సమగ్ర దర్యాప్తు చేయించాలి | Kodati Sureshrao family members demand to comprehensive investigation his suicide | Sakshi
Sakshi News home page

సమగ్ర దర్యాప్తు చేయించాలి

Aug 10 2014 3:03 AM | Updated on Sep 2 2017 11:38 AM

తన భర్త, సీఎం చీఫ్ సెక్యూరిటీ మాజీ అధికారి సురేశ్‌రావు ఆత్మహత్యపై ఆయన భార్య కవిత, కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

సురేశ్‌రావు కుటుంబసభ్యుల డిమాండ్
 ఎల్కతుర్తి : తన భర్త, సీఎం చీఫ్ సెక్యూరిటీ మాజీ అధికారి సురేశ్‌రావు ఆత్మహత్యపై ఆయన భార్య కవిత, కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చీఫ్ సెక్యూరిటీ మాజీ అధికారి కోదాటి సురేశ్‌రావు డ్యూటీలోనే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని శనివారం వేకువజామున స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లికి తీసుకువచ్చారు. మృతదేహంతోపాటు ఇక్కడకు చేరుకున్న కవిత, కుటుంబసభ్యులు, బంధువులు పోలీసు శాఖ తీరుపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు.
 
 తన భర్త సెలవు పెట్టి వస్తానని మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటినుంచి వెళ్లారని, సాయంత్రం నాలుగు గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్‌శాఖ నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఆ రెండు గంటల వ్యవధిలో అక్కడ ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనస్థలంలో మృతదేహాన్ని చూడనివ్వలేదని, పోస్టుమార్టం వద్దకు కూడా అనుమతించలేదని పేర్కొన్నారు. తాము కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా శవాన్ని ఇంటికి పంపిస్తామంటూ వెళ్లగొట్టారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ అనురాగ్ శర్మ సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కవిత కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement