
జగదీశ్వర్‌రెడ్డి
అత్యున్నత ప్రమాణాలతో ఉచిత ‘కేజీ టు పీజీ’ విద్యావిధానాన్ని.....
గజ్వేల్: అత్యున్నత ప్రమాణాలతో ఉచిత ‘కేజీ టు పీజీ’ విద్యావిధానాన్ని అమలుచేయడానికి సర్కార్ కసరత్తు చేస్తోందని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం గజ్వేల్‌లోని కోలా అభిరామ్ గార్డెన్స్‌లో రోటరీ క్లబ్ నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలకు చెందిన 1,500 విద్యార్థులకు షూలు పంపిణీ చేసింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం ప్రాతిని థ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచే ఉచిత విద్యను అమలు చేయనున్నట్లు తెలిపారు. వివిధ దేశాల్లో అమలవుతున్న విద్యాప్రమాణాలను అధ్యయనం చేసి వాటికంటే మెరుగైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
గజ్వేల్ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ఇక్కడ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తేనే సర్కార్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, అందువల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని పిలుపునిచ్చారు.
సీఎం ప్రాతినిథ్యం వహించడం గజ్వేల్ ప్రజల అదృష్టం
గజ్వేల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ ఎర్రవల్లి వద్ద ఫాంహౌస్ నిర్మించారో, అప్పుడే ఈ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత దక్కిందన్నారు. కేసీఆర్ కూడా తన సొంత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారనీ, ప్రత్యేకంగాసాగునీటి వసతి కల్పించి కరువును శాశ్వతంగా తరిమివేయడానికి నిర్ణయించుకున్నారన్నారు.
ప్రస్తుతం ఆ దిశగా కృషి జరుగుతోందని వివరించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు చేయూతనిచ్చే దిశలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయవన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, ప్రముఖ మెజీషియన్ సామల వేణు, జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావు, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు, సిద్దిటపే ఆర్‌డీఓ ముత్యంరెడ్డి, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మడుపు భూంరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పొన్నాల రఘుపతిరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ యాదవరెడ్డి, నగర పంచాయతీ వైస్ చైర్మన్ అరుణ, గజ్వేల్ ఎంపీపీ చిన్నమల్లయ్య, గజ్వేల్, ములుగు జెడ్పీటీసీలు జేజాల వెంకటేశ్‌గౌడ్, సింగం సత్తయ్య, రోటరీ క్లబ్ నాయకులు డాక్టర్ పురుషోత్తం, వేణు, చంటి, విద్యాకుమార్, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, నాయకులు పండరి రవీందర్‌రావు, దేవేందర్, మద్దిరాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
చీపురు పట్టిన మంత్రి, ఎంపీ
గజ్వేల్‌లో నగర పంచాయతీ అధ్వర్యంలో చేపట్టిన ‘చెత్తపై సమరం’ కార్యక్రమాన్ని మంగళవారం విద్యాశాఖమంత్రి జగదీశ్వర్‌రెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా చీపురు పట్టుకొని కొద్దిసేపు ఊడ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రజలంతా ‘చెత్తపై సమరం’ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని నగర పంచాయతీని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ ర్యాలీ తహశీల్దార్ కార్యాలయం నుంచి కోలా అభిరామ్ గార్డెన్స్ వరకు కొనసాగింది.
అభివృద్ధే టీఆర్‌ఎస్ సర్కార్ ధ్యేయం
ములుగు: అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ములుగు మండల కేంద్రంలో రూ.75 లక్షల నిధులతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణ పనులకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు.