‘ప్రేమ’ విషాదం | 'love' tragedy | Sakshi
Sakshi News home page

‘ప్రేమ’ విషాదం

Feb 15 2015 1:16 AM | Updated on Nov 6 2018 7:56 PM

‘ప్రేమ’ విషాదం - Sakshi

‘ప్రేమ’ విషాదం

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పడమటితండా శివారులో శనివారం చోటుచేసుకుంది.

జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ప్రేమికుల రోజు విషాదం చోటు చేసుకుంది. దేవరుప్పుల మండలం పడమటితండాకు చెందిన బానో తు కృష్ణ(23) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా రేగొండ మండలం పెద్దంపల్లికి చెందిన సాగరిక(20) ఉరివేసుకుని మృతి చెందింది.
 - దేవరుప్పుల/రేగొండ

 కుటుంబ కలహాలతో యువకుడు..

పడమటితండా (దేవరుప్పుల) : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పడమటితండా శివారులో శనివారం చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సుభాష్ కథనం ప్రకారం.. పడమటితండా గ్రామ పంచాయతీ శివారు దొనేబండతండాకు చెందిన బానోతు కృష్ణ (23) జనగామలో డిగ్రీ చదువుతుండగా.. అదే కళాశాలలో చదువుతున్న లింగాలఘనపురం మండలంలోని కుందారం శివారు దేవరకుంట తండాకు చెందిన అనిత పరిచయమైంది. దీంతో ఇరువురు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఎనిమిది నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా, మూడు నెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. అయితే ఇటు చదువు.. అటు సంసార బాధలు తట్టుకోలేని పరిస్థితుల్లో స్వగ్రామానికి వెళ్లి బతుకుదామనే విషయంలో భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా గొడవ జరుగుతుంది. దీంతో ఈనెల 13వ తేదీన కృష్ణ హైదరాబాద్ నుంచి భార్యను తీసుకొచ్చి ఆమె తల్లిగారింటిలో వదిలాడు. అనంతరం అక్కడి నుంచి తన తండాకు వచ్చి వాడిక కల్లుతాగాడు. కాగా, రాత్రి అన్నం తిన్న తర్వాత మూత్రవిసర్జనకు వెళ్లిన కృష్ణ ముందస్తుగా తెచ్చుకుని చెలకలో దాచి పెట్టుకున్న పురుగుల మందుతాగి వచ్చి పడుకున్నాడు. అయితే మధ్య రాత్రి తల్లి లక్ష్మీకి పురుగుల మందువాసన రావడంతో అనుమానం వచ్చి కొడుకు కృష్ణను గమనించగా నోటినుంచి నురుగులు వచ్చాయి. దీంతో ఆమె కేకలు వేసి చుట్టూ పక్కల వారిని పిలిచి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా కృష్ణ అప్పటికే మృతిచెందాడు. కాగా, మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేస నమోదు చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుభాష్ తెలిపారు.
 
ఉరి వేసుకుని యువతి..

రేగొండ : ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రం శివారులోని పెద్దంపల్లిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... రేగొండ పోలీస్‌స్టేషన్‌లో గతంలో పనిచేసిన కానిస్టేబుల్ సారయ్య, సరోజన దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే పెద్ద కూతురు సాగరిక (20) గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన మండల కేంద్రం శివారుకు చెందిన సకినాల మహేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా, కొంతకాలంగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న సాగరిక మండల కేంద్రంలోని వాణివిద్యానికేతన్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరులేని సమయంలో సాగరిక ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, భర్త మహేష్ పరకాలకు వెళ్లి వచ్చి చూసే సరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి ఆయన తలుపులను తీసి చూడగా సాగరిక ఉరివేసుకుని ఉంది. ఇదిలా ఉండగా, సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సంజీవరావు, సీఐ శ్రీనివాస్, ఎస్సై శాదుల్లాబాబా సందర్శించారు. కాగా, సాగరిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement