మూడు ముళ్ల బాల్యం

A large number of child marriages in the state - Sakshi

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో బాల్య వివాహాలు

రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది బాల్య వివాహ బాధితుల దుస్థితి ఇదీ. ఆడపిల్లను బాధ్యత, బరువుగా భావిస్తున్న తల్లిదండ్రులు.. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా పాఠశాల చదువుకూడా పూర్తికాకుండానే అమ్మాయిలకు పెళ్లి చేసేస్తున్నారు. వారికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు, బంధువులు ఒత్తిడి చేసి బలవంతంగా పెళ్లి పీటల మీద కూర్చోబెడుతున్నారు. పెళ్లి, సంసారం, జీవితమంటే ఏమిటో పూర్తిగా తెలియని వయసులోనే బంధాల బాధ్యతల్లో బందీ అవుతున్నారు. దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో 1.5 కోట్ల మందికి బాల్య వివాహాలు జరగగా.. అందులో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఉన్నట్లు ఎంవీ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో గత మూడేళ్లలో 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో 19.4 శాతం మందికి, అబ్బాయిల్లో 4.7 శాతం మందికి బాల్య వివాహం జరిగినట్లు తేలింది. ఎంవీ ఫౌండేషన్‌ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు, పాఠశాలలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పలు ప్రభుత్వ విభాగాల నుంచి సమాచారం సేకరించింది. బాల్య వివాహాలు చేసుకున్నవారిలో 46 మందిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి.. వారి ప్రస్తుత పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది. 

నిర్బంధ పరిస్థితులు
బాల్య వివాహం జరిగిన అమ్మాయిల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. వారు సంసారం, కుటుంబం, పిల్లల బరువు బాధ్యతలతో ఓ వైపు.. ఆరోగ్య సమస్యలతో మరోవైపు కొట్టుమిట్టాడుతున్నారు. తమ ఆరోగ్య సమస్యల గురించి భర్తకు చెప్పుకోలేని నిర్బంధ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కూలీ పనో, ఏదైనా ఉద్యోగమో చేసి సంపాదించడానికి తోడు కుటుంబంలోని అందరికీ పనులు చేసి పెట్టడం, చాకిరీ చేయడం తప్పడం లేదు. దేనికి నిరాకరించినా భర్త, అత్తమామల దాడులకు గురికావాల్సి వస్తోంది. కొందరైతే కుటుంబ సభ్యుల నుంచే లైంగిక దాడులకూ గురవుతున్నారు. ఈ బాధలన్నీ పడలేక చాలా మంది ఆత్యహత్యాప్రయత్నాలు కూడా చేసినట్లు సర్వేలో వెల్లడైంది. 

పాలమూరు టాప్‌.. కరీంనగర్‌ లాస్ట్‌ 
బాల్య వివాహాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల బాల్య వివాహాలు జరిగితే.. మహబూబ్‌నగర్‌లోనే 26.2 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాల్లో నల్లగొండ (21.5 శాతం), రంగారెడ్డి (21.1 శాతం), ఖమ్మం, మెదక్‌ (21 శాతం), వరంగల్‌ (18 శాతం), ఆదిలాబాద్‌ (17.8 శాతం), నిజామాబాద్‌(16.3 శాతం), కరీంనగర్‌ (14.2 శాతం) జిల్లాలు ఉన్నట్టు ఎంవీ ఫౌండేషన్‌ సర్వేలో వెల్లడైంది.

ఆమె పేరు రమ్య.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ బస్తీలో ఉండే ఆమెకు 14 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. సంసారం అంటే ఏమిటో పూర్తిగా తెలియని స్థితి. పెళ్లయిన తొలిరాత్రే తీవ్ర నరకాన్ని అనుభవించింది. భర్త రోజు కూలీ. రోజూ మద్యం తాగి రావడం, వంట సరిగ్గా చేయలేదనో, డబ్బులు అడుగుతోందనో కొట్టడం, వేధించడం.. పెళ్లయిన ఈ రెండేళ్లలోనే రెండు కాన్పులు. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో తొలికాన్పులో పుట్టిన పాప ఆరోగ్యం సరిగా లేక చనిపోయింది. రెండో కాన్పులో పుట్టిన పాప ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు. భర్త, అత్తమామలు పట్టించుకోరు. ఏం చేయాలో తెలియని ఆవేదనలో కొట్టుమిట్టాడుతోంది..

ఆమె పేరు పరమేశ్వరి.. వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలు. 14 ఏళ్లకే మేనబావతో పెళ్లి చేసేశారు. కొద్దిరోజులకే గర్భం దాల్చింది. చిన్న వయసు, సరైన పోషకాహారం లేక శిశువు సరిగా ఎదగలేదు. పుట్టగానే చనిపోయింది. మరోసారి కూడా ఇలాగే జరిగింది. కొద్దినెలలకే మూడోసారి గర్భం దాల్చింది. ఈ సారి కడుపులో బిడ్డ సరిగా పెరగడం లేదని, ఇన్ఫెక్షన్‌ సోకిందని గర్భసంచి తీసేశారు. ఇక పిల్లలు పుట్టరనే ఆగ్రహంతో పరమేశ్వరిని భర్త, అత్తమామలు హింసించడం మొదలుపెట్టారు. రెండేళ్ల నుంచి నరకయాతన పడుతోంది.. 
– సాక్షి, హైదరాబాద్‌

