‘తుమ్మిళ్ల’పై ఏపీ అభ్యంతరం

Letter to Krishna Board on Kc canal will reduce water availability - Sakshi

     కేసీ కెనాల్‌కు నీటి లభ్యత తగ్గుతుందని కృష్ణా బోర్డుకు లేఖ 

     డీపీఆర్‌లు తమ ముందుంచాలని తెలంగాణను కోరిన బోర్డు 

     సుంకేశులలో నీటి లభ్యత ఉంటేనే తీసుకుంటామని ఇప్పటికే వివరణ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ చేపట్టిన తుమ్మిళ్లపై ఏపీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు కోసం కృష్ణాబోర్డు నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గత నెల 8న తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారని పేర్కొంది.

ఎలాంటి అనుమతుల్లేకుండానే, రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టు చేపడుతోందని వివరించింది. ఈ ఎత్తిపోతల కారణంగా రాయలసీమ ప్రాంతాలకు నీటిని తరలించే కేసీ కెనాల్‌కు నీటి లభ్యత తగ్గుతుందని, దీంతో రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలకు కొరత ఏర్పడుతుందని తెలిపింది. ఈ దృష్ట్యా తుమ్మిళ్లను అడ్డుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన కృష్ణాబోర్డు తుమ్మిళ్ల ఎత్తిపోతలకు సంబంధించి డీపీఆర్‌లను తమ ముందుంచాలని తెలంగాణను ఆదేశించింది.  

ఇప్పటికే ఓసారి ఏపీ ఫిర్యాదు.. 
తుమ్మిళ్లకు రూ.783 కోట్లతో పరిపాలనా అనుమతులిచ్చిన వెంటనే దీనిపై గతేడాది ఏప్రిల్‌లోనే ఏపీ తన అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై బోర్డు వివరణ కోరగా, తెలంగాణ సమాధానం ఇచ్చింది. ‘బచావత్‌ ట్రిబ్యునల్‌ ఆర్డీఎస్‌ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటిని కేటాయించింది. అయితే కాల్వల పూడిక కారణంగా తెలంగాణకు దక్కుతున్న వాటా గరిష్టంగా 4 టీఎంసీలు దాటట్లేదు. దీంతో ఆర్డీఎస్‌ కింద 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉన్నా 30 వేల ఎకరాలకు సైతం అందట్లేదు.

ఈ దృష్ట్యానే నీరందని 55,600 ఎకరాలకు సాగునీరు, దారిలోని గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో సుంకేశుల బ్యాక్‌వాటర్‌ ఫోర్‌షోర్‌లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించాం. తుంగభద్ర జలాల్లో నీటిప్రవాహం ఉన్నప్పుడే నీటిని తీసుకుంటాం. దీనివల్ల సుంకేశులకు ఎలాంటి నష్టం లేదు’అని వివరణ ఇచ్చింది. అయినా కూడా ఏపీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేయడంతో కృష్ణా బోర్డు తెలంగాణను వివరణ కోరింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top