టీపీసీసీ టు ఏఐసీసీ! 

Lok Sabha Elections 2019 Congress MPs Candidates - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న నాయకుల జాబితా సిద్ధమైంది. ఉమ్మడి  జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేస్తామని, తమకు టికెట్‌ కేటాయించాలను కోరుతూ పలువురు టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి పేర్లను వడబోసిన తర్వాత ఆశావహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం కుదించింది. ఆ తర్వాత ఆ జాబితాను జాతీయ నాయకత్వానికి పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ, భువ నగిరి లోక్‌సభ స్థానాలకు పోటీపడుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఆశావహుల జాబితా టీపీసీసీ నుంచి ఏఐసీసీకి చేరినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాలకు విపరీతమైన పోటీ ఉండగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర నాయకత్వం జాబితాను పలుమార్లు స్క్రూట్నీ చేసి సిద్ధం చేసిందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ జిల్లాలోని రెండు స్థానాల్లో పోటీచేయగా, భువనగిరిలో ఓట మి పాలై, నల్లగొండను చేజిక్కించుకుంది. ఆ పార్టీ తరఫున గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన అధికార టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. దీంతో రెండు నియోజవర్గాల్లో కాం గ్రెస్‌కు ఎంపీలు లేకుండా అయ్యారు. దీంతో ఈసారి ఎన్నికల్లో రెండు స్థానాలూ కైవసం చేసుకుంటామన్న ధీమాలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. ఈ కారణంగానే రెండు స్థానాలకూ బాగా పోటీ ఏర్పడింది.

టికెట్‌ రేసులో ‘మాజీ’ ఎమ్మెల్యేలు!
డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. మిగిలిన తొమ్మిది చోట్ల ఓటమి పాలైన పార్టీ సీనియర్లు కొందరు లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షిం చుకోవాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంనుంచి పోటీ చేస్తానని అందరికన్నా ముందుగానే మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి పేరు కూడా తెరపైకి వచ్చింది. సూర్యాపేటకు చెందిన పటేల్‌ రమేష్‌రెడ్డి కూడా టికెట్‌ రేసులోకి వచ్చారు. మరోవైపు నాగార్జున సాగర్‌ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌ రెడ్డి పేరును కూడా పీసీసీ నాయకత్వం ఢిల్లీకి పంపిన జాబితాలో చేర్చిందని చెబుతున్నారు.

రఘువీర్‌రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. కానీ, ఆ టికెట్‌ ఆయనకు దక్కకపోవడంతో ఈసారి నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంనుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో జరిగిందని చెబుతున్నారు. అదే మాదిరిగా, భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సూర్యాపేటకు చెందిన మాజీ మంత్రి ఆర్‌.దామోదర్‌రెడ్డి పార్టీ నాయకత్వానికి సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన సూర్యాపేట అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన విషయం తెలిసింది. గత ఎన్నికల సమయంలోనే ఆయన భువనగిరి నుంచి తన తనయుడు సర్వోత్తమ్‌ రెడ్డికి టికెట్‌ కోసం ప్రయత్నించారు. ఈసారి ఆయనే రేసులోకి వచ్చారని అంటున్నారు. ఇదే స్థానం నుంచి టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్‌ కూడా ఇక్కడినుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. వీరందరి పేర్లతో ఒక జాబితాను టీపీసీసీ సిద్ధం చేసి ఏఐసీసీకి పంపించిందని సమాచారం.

యువతకు అవకాశం ఇవ్వాల్సిందే..?
మరోవైపు ఈ ఎన్నికల్లో పార్టీలోని యువకులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. భువనగిరి నుంచి ఆ పార్టీ యువజన విభాగం జాతీయ కమిటీ లో పనిచేసిన చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి టికెట్‌ ఆశించారు. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాకు దరఖాస్తు కూడా ఇచ్చారు. అదే మాదిరిగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు కూడా దరఖాస్తు ఇచ్చారు. పార్టీకి జవసత్వాలు రావాలంటే యువరక్తానికి అవకాశాలు ఇవ్వాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నాయకత్వం కూడా తీర్మానించి ఈ మేరకు జాతీయ యువజన కాంగ్రెస్‌ నాయకత్వానికి పంపించినట్లు సమాచారం.

గురువారం పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌ సన్నాహక సమావేశం జరిగింది. యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు కేశవ్‌ చంద్‌ యాదవ్, జాతీయ ఉపాధ్యక్షుడు బి.వి శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జ్‌ జెబి మాథుర్, తెలగాణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌లు పాల్గొన్న ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్‌లో పనిచేసి, ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న చామల కిరణ్‌కుమార్‌ రెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్‌ ఇవ్వాలని కోరుతూ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాం ధీకి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి పేరును సిఫారసు చేస్తూ తీర్మానం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో రెండు టికెట్లను యువజన కాంగ్రెస్‌ నాయకులకు ఇవ్వాలని కోరుతున్నారని, అందులో భువనగిరి ఒకటని అంటున్నారు. అయితే, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్‌ దక్కుతుం దో చెప్పలేమని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top