మావోయిస్టుల భారీ సభ | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల భారీ సభ

Published Sat, May 16 2015 4:07 AM

మావోయిస్టుల భారీ సభ - Sakshi

దండకారణ్యంలో
మూడు రోజుల పాటు సభలు
క్రీడా సామగ్రి పంపిణీ..
పోటీల నిర్వహణ

దుమ్ముగూడెం: తెలంగాణలోని ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ జిల్లా సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగులంక అటవీ ప్రాంతంలో శుక్రవారం ఆదివాసీలతో మావోయిస్టుల అగ్ర నేతలు భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా బహిరంగ సభలు నిర్వహించిన స్థలం నుంచి 100 మీటర్ల దూరంలోని బూగురులంక సంతలో మావోయిస్టు అగ్రనేత సావిత్రి (రామన్న భార్య)సహా  200 మంది మావోయిస్టులు తుపాకులతో హల్‌చల్ చేసినట్లు తెలిసింది. ఈ బహిరంగ సభలను మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న నేతృత్వంలో సంతోష్, సావిత్రి, లచ్చన్న, ఉదమ్‌సింగ్, భగ త్, నగేష్, సోనిల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఆయా ప్రాంతాల ఆదివాసీలను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు బుధవారం నుంచి బూరుగులంక అటవీప్రాంతంలో  ఈ బహిరంగ సభలను నిర్వహించినట్లు తెలుస్తోంది. సభలకు దండకారణ్యానికి చెందిన ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరైనట్లు తెలుస్తోంది. సభల్లో మావోయిస్టు నేతలు మాట్లాడుతూ పోలీసులు దండకారణ్యంలో నిర్మించతలపెట్టిన బేస్‌క్యాంపు నిర్మాణాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. ప్రశాంత వాతావరణంలో బతుకుతున్న తమ గ్రామాలను నాశనం చేయవద్దని.. బేస్ క్యాంపు నిర్మాణానికి వచ్చిన పోలీసులను అడ్డుకోవాలని ఆదివాసీలకు సూచించినట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో అదేవిధంగా నిర్మాణాలు చేపడితే ఎదురుతిరిగి అడ్డుకోవాలని ఆదివాసీలకు ధైర్యం నూరిపోసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

క్రీడా సామగ్రి పంపిణీ..
మావోయిస్టులు సరిహద్దు ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆదివాసీ యువకులకు క్రీడా కిట్లు పంపిణీ చేయడంతో పాటు.. క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులనూ పంపిణీ చేసినట్లు సమాచారం.

Advertisement
Advertisement