రాష్ట్ర పురోగతికి గుర్తింపు | KTR in the india today awards | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పురోగతికి గుర్తింపు

Nov 17 2017 1:28 AM | Updated on Nov 17 2017 1:28 AM

KTR in the india today awards - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక రంగం, స్వచ్ఛతలో పురోగతికి గుర్తింపుగా రాష్ట్రానికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఇండియా టుడే ఏటా నిర్వహిస్తున్న స్టేట్‌ ఆఫ్‌ ద స్టేట్స్‌ కాన్‌క్లేవ్‌–2017 సదస్సు గురువారం ఢిల్లీలో జరిగింది. ఆర్థిక, స్వచ్ఛత రంగాల్లో పురోగతికి రాష్ట్రానికి రెండు బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ లార్జ్‌ స్టేట్‌ అవార్డులు ప్రదానం చేసింది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా మంత్రులు కేటీఆర్, జోగు రామన్న అందుకున్నారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో సాధిస్తున్న పురోగతికి గుర్తింపుగా గత మూడేళ్లుగా ఇండియా టుడే అవార్డులు అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మొదటి ఏడాది రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధికి, రెండో ఏడాది సమ్మిళిత వృద్ధికి, ఈ ఏడాది ఆర్థిక, స్వచ్ఛత రంగాల్లో పురోగతికి అవార్డులు దక్కడం హర్షణీయమన్నారు. జీడీపీ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. జోగు రామన్న మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. తెలంగాణను హరిత హారంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వివేక్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్ర తెజావత్‌ తదితరులు పాల్గొన్నారు. 

జాతీయ హోదా ఇవ్వండి..
ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్లే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని మంత్రి కేటీఆర్‌ కోరారు. అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా కేటీఆర్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో రోడ్ల విస్తరణకు, రహదారుల నిర్మాణాలకు సహకరిస్తున్నందుకు గడ్కరీకి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ఆర్‌సీ అరవింద్‌ కుమార్‌ గురువారం మలేసియా ఆర్థిక వ్యవహారాల మంత్రి ఇక్బాల్‌ మహ్మద్‌నూర్‌ నేతృత్వంలోని బృందంతో ఢిల్లీలో సమావేశమై చర్చలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement