40 లక్షల మందికి రుణమాఫీ..!

Loan waiver to 40 lakhs of farmers - Sakshi

వ్యవసాయశాఖ అంచనా..

లక్ష రుణమాఫీకి కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల హామీల్లో కీలకమైన రూ.లక్ష రుణమాఫీకి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల పంటరుణాలను రూ.లక్ష మేర మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. 2014లో ప్రభుత్వం 35.29 లక్షలమంది రైతులకు రూ.లక్ష మాఫీ చేయగా, ఈసారి వారి సంఖ్య 40 లక్షలకు చేరవచ్చని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అప్పుడు రూ. 16,124 కోట్లు ఖర్చు చేయగా, ఈసారి రూ.20 వేల కోట్లకుపైనే ఖర్చు కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ప్రకటించే మార్గదర్శకాల ప్రకారమే ఎంతమందికి ఎంతెంత మాఫీ కానుందో స్పష్టంగా తేలనుంది. అప్పటివరకు కేవలం అంచనాలు మాత్రమే వేయగలమని అధికారులు చెబుతున్నారు. రుణమాఫీకి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే రుణమాఫీ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

నాలుగు సీజన్ల రుణాలు...
2014లో ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినప్పుడు అదే ఏడాది మార్చి నాటికి ఒక్కో రైతుకు ఉన్న పంట రుణాల్లో రూ.లక్షను నాలుగు విడతలుగా ప్రభుత్వం మాఫీ చేసింది. అంటే 2017 మార్చి వరకు మాఫీ సొమ్మును బ్యాంకులకు విడుదల చేసింది. ఈసారి 2017–18 ఖరీఫ్, రబీలు, 2018–19 ఖరీఫ్, రబీలలో పంటరుణాలు తీసుకున్న రైతులను పరిగణన లోకి తీసుకుంటారని వ్యవసాయవర్గాలు అంచనా వేస్తున్నా యి. వీటిల్లో ప్రస్తుత రబీని పరిగణనలోకి తీసుకోక పోవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే, రానున్న పార్లమెంటు ఎన్నికలను సర్కారు దృష్టిలో ఉంచుకుంటుందని, కాబట్టి ఈ 4 సీజన్లలో రైతులు తీసుకున్న రుణాల్లో రూ.లక్ష మేర మాఫీ చేస్తారన్న చర్చ మరోవైపు జరుగుతోంది. 2017–18 ఖరీఫ్, రబీల్లో 39.11 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. అం దులో ఖరీఫ్‌లో 26.20 లక్షల మంది, రబీలో 12.90 లక్షల మంది రైతులు రుణాలు తీసుకు న్నారు. ఆ ఏడాది రూ. 31,410 కోట్ల రుణాలను బ్యాం కులు రైతులకు ఇచ్చాయి. 2018–19లో ఇప్పటి వరకు 26.45 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వారికి బ్యాంకులు మొత్తం రూ.23,488 కోట్లు రుణాలు ఇచ్చాయి. అందులో ఈ ఖరీఫ్‌లో 22.21 లక్షల మంది రైతులు రూ.19,671 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుత రబీలో ఇప్పటివరకు 4.24 లక్షల మంది రైతులు రూ. 3,816 కోట్ల రుణాలు తీసుకున్నారు.

అప్పులు చెల్లించడానికి ముందుకురాని రైతులు
ప్రస్తుతం రుణాలు రీషెడ్యూల్‌ చేసుకునే సీజన్‌. సహజంగా రైతులు రబీకి సంబంధించి అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో పంట రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించి కొత్త రుణాలు తీసుకుంటుంటారు. అయితే, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నికల సమయంలో రుణమాఫీ ప్రకటించడంతో రైతులు రీషెడ్యూల్‌ చేయించుకోవడానికి ముందుకు రావడంలేదు. ఎలాగూ రుణాలు మాఫీ అవుతాయన్న నమ్మకంతో వారున్నారు. ఈసారి రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పడంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఒకేసారి రూ.20 వేల కోట్లు ఆపైనే ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందా అన్న అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేవలం రుణమాఫీకి రూ.20 వేల కోట్లు, రైతుబంధు పథకం నిమిత్తం ఎకరాకు రెండు సీజన్లకు రూ.10 వేల చొప్పున దాదాపు రూ.15 వేల కోట్లు కావాల్సి ఉంటుంది. అంటే, కేవలం ఈ రెండు పథకాల కోసమే రూ.35 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వం నిధులను ఎలా సర్దుబాటు చేస్తుందోనన్న చర్చ జరుగుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top