త్వరలో కేసులువేసేందుకు సిద్ధంఅవుతున్న ప్రభుత్వం
ఇప్పటికే బనకచర్లడీపీఆర్ తయారీకిఏపీ టెండర్లు
ఆల్మట్టి ఎత్తు పెంపు కోసం భూసేకరణకు కర్ణాటక గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతోపాటు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు పొరుగు రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్లు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖతోపాటు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు డీపీఆర్ తయారీతోపాటు అవసరమైన పరిశోధనలు, కేంద్ర అనుమతులకు సహకారం కోరుతూ ఏపీ జలవనరుల శాఖ గత నెల 7న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి గత మే 22న పీఎఫ్‌ఆర్ (ప్రీ ఫీజబులిటీ రిపోర్టు)ను ఏపీ సమర్పించింది. దీనిపై సీడబ్ల్యూసీ అభిప్రాయాలను కోరింది.
తెలంగాణ సహా బేసిన్ పరిధిలోని ఇతర రాష్ట్రాలు, గోదావరి, కృష్ణా బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథా రిటీ (పీపీఏ)తోపాటు సీడబ్ల్యూసీ ఈ ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి నిర్వహించాల్సిన పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ)కు నియమ, నిబంధనలు (టీవోఆర్) జారీ చేయాలని ఏపీ చేసుకున్న దరఖాస్తును కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) జూన్ 30న తోసిపుచ్చింది.
గోదావరిలో వరద జలాల లభ్యత.. అంతర్రాష్ట్ర అనుమతి తీసుకున్నాకే టీవోఆర్ కోసం దరఖాస్తు చేసు కోవాలని స్పష్టం చేసింది. అయినా ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన విషయంలో ఏపీ ముందుకు వెళ్లడం.. ఆ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి కేంద్రం చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టుకెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆల్మట్టిపై కర్ణాటక ఎత్తులు
ఆల్మట్టి డ్యామ్‌లో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పనులను 2002 నాటికే కర్ణాటక సర్కార్ పూర్తి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2002–03 నుంచి 519.06 మీటర్ల ఎత్తులో 129.72 టీఎంసీల మేరకే నీటిని నిల్వ చేస్తోంది. డ్యామ్ ఎత్తు పెంపు పనులు పూర్తి చేశామని.. నీటి కేటాయింపులు చేయకపోతే ఆ పనులకు చేసిన వ్యయం వృథా అవుతుందని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట కర్ణాటక సర్కార్ వాదించింది.
నిధులు వృథా అవుతాయన్న వాదనతో ఏకీభవించిన ట్రిబ్యునల్.. అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యతగా కేటాయించిన 173 టీఎంసీల జోలికి వెళ్లకుండా 65 శాతం లభ్యత ఆధారంగా అదనంగా 130 టీఎంసీలను కేటాయించింది. ఈ క్రమంలో ఆల్మట్టి డ్యామ్ లో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసుకోవడానికి అనుమతిస్తూ 2013 నవంబర్ 29న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది.
ట్రిబ్యునల్ తుది నివేదికను సవాల్ చేస్తూ ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ వేయగా దాని అమలును నిలుపుదల చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆ ఎస్‌ఎల్పీలపై సుప్రీంకోర్టు విచారణ చేస్తుండటంతో ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటి ఫికేషన్ జారీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సైతం ఈ కేసులో ప్రతివాదిగా చేరింది.
మరోవైపు డ్యామ్‌లో 524.256 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిల్వ చేస్తే ముంపునకు గురయ్యే 20 గ్రామాలు, బాగల్‌కోట మున్సిపాలిటీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసంతోపాటు 75,663 ఎకరాల సేకరణకు రూ. 70 వేల కోట్లను మంజూరు చేస్తూ కర్ణాటక కేబినెట్ సెపె్టంబర్ 17న గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఈ కేసు పరిష్కారం కాకముందే కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంపునకు ముందుకు వెళ్తుండటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో మరో ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్ (ఐఏ) వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


