ఎన్టీఆర్‌ ఓటమి.. చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ విజయం

Kommineni Srinivasa Rao Analysis On Telangana Elections - Sakshi

1989 ఎన్నికలు: ఎన్టీఆర్‌కు ఓటమి

చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం

రెడ్డి అభ్యర్థులు 40 మంది ఎన్నిక

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో పెను సంచలనంగా వచ్చిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు స్వయంగా ఓటమి పాలవడం 1989 ఎన్నికల విశేషంగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్‌ పాలనపై విమర్శలకన్నా, ఆయన వ్యవహార శైలిపై ఎక్కువ నిరసనలు వ్యక్తమయ్యేవి. 31 మంది మంత్రులను తొలగించడం, ఆ తర్వాత వేరే రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్లడం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రంగా హత్య వంటి పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. ఎన్టీఆర్‌ గత సారి తెలంగాణలోని నల్లగొండతో సహా మూడు చోట్ల గెలిచి రికార్డు నెలకొల్పితే, 1989లో తెలంగాణలోని కల్వకుర్తిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చిత్తరంజన్‌ దాస్‌ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. రాయలసీమలోని హిందూపూర్‌ నుంచి గెలవడం ద్వారా ఎన్టీఆర్‌ అసెంబ్లీకి రాగలిగారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ కు తెలంగాణలో 58 సీట్లు దక్కగా, తెలుగుదేశం పార్టీకి 19 స్థానాలే వచ్చాయి.

సీపీఐకి ఎనిమిది, సీపీఎం నాలుగు, బీజేపీ ఐదు, ఎంఐఎం నాలుగు , ఇండిపెండెంట్లు 8 స్థానాలు గెలుచుకున్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే రెడ్లు 40 మంది గెలవగా, వారిలో కాంగ్రెస్‌ నుంచి 26 మంది, టిడిపి నుంచి ఏడుగురు ఉన్నారు. వెలమ వర్గం నుంచి అత్యధికంగా 14 మంది గెలవడం మరో ప్రత్యేకత గా చెప్పాలి. బీసీలు 14 మంది గెలిస్తే కాంగ్రెస్‌ నుంచి 10 మంది విజయం సాధించగా, టీడీపీ నుంచి ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎస్సీలలో కూడా కాంగ్రెస్‌ 11 చోట్ల గెలిస్తే, టీడీపీకి మూడు సీట్లే వచ్చాయి. అయితే కాంగ్రెస్‌ నుంచి కమ్మ వర్గం నేతలు ఎవరూ ఈసారి కూడా గెలవలేదు. టీడీపీ, సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు గెలిచారు. ముస్లింలలో నలుగురు ఎంఐఎం వారే. బ్రాహ్మణులు ముగ్గురిలో ఇద్దరు కాంగ్రెస్‌ నుంచి ఒకరు టీడీపీ నుంచి విజయం సాధించారు. వైశ్య నుంచి ఒకరు, క్రిస్టియన్‌ ఒకరు కూడా గెలిచారు.

ఎస్టీల్లో కాంగ్రెస్‌ నేత రెడ్యా నాయక్‌ ఈసారి కూడా జనరల్‌ సీటు డోర్నకల్‌  నుంచి గెలిచారు. ఆయా వర్గాల నుంచి గెలుపొందిన ప్రముఖులలో డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి ఆరోసారి విజయం సాధించారు. సి.రామచంద్రారెడ్డి, గడ్డెన్న, సంతోష్‌ రెడ్డి, కె.ఆర్‌ సురేష్‌ రెడ్డి, జీవన్‌రెడ్డి, పి.రామచంద్రారెడ్డి, పి.జనార్దనరెడ్డి, జానారెడ్డి తదితరులు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన వారిలో మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి, రఘుమారెడ్డి వంటివారు ఉన్నారు. జనతా పార్టీ నుంచి సి.నర్సిరెడ్డి, సీపీఎం పక్షాన నర్రా రాఘవరెడ్డి, బీజేపీ పక్షాన బద్దం బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా వెలమ నుంచి గెలిచినవారిలో కె.చంద్రశేఖరరావు యతిరాజారావు, జీవీ సుధాకరరావు, జలగం ప్రసాదరావు, చెన్నమనేని విద్యాసాగరరావు తదితరులు ఉన్నారు.

కమ్మ వర్గం నుంచి మండవ వెంకటేశ్వరారవు, పువ్వాడ నాగేశ్వరరావు, బోడేపూడి వెంకటేశ్వరరావు ఉన్నారు. ముస్లింలలో షబ్బీర్‌ అలీ, ఎస్సీలలో దామోదర రాజనరసింహ, పి.శంకరరావు, బోడ జనార్ధన్‌ తదితరులు ఉన్నారు. కాగా బీసీల నుంచి గెలిచిన ప్రముఖులలో డి.శ్రీనివాస్, పి.సుధీర్‌కుమార్, వి.హనుమంతరావు, ఓంకార్‌ తదితరులు ఉన్నారు. బ్రాహ్మణులలో ఎస్‌.వేణుగోపాలాచారి, శ్రీపాదరావు, పి.వి రంగారావు ఉన్నారు. బీసీ వర్గాలలో మున్నూరు కాపుల నుంచి ఏడుగురు గెలవడం విశేషం. గౌడ నుంచి ముగ్గురు గెలుపొందారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top