తెలంగాణది భిన్నమైన ముద్ర

KTR Participated USIBC Webinar With Jayesh Ranjan - Sakshi

ఇతర రాష్ట్రాలతో పోల్చితే మెరుగైన పరిస్థితులున్నాయి

ఇక్కడ పెట్టుబడులకు అపార అవకాశాలు

యూఎస్‌ఐబీసీ వెబ్‌నార్‌లో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ కంపెనీలు మొత్తం భారతదేశాన్ని ఒక యూనిట్‌గా కాకుండా తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలను భిన్న యూనిట్‌గా పరిగణించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. యూఎస్‌ఐబీసీ ఇన్వెస్ట్‌మెంట్‌ వెబ్‌నార్‌లో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. స్థూలంగా అన్ని రాష్ట్రాలను కలిపి చూసినప్పుడు, ప్రత్యేకంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు పెట్టుబడి అవకాశాల్లో చాలా తేడా ఉంటుందన్నారు. గత ఆరేళ్లలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో భిన్నంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ తనదైన ముద్ర వేసిందన్నారు.

ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలతో రాష్ట్రం వినూత్న పంథాలో పురోగమిస్తోందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌–ఐపాస్‌ విధానం కింద కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అన్ని రకాల అనుమతులిస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ విధానం విజయవంతం అయిందని, అనుమతులు ఇచ్చిన వాటిలో 80 శాతానికి పైగా పరిశ్రమలు కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ వంటి 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించిందన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.

కరోనా సంక్షోభంలో ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలబడుతుందన్నారు. రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్, ఫార్మా రంగానికి సంబంధించి అనుకూల వాతావరణం ఉందని, ప్రస్తుతం అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా మందులపై ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అనేక ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత అతి పెద్ద ప్రాంగణాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయన్నారు. దేశంలోనే అతిపెద్ద మెడికల్‌ డివైస్‌ పార్క్‌ తెలంగాణలో ఉందని, ఈ రంగంలోనూ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇ

న్వెస్ట్‌మెంట్‌ వెబ్‌నార్‌లో పాల్గొన్న అమెరికన్‌ కంపెనీల అధినేతలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా టీ–ఐపాస్‌ విధానం, ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న మద్దతుపైన తెలంగాణ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల అధినేతలు ప్రశంసించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని యూఎస్‌ఐబీసీ అధ్యక్షురాలు నిషా బిశ్వాల్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top