ఏటీఎంల వద్ద జాదుగాడు  | Sakshi
Sakshi News home page

ఏటీఎంల వద్ద జాదుగాడు 

Published Sat, Sep 21 2019 9:28 AM

A Man Cheats People at ATM Centers in Gadwal - Sakshi

గద్వాల క్రైం: నగదు కోసం ఏటీఎం సెంటర్ల వద్దకు ఖాతాదారులు నిత్యం వెళ్తుంటారు. అయితే కొందరు ఖాతాదారులకు నగదు డ్రా చేసుకునే విషయంలో మిషన్‌పై అవగాహన లేకపోవడంతో ఇతరుల సహాయంతో కోరడం కనిపిస్తుంది. ఇదే అదునుగా భావించిన జాదుగాళ్లు ఖాతాదారుల బలహీనతను లక్ష్యంగా చేసుకుని పలువురి ఖాతాలోంచి నగదు కొల్లగొట్టిన సంఘటన గద్వాలలో చోటు చేసుకుంది. ఇటీవల ధరూరు మండలం ఉప్పేరుకు చెందిన ఓ ఖాతాదారుడు నగదు విత్‌డ్రా చేసేందుకు గద్వాలలోని ఎస్‌బీహెచ్‌ఎ ఏటీఎంకు వెళ్లాడు. అయితే నగదు డ్రా చేయడం తెలియకపోవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి సహాయం చేస్తానని నమ్మబలికి సదరు వ్యక్తికి సంబంధించిన ఏటీఎం కార్డు, పిన్‌ నంబర్‌ తీసుకొని నగదు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత డబ్బులు రావడం లేదని ఖాతాదారునికి చెప్పి.. జాదుగాడు తన వద్ద ఉన్న మరో ఏటీఎం కార్డును చేతిలో పెట్టాడు.

ఖాతాదారుడు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత సదరు వ్యక్తి ఖాతా నుంచి రూ.8,500 నగదు డ్రా చేశాడు. దీంతో అసలు ఖాతాదారుడు నగదు డ్రా చేయకుండానే తన ఫోన్‌కు నగదు డ్రా చేసినట్లు గుర్తించి వెంటనే బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి తన కార్డును బ్లాక్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పలువురు వ్యక్తుల అమాయకత్వాన్ని అదునుగా భావించిన జాదుగాడు ఇదే తరహాలో మోసం చేసేందుకు పలు ఏటీఎంల వద్ద మాటు వేశాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం పట్టణంలోని అదే ఏటీఎం వద్ద నగదు డ్రా చేసుకునేందుకు గద్వాల మండలం కుర్వపల్లికి చెందిన ఓ ఖాతాదారు రాగా.. అక్కడ కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది.
 
ఇలా వెలుగులోకి.. 
కుర్వపల్లికి చెందిన వ్యక్తి తన ఖాతాలోంచి నగదు డ్రా చేసినట్లు తెలుసుకుని ఉప్పేరుకు చెందిన ఖాతాదారుని నిలదీశాడు. అయితే తన ఖాతాలోంచి నగదు డ్రా అయిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు మోసపోయామని గమనించారు. అయితే ఇక్కడే జాదుగాడు ఒకరికి తెలియకుండా మరొకరి ఏటీఎం కార్డుల ద్వారా నగదు బదిలీ చేయడం కొసమెరుపు. దీంతో పోలీసులు సైతం ఆ కేసును ఛేదించాలనే లక్ష్యంతో బ్యాంకుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇదో సినిమాను తలపించేలా ఉంది. ఇక ముందు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఒక వేళ ఫిర్యాదు చేయకుండా ఉంటే తనే దొంగగా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. 

అతి తెలివి ప్రదర్శించి.. 
జాదుగాడు అత్యంత తెలివిని ప్రదర్శించి ముందు మోసం చేసిన వ్యక్తి ఖాతాలోకి కుర్వపల్లికి చెందిన ఖాతాదారుని అకౌంట్‌లోంచి కొంత నగదు బదిలీ చేశాడు. అయితే ఖాతాలో కొంత నగదు డిపాజిట్‌ కావడంతో ఉప్పేరుకు చెందిన వ్యక్తి కాస్త అయోమయానికి గురయ్యాడు. అయితే కుర్వపల్లికి చెందిన సదరు ఖాతాదారు బ్యాంకు అధికారులకు నగదు డ్రా అయిందని ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం తెలుసుకుని ఉప్పేరుకు చెందిన వ్యక్తిపై కుర్వపల్లికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

Advertisement
Advertisement