ఖరీఫ్‌ ఆలస్యం

Kharif Crop Season Adilabad Agriculture - Sakshi

కెరమెరి(ఆసిఫాబాద్‌): మృగశిరం మాసం ప్రారంభమైనా వానలు మృగ్యమవడంతో అన్నదాత దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే  పొలం పనులన్నీ పూర్తి చేసి నింగికేసి చూస్తున్న రైతులు ఎందరో జిల్లాలో ఉన్నారు. నైరుతి రుతుపవనాల రాక మరింతగా ఆలస్యమవుతుందని వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం దాటితే తప్పా తొలకరి పలకరించే అవకాశం లేదని చెబుతుండడంతో ఈసారి ఖరీఫ్‌ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆలస్యమైన రుతుపవనాలు...
గతేడు జూన్‌ మొదటి వారంలోనే వర్షాలు కురువడంతో రైతులు సంతోషంతో విత్తనాలు నాటుకున్నారు. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో 40శాతం విత్తనాలు వేశారు. ఈ సారి మాత్రం ఇప్పటి వరకు వర్షాలు కురవక పోవడంతో రైతులు వేసవి దుక్కులు సైతం చేయలేక ఆకాశం వైపు చూస్తున్నారు. దుక్కులు దున్నేందుకు భూముల్లో సేంద్రియ ఎరువులు, నల్లమట్టి వేసి ఎదరుచూస్తున్నారు. ఇప్పటి వరకు 20శాతం దుక్కులు కూడా కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇటీవల అక్కడక్కడ కురిసిన వర్షాలకు తడిసిన భూముల్లో పిచ్చి మొక్కల తొలగించేందుకే సరిపోయిందని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పుడు వానస్తోనే వేసవి దుక్కులు చేసినా తర్వాత మరో సారి వానలు కురిస్తేనే విత్తనాలు వేసేందుకు అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వర్షాలు  వచ్చినా విత్తనా లు నాటుకునేందుకు దాదాపు మూడు వారా లు పట్టె అవకాశముంది. దీంతో సీజన్‌ నెలరోజులు వెనక్కి వెళ్లినట్టేనని రైతులు అంటున్నారు.
 
కాలం ఆశాజనకంగా..
కాలం ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ శాఖ మూడు వారాల కిందట ప్రకటించిన నేపథ్యంలో అధికారులు సాధారణ సాగు విస్తీర్ణానికి మించి పంటలు సాగవనున్నాయని 30 శాతం అదనంగా ప్రణాళికలో  చేర్చినట్లు సమాచారం. అయినా నేటికి  వర్షాలు కురవక పోవడం రైతులను కలవరానికి గురి చేస్తున్నాయి. జిల్లాలో కొంత కాలువల ద్వారా సాగువుతుండగా.. అధిక శాతం నీటి సౌకర్యం లేక పోవడంతో  అకాశం వైపు వేచి చూస్తున్నారు. కొందరు విద్యుత్‌ ఆధారిత బోరు బావులను నమ్ముకుంటున్నారు.

మండిపోతున్న ఎండలు!
సాధారణంగా జూన్‌ మొదటి వారం వచ్చిందటే రుతుపవనాల ఆగమనంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు వస్తాయి. ప్రస్తుతం రుతుపవనాల జాడ లేక పోవడం, వడగాల్పులు వీస్తుండడం. రైతులను  ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో  పగటి ఉష్ణ్రోగ్రతలు 40 నుంచి 45డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. మరో వారం రోజులు తపరిస్తితులు ఇలాగే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

గతేడాది లోటు వర్షపాతం..
నిరుడు జిల్లాలో సాధారణ వర్షాపాతం కంటే 30.5 మిల్లీ.మీటర్ల లోటు నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోయాయి. జిల్లా పరిధిలో ఆశించయిన స్థాయిలో వానలు కురవలేదు. పంటలు ఎండిపోయి నష్టం వాటిల్లింది. ఈసారి గత చేదు అనుభవాలు దరిచేరకుండా వానలు కురవాలని అన్నదాతలు ఆశిస్తున్నారు. కాలువల ద్వారా సాగు నీరందించి రైతున్నల కన్నీళ్లు తుడవాలనే  సంకల్పంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గతేడాది వరకు పలు చోట్ల చెక్‌ డ్యాంలు, చెరువు కట్టలు నిర్మించింది. కానీ  ప్రస్తుతం అవి ఎండిపోయి ఉండడంతో వాటిని చూసి అన్నదాత దిగాలు చెందుతున్నాడు. పరిస్థితిలో మార్పు రాకుంటే  రానున్న కాలం గడ్డు కాలమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top