టెలీమెట్రీ లోపభూయిష్టం!

Krishna Board Commented telemetric System - Sakshi

తేల్చిన కృష్ణా బోర్డు కమిటీ

అవసరమున్నచోట ఏర్పాటుకు సూచనలు

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఏర్పాటుచేసిన టెలీమెట్రీ వ్యవస్థ అంతా లోపభూయిష్టంగా ఉందని కృష్ణాబోర్డు నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. టెలీమెట్రీ ఏర్పాటుచేసిన ప్రాంతాలు, పరికరాల ఎంపిక అంతా తప్పులతడకగా ఉందని స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరికరాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని, వేరే రకమైన పరికరాలు, సాంకేతికంగా అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది. కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో మొదటి విడతలో 18 చోట్ల టెలీమెట్రీలు ఏర్పాటు చేశారు.

ఇందులో పోతిరెడ్డిపాడు కింది నీటి వినియోగంపై అనేక ఆరోపణలొచ్చాయి. దీనికితోడు ఇక్కడ ఏర్పాటుచేసిన టెలీమెట్రీని ట్యాంపరింగ్‌ చేసి లెక్కలు తారుమారు చేశారని గత బోర్డు సమావేశంలో తెలంగాణ ఫిర్యాదు చేసింది. అయితే టెలీమెట్రీలు అధికారికంగా అమల్లోకి రానందున ట్యాంపరింగ్‌ అవకాశం లేదని బోర్డు వివరణ ఇచ్చింది. అయినా కూడా కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీనిపై టెలీమెట్రీ వ్యవస్థలో అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులతో కమిటీ వేసిన కృష్ణా బోర్డు వారితో అధ్యయనం చేయించింది. పోతిరెడ్డిపాడుసహా నాగార్జునసాగర్, జూరాల పరిధిలో పర్యటించి టెలీమెట్రీ వ్యవస్థల తీరును కమిటీ పరిశీలించి రెండ్రోజుల కిందట నివేదిక ఇచ్చింది.

పీఆర్పీ దిగువన 600 మీటర్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటు జరగాల్సి ఉండగా, దాన్ని అనంతరం 12.26 కిలోమీటర్‌ వద్దకు మార్చారు. ఇక్కడ అమర్చిన నాన్‌–కాంటాక్ట్‌ రాడార్‌ వెలాసిటీ సెన్సర్‌ అనువైనది కాదని, అసలు ఆ పాయింట్‌ కూడా అనువైనది కాదని కమిటీ గుర్తించింది. పీఆర్పీ కాల్వ మూడో కిలోమీటర్‌ వద్ద సైడ్‌లుకింగ్‌ అకౌస్టిక్‌ డాప్లర్‌ సెన్సర్‌ అమర్చి పరిశీలిస్తే వాస్తవ డిశ్చార్జి లెక్కలు వచ్చాయని కమిటీ తన నివేదికలో తెలిపింది. లెవల్, వెలాసిటీ సెన్సర్లు కేవలం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్ల వద్ద తప్ప మిగిలిన ఎక్కడా సరైన డిశ్చార్జీని సూచించడం లేదని కమిటీ పేర్కొంది. టెలీమెట్రీ ప్రాంతాలపై పునఃపరిశీలనతో పాటు సరైన పరికరాలు ఏర్పాటుచేయాలని కమిటీ సిఫారసు చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top