పాలు వృథా.. రైతుకు వ్యథ

Lockdown Affected On Milk Production In Telangana - Sakshi

హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేతతో పాల విక్రయంపై అయోమయం

గ్రామాల్లో క్రమంగా మూతపడుతున్న సేకరణ కేంద్రాలు

ఎటూ పాలుపోని స్థితిలో పాడి రైతులు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రం లాక్‌డౌన్‌ కావడం పాడిరైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోజువారీ పాల దిగుబడులను ఎలా విక్రయించాలనే అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ఆదివారం జనతా కర్ఫ్యూతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని హోటళ్లు, స్వీట్‌ షాప్‌లు, పాల ఉత్పత్తి సంస్థలు మూతపడ్డాయి. తాజాగా లాక్‌డౌన్‌తో ఈ నెల 31వరకు ఈ కేంద్రాలు తెరుచుకునే పరిస్థితి లేదు.దీంతో పాల దిగుబడులను ఎక్కడ విక్రయించాలో అర్థం కాని స్థితి నెలకొంది. రాష్ట్ర పశుసంవర్ధక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 36.79లక్షల పాలిచ్చే గేదెలు, ఆవులున్నాయి. వీటి ద్వారా రోజుకు సగటున 56.74లక్షల లీటర్ల పాలు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున కోటిన్నర లీటర్ల పాల డిమాండ్‌ ఉండగా... ఇందులో రెండొంతుల పాలు ఇతర రాష్ట్రాల నుంచే సరఫరా అవుతు న్నాయి. సరిహద్దులు మూసుకోవడంతో పొరుగు నుంచి వచ్చే దిగుబడులు నిలిచిపోగా... రాష్ట్రంలో ఉత్పత్తయ్యే పాల వినియోగం గణనీయంగా పడిపోయింది.

వాణిజ్య అవసరాలకే ఎక్కువ...
పాల ఎక్కువగా గృహ అవసరాల కంటే వాణిజ్య అవసరాలకే వినియోగిస్తున్నారు. దాదాపు 75శాతం పాల దిగుబడులు హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్‌ హౌస్‌లు, పాల ఉత్పత్తి చేపట్టే సంస్థలు కొనుగోలు చేస్తుండగా... మిగతా పాలు ప్యాకెట్లు, చిల్లర విక్రయాల ద్వారా అమ్ముతున్నారు. తాజా పరిస్థితులు గృహ అవసరాలకు సరిపడా పాలను విక్రయించడం కష్టం కాగా... హోటళ్లు, పాల ఉత్పత్తులు చేపట్టే వాణిజ్య సంస్థలు, వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో పాల డిమాండ్‌ గణనీయంగా పడిపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పాడిరైతులు రోజువారీ పాల దిగుబడులను సమీపంలోని పాల సేకరణ కేంద్రాల్లో విక్రయిస్తుంటారు.

కొంత మంది హోటళ్లు, రెస్టారెంట్లకు అందిస్తున్నప్పటికీ అలాంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది.కేంద్రాల ద్వారా సేకరించిన పాలను ఆయా నిర్వాహకులు ఇతర వాణిజ్య సంస్థలకు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రం లాక్‌ కావడంతో వాణిజ్య సముదాయాలు, వాపార సంస్థలు మూతపడ్డాయి. దీంతో పాల విక్రయం నిలిచిపోయింది. దీంతో  కేంద్రాలకు పాల దిగుబడులను తీసుకురావొద్దని పాడిరైతులను స్పష్టం చేస్తున్నారు. రోజువారీగా గృహ అవసరాల కోసం అమ్మకాలు జరుగుతున్నా ఎక్కువ మొత్తంలో పాలు మిగిలిపోతున్నాయి. దీంతో రోజువారీ దిగుబడులను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పాడి పశువులకు పశుగ్రాసం, దాణా తప్పదని, అందుకు ఖర్చులు భరించాల్సిందేనని, దీంతో నష్టపోతామని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన రైతు ‘సాక్షి’ వద్ద ఆందోళన వ్యక్తం చేశాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top