breaking news
sysytem
-
టెలీమెట్రీ లోపభూయిష్టం!
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఏర్పాటుచేసిన టెలీమెట్రీ వ్యవస్థ అంతా లోపభూయిష్టంగా ఉందని కృష్ణాబోర్డు నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. టెలీమెట్రీ ఏర్పాటుచేసిన ప్రాంతాలు, పరికరాల ఎంపిక అంతా తప్పులతడకగా ఉందని స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరికరాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని, వేరే రకమైన పరికరాలు, సాంకేతికంగా అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది. కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో మొదటి విడతలో 18 చోట్ల టెలీమెట్రీలు ఏర్పాటు చేశారు. ఇందులో పోతిరెడ్డిపాడు కింది నీటి వినియోగంపై అనేక ఆరోపణలొచ్చాయి. దీనికితోడు ఇక్కడ ఏర్పాటుచేసిన టెలీమెట్రీని ట్యాంపరింగ్ చేసి లెక్కలు తారుమారు చేశారని గత బోర్డు సమావేశంలో తెలంగాణ ఫిర్యాదు చేసింది. అయితే టెలీమెట్రీలు అధికారికంగా అమల్లోకి రానందున ట్యాంపరింగ్ అవకాశం లేదని బోర్డు వివరణ ఇచ్చింది. అయినా కూడా కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీనిపై టెలీమెట్రీ వ్యవస్థలో అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులతో కమిటీ వేసిన కృష్ణా బోర్డు వారితో అధ్యయనం చేయించింది. పోతిరెడ్డిపాడుసహా నాగార్జునసాగర్, జూరాల పరిధిలో పర్యటించి టెలీమెట్రీ వ్యవస్థల తీరును కమిటీ పరిశీలించి రెండ్రోజుల కిందట నివేదిక ఇచ్చింది. పీఆర్పీ దిగువన 600 మీటర్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటు జరగాల్సి ఉండగా, దాన్ని అనంతరం 12.26 కిలోమీటర్ వద్దకు మార్చారు. ఇక్కడ అమర్చిన నాన్–కాంటాక్ట్ రాడార్ వెలాసిటీ సెన్సర్ అనువైనది కాదని, అసలు ఆ పాయింట్ కూడా అనువైనది కాదని కమిటీ గుర్తించింది. పీఆర్పీ కాల్వ మూడో కిలోమీటర్ వద్ద సైడ్‌లుకింగ్ అకౌస్టిక్ డాప్లర్ సెన్సర్ అమర్చి పరిశీలిస్తే వాస్తవ డిశ్చార్జి లెక్కలు వచ్చాయని కమిటీ తన నివేదికలో తెలిపింది. లెవల్, వెలాసిటీ సెన్సర్లు కేవలం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల వద్ద తప్ప మిగిలిన ఎక్కడా సరైన డిశ్చార్జీని సూచించడం లేదని కమిటీ పేర్కొంది. టెలీమెట్రీ ప్రాంతాలపై పునఃపరిశీలనతో పాటు సరైన పరికరాలు ఏర్పాటుచేయాలని కమిటీ సిఫారసు చేసింది. -
పాఠశాలల్లో డిటెన్షన్
పరిశీలనలో 5, 8 తరగతులకు డిటెన్షన్ విధానం విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు రాష్ట్రంలో అమలును అడ్డుకుంటామని హెచ్చరిక భానుగుడి(కాకినాడ): ప్రభుత్వ బడి మౌలిక సదుపాయాలకు దూరంగా, నాణ్యమైన విద్యకు నోచుకోకుండా ఉంది. అధికారుల పర్యవేక్షణ లేక అత్యధిక శాతం విద్యార్థులు అరకొరగా హాజరవుతున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లోనూ తెలుగుమీడియం రద్దు చేయడంతో విద్యార్థులు టీసీల బాట పట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలల్లో కృత్యాధార భోధన, నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం అమలవుతోంది. విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో రిషివ్యాలీ విద్యావిధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం కేంద్ర మానవవనరుల శాఖామంత్రి ప్రకాష్ జవదేకర్ 5, 