పురపాలనలో పౌరుడే పాలకుడు : కేటీఆర్‌

KTR Addressed Muncipal Commissioners In Hyderabad About New municipal laws In Hyderabad - Sakshi

పురపాలనలో పౌర భాగసామ్యాన్ని పెంచాలి

మూడు నెలలకోసారి మున్సిపల్ కమీషనర్లతో సమావేశం

ప్రజల అకాంక్షల కోసం మున్సిపల్ కమీషనర్లు పనిచేయాలి

సాక్షి,హైదరాబాద్‌ : పురపాలనలో పౌరుడే పాలకుడని, ఇదే నూతన పురపాలక చట్ట స్పూర్తి అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పురపాలక శాఖ రెండు రోజుల పాటు  మున్సిపల్ కమీషనర్లతో నిర్వహించిన నూతన పురపాలక చట్టం సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పాత చట్టంతో పొల్చితే నూతన చట్టంలో వచ్చిన సంస్కరణలు, మార్పులు, టౌన్ ప్లానింగ్ అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు పౌరసేవలను పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా వేగంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన చట్టాన్ని రూపొందించిందని కేటీఆర్ తెలిపారు.

ప్రజలకోసం, పౌర సేవల కోసం, పాలనా సౌలభ్యం కోసం నూతన చట్టం పనిచేస్తుందని తెలిపారు. ప్రజలతో మమేకమై తన రాజకీయ జీవితాన్ని సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు అవసరమయిన పలు సంస్కరణలను ఈ చట్టం ద్వారా తీసుకువచ్చారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేకుండా చేయడం, భవన నిర్మాణాల కోసం సెల్ప్ సర్టిఫికేషన్ వంటి నూతన నిబంధనలు ఇలాంటి స్పూర్తిలోంచి వచ్చినవేనని తెలిపారు. అందరం కలిసి నూతన పురపాలక చట్టం స్పూర్తిని కొనసాగిస్తూ దాన్ని అమలు చేద్దాం అన్నారు. ప్రజలు కోరుకుంటున్న పారిశుద్యం, గుడ్ గవర్నెన్స్‌, పారదర్శకమైన పాలనను అందించేందుకు కలిసి ముందుకు సాగుదామని అధి​కారులకు దిశానిర్దేశం చేశారు. వారం రోజుల్లో మున్సిపల్ కమీషనర్లు తమ సిబ్బందితోనూ నూతన మున్సిపల్ చట్టంపై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

పురపాలనలో విస్తృతమైన అనుభవం ఉన్న కమీషనర్లు చట్టంలో లేని వినూత్నమైన పద్దతుల్లో పనిచేసి పట్టణాలకు మరింత శోభ తీసుకువస్తామంటే తాము మద్దతిస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో సిద్దిపేట, సిరిసిల్లా, వరంగల్, సూర్యాపేట, పీర్జాదీగూడ మున్సిపాలీటీలు వివిధ అంశాల్లో జాతీయస్ధాయిలో గుర్తింపు పొందేలా పనిచేస్తున్నాయని, వాటిని పరిశీలించాలని మంత్రి కమీషనర్లను కోరారు. దీంతోపాటు జాతీయస్ధాయిలో పురపాలనలో విన్నూతమైన పద్దతులను అనుసరిస్తున్న పట్టణాలను అధ్యయనం చేసేందుకు మావంతు సహకారం అందజేస్తామన్నారు.

పురపాలనలో టెక్నాలజీ వినియోగం ద్వారా పాదర్శకత మరింత పెరుగుతుందన్న మంత్రి, సామాజిక మాద్యమాలను సైతం వినియోగించుకుంటూ ప్రజల భాగసామ్యాన్ని పెంచాలన్నారు. ప్రతి మూడు నెలలకోసారి రాష్ర్టస్థాయిలో మున్సిపల్ కమీషనర్లతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. వివిధ అంశాల్లో ఉత్తమ సేవలు అందించిన పురపాలక సంఘాల కమీషనర్లకు మంత్రి పురస్కారాలను అందించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహాన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియొద్దీన్, జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేష్ కూమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top