‘కళ’లో విరిసిన ప్రేమ..

Lovers Day Special Stores Telangana Rangareddy - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: సిరిపురం శ్రీ,నివాస్‌ (అలియాస్‌ శ్రీను 65 ) ఆల్‌ రౌండర్‌ ఆర్టిస్టు. స్వాతి రింగ్‌ డ్యాన్సర్‌. ఓ ఈవెంట్‌లో కలిసిన ఈ జంట ప్రేమ బాసలు చెప్పుకుని.. తర్వాత పెళ్లిపీటలెక్కి.. ఇప్పుడు ఓ ఇంటివారయ్యారు. వాలంటైన్స్‌డే సందర్భంగా తమ ప్రేమ ప్రయాణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘మా ప్రేమ 2012 మార్చిలో 19న మధురానగర్‌లో ఓ ఈవెంట్‌లో చిరురించింది. ఆ ప్రయాణం 2017 జూలై 30 దాకా సాగి ఆ రోజు వివాహంగా మారింది’ అంటూ చెప్పుకొచ్చారు శ్రీను. ‘స్వాతి తొలుత నెయిల్‌ ఆర్ట్‌ వేసేది. నేను మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్‌ చేసేవాడిని. ముందు నేనే స్వాతికి ప్రపోజ్‌ చేశాను. తర్వాత ఏవేవో కవిత్వాలు చెప్పే వాడిని. కొన్నాళ్లకు తాను నా ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఏడాది తర్వాత ఇద్దరం కలిసి ‘వాట్‌ ఈజ్‌ లైఫ్‌’ అని ప్రశ్న వేసుకున్నాం. జీవితం అంటే ప్రేమ కాదు.. ఒక ఆశయం అని ఇద్దరం అనుకున్నాం.

ఇప్పుడు చేసే ఆర్ట్‌ ఫామ్స్‌ కాకుండా సరికొత్తగా ఎవరూ చేయనివి చేయాలని నిర్ణయించుకున్నాం. 2014లో స్వాతి ప్రోత్సాహంతో మ్యాజిక్‌ షో ప్రారంభించాను. తర్వాత ఆ కళను కొత్తగా చేయడం ప్రారంభించాను. స్వాతి ప్రోత్సాహంతోనే డ్రస్‌ ఛేంజ్, లిల్లీపుట్‌ యాక్టింగ్‌ ప్రయత్నించాను. నాతోపాటు తను కూడా కొత్తగా రింగ్‌ డ్యాన్స్‌ మొదలు పెట్టింది. ఈ డ్యాన్స్‌ జిమ్నాస్టిక్స్‌తో సమానం. చిన్నప్పుడే నేర్చుకోవాలి. 21 ఏళ్ల వయసులో స్వాతి 12 గంటల పాటు ఈ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేది. ఇద్దరం కలిసి చేస్తూండగా 2016లోనే ‘జబర్దస్త్‌’లో ఇద్దరికీ ఛాన్స్‌ వచ్చింది. రాకింగ్‌ రాకేశ్‌ టీంలో చేరాను. కొత్త వృత్తిలో కుదుటపడ్డాం కదా అని మా ప్రేమ విషయం ఇద్దరం పెద్దల దృష్టికి తీసుకెళ్లాం. మా ఇంట్లో ఒప్పుకోలేదు.. వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారు. తాను నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లి వారి పెద్దలకు పరిచయం చేసింది. వారు నా నడవడిక గమనించి ఓకే చెప్పారు.

ఏడాది తర్వాత మా ఇంట్లో వారు కూడా ఒప్పుకున్నారు. 2017 జూలై 30న మా ప్రేమ పెద్దల అంగీకారంతో వివాహ బంధంగా మారింది. స్వాతితో కలిసి 16 రకాల కళారూపాలను ప్రదర్శిస్తాను’ అంటూ వివరించాడు శ్రీను. స్వాతి మాట్లాడుతూ.. ‘జీవితంలో ఇద్దరు కలిసి ఎదిగేందుకు ప్రేమ అండగా ఉండాలి. అంతకు మించి ఒక ఆశయం కావాలి. వృత్తిలో ఎదిగేందుకు ఒకరి సలహాలు ఇంకొకరు తీసుకోవాలి. అలాగే మేం కలిసి సాగుతున్నాం. ప్రేమికులకు ఒకటే సలహా.. ఒకరినొకరు అర్థం చేసుకొన్నాకే పెళ్లికి వెళ్లాలి. అత్తామామలు, అమ్మనాన్నలు ఇద్దరు ఒక్కటే అనే భావన ఉండాలి. అప్పుడే కుటుంబ బంధం మరింత బలపడుతుంది’ అంటూ ముగించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top