‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం

The launch of 'Sakshi' property show

     కూకట్‌పల్లి భ్రమరాంబిక కల్యాణ మండపంలో నిర్వహణ 

     ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో సందర్శకులు 

     నేటి సాయంత్రం వరకు కొనసాగనున్న షో 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో మెట్రో రైలు పరుగులు మొదలయ్యాక స్థిరాస్తి రంగంలో సానుకూల వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో నగరంలోని నివాస, వాణిజ్య సముదాయాల సమాచారం కొనుగోలుదారులకు అందితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇదే లక్ష్యంతో ‘సాక్షి’ఆధ్వర్యంలో శనివారం ‘మెగా ప్రాపర్టీ షో’ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం వరకు ఈ షో కొనసాగనుంది.

ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా) వంటి వాటితో నగర నిర్మాణ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇలాంటి సమయంలో మెట్రో రైలు పరుగులు, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లతో మార్కెట్‌ మెరుగవటమే కాక నగరం పేరు విశ్వవ్యాప్తమైంది. మళ్లీ నగరంలోని ప్రాపర్టీలకు డిమాండ్‌ పెరిగింది..’’అని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశముందని, కాబట్టి సొంతింటి కొనుగోలుకు ఇదే సరైన సమయమని సూచించారు. 

మెట్రో మార్గంలోనే.. 
సాక్షి అడ్వర్టైజ్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ కేఆర్పీ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఏ ప్రాంతంలో ఎంత ధర ఉందో, ఏ నిర్మాణ సంస్థ ఎక్కడ ప్రాజెక్టులు చేస్తోందో, వసతులు, అభివృద్ధి చెందే ప్రాంతం ఏదో తెలుసుకోవటం కాసింత కష్టం. వీటన్నింటికీ సమాధానం ‘సాక్షి ప్రాపర్టీ షో’. ఆరేళ్లుగా ఏటా రెండు సార్లు ఈ షో ను నిర్వహిస్తున్నాం. డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరి వైపు నుంచి మంచి స్పందన వస్తోంది..’’అని చెప్పారు. మెట్రో రైలు పరుగులు పెడుతున్న ప్రాంతాల్లో ప్రాపర్టీల గురించి వాకబు పెరిగిందన్నారు. అందుకే మియాపూర్‌– నాగోల్‌ ప్రాంతంలో ప్రాపర్టీ షోలను నిర్వహించాలని భావించి.. కూకట్‌పల్లిలో ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో సాక్షి అడ్వర్టైజ్‌మెంట్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్, జీఎం రమణ కుమార్, మధు, పాపారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top