బాల్య వివాహంతో ఎంతో యాతన
- బాల్య వివాహం జరిగిన బాలికల్లో 67 శాతం మంది తమ సమస్యలను భర్తకు చెప్పుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 
- 90% మంది బాధితులకు అనారోగ్య సమయంలో ఎలాంటి సహాయం అందడం లేదు. 
- 73% మంది భర్తలు నిత్యం మద్యం తాగడం, దాడికి పాల్పడడం చేస్తున్నారు. మిగతావారిలోనూ చాలా మంది తరచూ మద్యం తాగుతున్నారు. 
- 91% మంది భర్తలు రాత్రి 12 గంటల తర్వాత ఇంటికి వస్తున్నట్లు సర్వేలో తెలిసింది. 
- 85% బాధిత మైనర్లు పుట్టింటికి వెళ్లడానికి కూడా సరిగా అవకాశం ఉండడం లేదని సర్వేలో వెల్లడించారు. 
- 89% మంది బాధితులు కూలి పని చేయాల్సి వస్తోంది. భర్త చేతిలో భౌతిక దాడులకు గురవుతున్నారు. 
- 71% మంది అత్తమామల ద్వారా వేధింపులకు గురవుతున్నారు. 
- 78% మంది బాధిత అమ్మాయిలు గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్నారు.  
- 15% మంది మానసికంగా కుంగిపోయారు. 37% మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. 
- అసలు ఏ ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడవలేదు. 
- బాల్య వివాహ బాధితుల్లో 59% మంది పెళ్లికి ముందు దినసరి కూలీలుగా పనిచేసినవారేనని.. పెళ్లి తర్వాత కూడా 41% మంది కూలిపనికి వెళుతున్నారని సర్వేలో తేలింది. 

అంతా 8, 10 తరగతి లోపే.. 
బాల్య వివాహాలు జరిగినవారిలో చాలా మంది 13 నుంచి 15 ఏళ్లలోపు వారే. 8వ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న సమయంలోనే బలవంతంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత చదువుకునే అవకాశం కేవలం 3% మందికే లభించింది. బాల్య వివాహాలు జరిగినవారిలో 83% మంది భర్తతో కలసి ఉండగా.. 11% మంది వేరుగా ఉంటున్నారు. 4% మంది విడాకులు తీసుకున్నారు. 2 శాతం మంది వితంతువులున్నారు.

ఆడపిల్లను కంటే వేధింపులు 
జరిగిందే బాల్య వివాహం. ఆపై ఆడపిల్ల పుట్టిందంటే ఇక వేధింపులే. బాల్య వివాహాలు జరిగిన అమ్మాయిల్లో 62 శాతం మంది తొలికాన్పులో ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఇలాంటి అమ్మాయిల్లో 74 శాతం మంది అత్తమామల అసంతృప్తి, వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే విధంగా 50 శాతం మంది భర్తలు వేధింపులకు దిగుతున్నారు. ప్రసవించి నాలుగైదు నెలలు కాకుండానే కూలి పనులకు పంపిస్తున్నారు. సంపాదించిన డబ్బును కూడా భర్త, అత్తమామలే తీసుకుంటున్నారు. డబ్బులు అడిగితే దాడులు సైతం ఎదుర్కోవాల్సిన దుస్థితి ఉంది. 

అధికశాతం బీసీలే.. 
బాల్య వివాహాలు జరిగిన వారిలో అత్యధికం వెనుకబడిన తరగతుల వారే. బాల్య వివాహాల్లో 43 శాతం బీసీ కులాలకు చెందినవారుకాగా.. 36 శాతం షెడ్యూల్‌ కులాలు, 15 శాతం గిరిజన తెగలకు చెందిన వారున్నట్టు సర్వేలో వెల్లడైంది. 

చట్టాలున్నా చట్టుబండలే..! 
బాల్య వివాహాల నియంత్రణకు 2006లో కఠిన చట్టం తీసుకువచ్చారు. దానికితోడు జువైనల్‌ జస్టిస్‌ చట్టం, బాలల లైంగిక వేధింపుల నియంత్రణ చట్టం, విద్యాహక్కు చట్టం.. ఇలా అనేక చట్టాలున్నా బాల్య వివాహాలు మాత్రం పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. రోజురోజుకూ ఆధునికత, టెక్నాలజీ, విద్యాభివృద్ధి పెరుగుతున్నా ఇప్పటికీ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. 

పేదరికం, నిరక్షరాస్యతే కారణం 
కడు పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల్లోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కుటుంబాల్లో 79 శాతం కుటుంబాల ఏడాది సంపాదన రూ.50 వేలలోపే ఉంటోంది. 16 శాతం కుటుంబాల్లో రూ.51 వేల నుంచి రూ.75 వేల ఆదాయం ఉంటోంది. కేవలం 5 శాతం కుటుంబాలు మాత్రమే రూ.లక్షకుపైగా వార్షికాదాయం ఉన్నవారు. ఇక తల్లిదండ్రుల్లో పెద్దగా చదువుకున్న వాళ్లు లేకపోవడం సైతం బాల్య వివాహాలకు కారణమవుతోంది. ఇలాంటి వివాహాలు జరుగుతున్న కుటుంబాల్లో 91 శాతం మంది తల్లిదండ్రులు నిరక్షరాస్యులే. ఆరు శాతం మంది 5వ తరగతి వరకు, మూడు శాతం మంది ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top