తల్లికి ప్రమోషన్ ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో 12 మంది ఏఎన్‌ఎంల పదోన్నతులను నిలిపి వేశారు. ఈ నేపథ్యంలో ఆయన పాత్రపైనా విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం ఆయనపై చర్య తీసుకునే అవకాశం ఉంది.

Advertisement
Advertisement