గురుకులాల్లో మనబడి–మనగుడి

Mana Badi Mana Gudi Programme Held In Gurukul School At Adilabad - Sakshi

ప్రతి నెలా రెండో శనివారం చేపట్టాలని ఆదేశం

ఉమ్మడి జిల్లాలోని 17గురుకులాల్లో నిర్వహణ

సాక్షి, ఆదిలాబాద్‌ రూరల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ‘మన బడి – మనగుడి’ పేరుతో శనివారం నుంచి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంస్థ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ రూపకల్పనలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు విద్య, విద్యేతర కార్యక్రమాలు అమలు చేస్తూ వారిని సుశిక్షితులుగా తయారు చేయాలనే సంకల్పంతో పలు రకాల ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతిమంగా గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సదుపాయాలతో సత్ఫలితాలిస్తుండటంతో తాజాగా ‘మనబడి–మనగుడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

కార్యక్రమం ఉద్దేశం...
విద్యార్థులతో పాటు తల్లిదండ్రులనూ భాగస్వాములను చేస్తూ వారిలో సంస్థపై మరింత బాధ్యతను పెంచేలా చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం, ఫలితంగా సంక్షేమ గురుకుల విద్యార్థులకు మనోధైర్యం పెంచడమే కాకుండా క్రమ శిక్షణ, చదువుపై  నిబద్ధత కలిగేందుకు అస్కారం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 17సాంఘిక సంక్షేమ గరుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో 17 పాఠశాలలు, 10 ఇంటర్‌ కళాశాలలున్నాయి. ఆయా కళాశాల, పాఠశాలలో సుమారు 9,200 మంది విద్యార్థులు ఉన్నారు.

ప్రతి రెండో శనివారం జరిగే ఈ కార్యక్రమంలో పిల్లలు చదువుకునే పాఠశాల, వసతి గృహాల్లో అందుతున్న వసతులు, చదువుతున్న తీరు, దిన చర్యను తల్లిదండ్రులు ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతుంది. దీంతో తమ పిల్లల విద్యా ప్రమాణాలు ఏ మేరకు పెరుగుతున్నాయో, తల్లిదండ్రులుగా పిల్లల చదువుకు ఇవ్వాల్సిన సహకారం, వారి భవిష్యత్‌కు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలు తెలుసుకునే వీలుంటుంది. మనబడి–మనగుడి కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమం అనంతరం ఆ గురుకుల పాఠశాల, కళాశాల వర్గాలు కొంత మేర సామగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుందని సంస్థ సూచించింది.

కావాల్సిన సామగ్రి
ఈ కార్యక్రమంలో భాగంగా 5లీటర్ల వరకు ఫినాయిల్, 2లీటర్ల యాసిడ్, 10 బ్రూమ్స్, 5బక్కెట్లు, 5మగ్గులు, 10 డస్టర్‌లను కొనుగోలు చేయడంతోపాటు నీటి సదుపాయం కల్పించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సమస్యలు కొంత మేర పరిష్కారం కావడమే కాకుండా తమ తల్లిదండ్రులతో వసతి గృహాంలో కలిసి భోజనం చేసే అవకాశం కల్పించడం గమనార్హం. ఈ కార్యక్రమం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో ప్రారంభించారు. అందులో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పరిసరాల శుభ్రతకు దోహదం
సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ఆదేశం మేరకు ప్రతి నెలా రెండో శనివారం గురుకుల విద్యాలయం ఆవరణలో నిర్వహించే మనబడి మనగుడి కార్యక్రమంతో వ్యక్తి గత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను, విద్యార్థుల స్థితిగతులను అంచనా వేయడానికి అస్కారం ఉంటుంది. ఈ కార్యక్రమంతో పాటు అధ్యాపకులకు మరింత బాధ్యత పెంచినట్లు అవుతుంది. విద్యా పరంగా మరిన్ని మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశము ఉంది. 
– గంగన్న, ఆర్‌సీవో, సాంఘిక గురుకుల పాఠశాల, ఆదిలాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top