సాగైంది 26 శాతమే

Kharif Crops Very Disappointed In Telangana - Sakshi

ఖరీఫ్‌లో 1.08 కోట్ల ఎకరాలకుగాను 28.49 లక్షల ఎకరాలకే పరిమితం

వరి నార్లు 3 శాతం కాగా.. పత్తి సాగు అత్యధికంగా 46 శాతం

ఆసిఫాబాద్‌ జిల్లాలో 73 శాతం సాగు... జగిత్యాలలో 3 శాతమే 

19 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు... సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక 

ఖమ్మం జిల్లాలో తీవ్ర వర్షాభావం... అక్కడ 72 శాతం లోటు వర్షపాతం

24,11,000 ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం.. (ఎకరాల్లో)

61,615 ఇప్పటివరకు వరి నార్లు పోసింది (ఎకరాల్లో) 

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌ పంటల సాగు చతికిలపడింది. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, వచ్చినా ఇప్పటికీ సరైన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలో ఖరీఫ్‌ పంటల సాగు నిరాశాజనకంగా ఉంది. ఖరీఫ్‌లో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 28.49 లక్షల (26%) ఎకరాలకే పరిమితమైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ ప్రభుత్వానికి బుధవారం ఒక నివేదిక పంపింది. ఆ నివేదిక ప్రకారం.. ఖరీఫ్‌ పంటల సాగు దారుణంగా ఉంది. సాధారణంగా ఇప్పటివరకు 39.39 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాలి. కానీ ఏకంగా 10 లక్షల ఎకరాల వరకు సాగు తగ్గింది. ఇప్పటివరకు సాగైన 28.49 లక్షల ఎకరాల్లో అత్యధికంగా పత్తి 19.73 లక్షల (46%) ఎకరాల్లో సాగైంది. ఇక ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం.. 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.31 లక్షల (22%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో కంది సాగు విస్తీర్ణం 7.29 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 1.52 లక్షల (22%) ఎకరాలకే పరిమితమైంది.

ఇక ఖరీఫ్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.21 లక్షల (18%) ఎకరాలకే పరిమితమైంది. ఇక కీలకమైన వరి ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 61,615 ఎకరాల్లోనే నార్లు పోశారు. ఇప్పటికే నార్లు పోయడానికి సమయం కూడా తీరిపోయింది. ఇక మధ్య లేదా స్వల్పకాలిక వరి నార్లు వేయడంపైనే దృష్టి సారించాల్సి ఉంది. మరోవైపు వివిధ జిల్లాల్లో పంటల సాగులో తీవ్రమైన వ్యత్యాసం కనిపించింది. ఆసిఫాబాద్‌ కొమురంభీం జిల్లాలో అత్యధికంగా 73 శాతం పంటలు సాగు కాగా, అత్యంత తక్కువగా జగిత్యాల జిల్లాలో కేవలం 3 శాతానికే పంటల సాగు పరిమితమైంది. వనపర్తిలో 5 శాతం, నిజామాబాద్, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో 6 శాతం చొప్పున మాత్రమే పంటలు సాగయ్యాయి. మంచిర్యాలలో 8 శాతం పంటలు సాగయ్యాయి. 

19 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు... 
రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి బుధవారం నాటికి సాధారణంగా నమోదు కావాల్సిన వర్షపాతం 146.3 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, ఇప్పటివరకు 105 ఎంఎంలే నమోదైంది. అంటే 28 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. దీంతో రాష్ట్రంలో 19 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్‌ రూరల్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, జనగాం, యాదాద్రి, మేడ్చల్, నల్లగొండ, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. ఖమ్మం జిల్లాలో కరువుఛాయలు నెలకొన్నాయి. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాల్లోనైతే ఏకంగా 72 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌ జిల్లాలో 62 శాతం, సూర్యాపేట జిల్లాల్లో 60 శాతం లోటు నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం 10 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాధార పంటలైన జొన్న, సజ్జ, రాగి, వేరుశనగ, సోయాబీన్, పత్తి సాగు ఊపందుకుందని వ్యవసాయశాఖ తెలిపింది. వచ్చే 2 వారాల్లో వరి నార్లు ఊపందుకుంటాయని పేర్కొంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను తాము సిద్ధంగా ఉంచినట్లు వ్యవసాయశాఖ తన నివేదికలో తెలిపింది. ఇప్పటివరకు వేసిన పంటల పరిస్థితి బాగుందని వివరించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top