జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీ రాష్ట్ర మహానాడుకు హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీ యాంశమయింది.
సాక్షి, ఖమ్మం: జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీ రాష్ట్ర మహానాడుకు హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీ యాంశమయింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ప్రతి ష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహా నాడు మంగళవారం
గండిపేటలో ప్రారంభమయింది. అయితే తెలంగాణలోనే అత్యంత కీలకనాయకునిగా గుర్తింపు ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మహానాడు తొలిరోజు వెళ్లలేదు. సోమవారం తన సమీప బంధువు కర్మకాండలు ఉండడంతో ఆయన సొంత నియోజకవర్గంలోనే ఉన్నారు.
మంగళవారం కూడా పార్టీ సీనియర్ నేత ఒకరు మరణించడంతో తుమ్మల హైదరాబాద్‌కు వెళ్లలేదని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయితే, మహానాడు లాంటి రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి తుమ్మల ఎందుకు వెళ్లలేదన్న దానిపై చర్చ జరుగుతోంది. గత ఎన్నికలలో తన ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్న ఆయన తన అసంతృప్తిని అధినేతకు తెలియజేసేందుకే తొలిరోజు మహానాడుకు వెళ్లలేదని సమాచారం.
తాజా ఎన్నికలలో జిల్లాలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సమయంలో గ్రూపు తగాదాలను నిలువరించడంలో అధినేత వ్యవహారశైలి... తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని తన అసమ్మతిని తెలియజేయాలన్న ఆలోచనతోనే తుమ్మల తొలిరోజు భేటీకి వెళ్లలేదని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, రెండోరోజు కార్యక్రమానికి హాజరవుతారని కొందరు నాయకులు అంటున్నారు. ఆయన మహానాడులో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రమే హైదరాబాద్ వెళ్లారని, బుధవారం గండిపేట వెళతారని వారు చెబుతున్నారు. ఏదిఏమైనా సొంత పని కారణం చూపి మహానాడుకు వెళ్లకపోవడం ఒకరకంగా పార్టీ అధినాయకత్వానికి తుమ్మల ఇచ్చిన హెచ్చరిక సంకేతమే అనే చర్చ జరుగుతోంది.