8 తరగతులకు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం అన్నీ వడివడిగా జరిగిపోతున్నాయి. దీంతో ఇప్పటినుంచే అటు ఉపాధ్యాయుల్లోను, ఇటు విద్యార్థుల్లోనూ ఆందోళన మొదలైంది. ఎఫెక్ట్ @3లక్షలు జిల్లాలో 3314 ప్రాధమిక పాఠశాలలున్నాయి. ఇందులో 1,51,815 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు 42,800 మంది ఉన్నారు. అదేవిధంగా 1589 ప్రైవేటు పాఠశాలల్లో 96,000 మంది విద్యార్థులున్నారు. జిల్లాలో ఉన్న 660 ఉన్నత పాఠశాలల్లో 2,30,247 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ఎనిమిదో తరగతిలో ఉన్న విద్యార్థులు 56 వేలమంది ఉన్నారు. జిల్లాలో ఉన్న ప్రైవేటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో లక్షకు పైగా విద్యార్థులున్నట్లు అంచనా. మొత్తంగా 2,94,800 మంది విద్యార్థులు జిల్లాలో 5, 8 తరగతులు అభ్యసిస్తున్నారు. జవదేకర్ ప్రవేశపెట్టనున్న బోర్డు పరీక్షల విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడితే వీరి విధాభ్యాసం మీద తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. డ్రాపవుట్లు పెరుగుతారు విద్యావిషయిక కేంద్ర సలహామండలి(సిఏబిఈ)ప్రవేశపెట్టిన ఈ విధానానికి 24రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. అయితే రాష్ట్రంలో ఈ విధానం అమలులోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు విపరీతంగా పెరగుతారని ఉపాధ్యాయుల అభిప్రాయపడుతున్నారు. 5,8 తరగతుల పరీక్షల్లో విద్యార్థి ఫెయిలైతే ఆత్మన్యూనతకు గురై ఇంటిబాట పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటుంటే, ఇలాంటి విధానం రావడం వల్లవిద్యార్థి 5 నుంచి6వ తరగతిలో ప్రవేశించేనాటికి కావాల్సిన విజ్ఞానంతో అడుగు పెడతాడని, ఉన్నత విద్యకు వచ్చినా కొందరి విద్యార్థులతో అక్షరాలు దిద్దించాల్సిన ఆఘత్యం ఉపా«ధ్యాయునికి ఉండందంటున్నారు మరికొందరు. అడ్డుకుంటాం ఈ విధానం రాష్ట్రంలో అమలైతే డ్రాపవుట్లు పెరిగి మరిన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న విద్యావిధానంలో లోపాలుండి, ఫెయిలైతే కొత్త విధానాన్ని అమలుపరచాలి. 5,8 విద్యార్థులకు బోర్డు పరీక్షలు అవసరం లేదు. 1971లో డిటెన్షన్ విధానం పెట్టారు. 1975 లో తీసేశారు. హాజరు ఆధారంగా విద్యార్థిని తర్వాతి తరగతికి ప్రమోషన్ చేస్తున్నారు. అక్షరాస్యత పెరిగిన మాట వాస్తవం.విద్యార్థులో నాణ్యత వచ్చిందనడానికి ఆధారాలు లేవు. - బీవీ రాఘవులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాన్ డిటెన్షన్ విధానమే మేలు ప్రస్తుతం అమలులో ఉన్న నాన్‌డిటెన్షన్ విధానమే మేలు. కొత్త విధానం అవసరం లేదు. బోర్డు పరీక్షల కారణండా బడి మానేసే విద్యార్థులు ఎక్కవ మంది ఉండొచ్చు. కానీ స్థాయి పెరిగే కొద్దీ నాణ్యతతో కూడిన విద్యార్థులు ఉన్నత చదువులకు వచ్చే అవకాశం ఉంది. పి.సుబ్బరాజు, ఎస్టీయూ జిల్లా అ«ధ్యక్షుడు స్వాగతిస్తాం..! మారుతున్న ప్రపంచీకరణకు అనుగుణంగా విద్యార్థి పరుగెత్తాలంటే కొత్త విధానాన్ని స్వాగతించాలి. బోర్డు పరీక్షలు డిటెన్షన్ విధానం ద్వారా విద్యార్థికి మేలు జరగుతుంది. పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉపాధ్యాయులు ఈ విధానాన్ని స్వాగతించాలి. - చింతాడ ప్రదీప్‌కుమార్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి