ఊపందుకున్న ప్రచారం

Lok Sabha Election Campaign Start In Adilabad - Sakshi

ఊర్లను చుట్టుకొస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు

ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నం

సాక్షి, ఆదిలాబాద్‌టౌన్‌: పార్లమెంట్‌ ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో ఆయా పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఏప్రిల్‌11న పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా పార్టీల నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలవుతుంది. ఓటర్లను మెప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా పల్లెపల్లెను జల్లెడ పడుతున్నారు. దీంతోపాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు విందు, వినోదాలు చేస్తూ గాలం వేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఓటర్లు ఎవరిని పార్లమెంట్‌కు పంపిస్తారనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. మరో పది రోజులు గడిస్తే కాని తెలియని పరిస్థితి ఉంది. ఆయా పార్టీల నాయకులు ఇతర పార్టీలో ఉన్న కార్యకర్తలకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు. కండువాలను కప్పి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే వారు ఏ పార్టీలో ఉంటారనేది తెలియని పరిస్థితి. 

ఎవరికి పట్టం కడతారో..
ఆదిలాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఇటీవల జరిగిన శాసనసభ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే. భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి జోగు రామన్న ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ మండలంలోని 34 జీపీల్లో 12 ఏకగ్రీవం కాగా, 17 టీఆర్‌ఎస్, 2 బీజేపీ, 3 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. మావల మండలంలో 3 జీపీల్లో 2 టీఆర్‌ఎస్, 1 కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా, బేల మండలంలో 35 జీపీల్లో 9 మంది ఏకగ్రీవం కాగా, 18 టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులు, 1 కాంగ్రెస్, 2 బీజేపీ, 5 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. జైనథ్‌ మండలంలో 42 జీపీల్లో 6 ఏకగ్రీవం కాగా, 20 మంది టీఆర్‌ఎస్, 2 కాంగ్రెస్, 5 బీజేపీకు చెందిన వారు గెలుపొందారు. అయితే నియోజకవర్గ ప్రజలు ఈసారి జరిగే ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిందే.

పార్టీ నేతల ప్రచారం..
పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నగేష్‌ తరఫున ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, ఇతర నాయకులు, బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సోయం బాపూరావుకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్, ఇతర పార్టీల నాయకులు ప్రచారం చేపడుతుండగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఉన్న రాథోడ్‌ రమేష్‌ గెలుపు కోసం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్‌పాండే, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత, మైనార్టీ చైర్మన్‌ సాజిద్‌ఖాన్‌ తదితరులు ప్రచారం ముమ్మరం చేశారు. అయితే రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి నాయకులు ఇంకా ప్రచారానికి రాలేదు. వారు వస్తే మరింత కార్యకర్తల్లో ఉత్సాహం రేపినట్లు అవుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top