వాన రాక ముందే పని కావాలె

KCR Visits Kaleshwaram Lift Irrigation Project Warangal - Sakshi

సాక్షి, కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్‌లోనే రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని  ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఇరిగేషన్‌ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. త్వరలోనే వర్షాలు పడే అవకాశమున్నందున ఆలోగానే పనులు పూర్తి చేయాలని సూచించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీ పనులను సీఎం కేసీఆర్‌ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  హెలీకాప్టర్‌ ద్వారా కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి.. సతీసమేతంగా కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి త్రివేణి సంగమానికి చేరుకుని జలాలకు పూజలు చేసి ప్రాజెక్టు పనులను అణువణువు పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లను అభినందించి∙ పలు సూచనలు చేశారు.

అన్నీ బిగించాలి..
కాళేశ్వర ఆలయం నుంచి కేసీఆర్‌ రోడ్డు మార్గంలో కన్నెపల్లిలోని మెగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత కన్నెపల్లి పంపుహౌస్‌కు వెళ్లి అక్కడి స్టార్టర్స్‌ కంట్రోల్‌ రూంలో ఇంజినీర్లతో మాట్లాడారు. అక్కడ 11 మోటార్లకు గాను 8 మోటార్ల బిగింపు పూర్తయిందని, మరో రెండింటి పనులు జరుగుతున్నాయని ఇంజినీర్లు కేసీఆర్‌కు వివరించారు. ఈనెలాఖరు నాటికి మొత్తం బిగించాలన్న కేసీఆర్‌.. ఇరిగేషన్‌ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. పనులన్నీ చాలా బాగున్నాయని, ఇంత త్వరగా పూర్తి చేయడంపై ఈఎస్‌సీ నల్ల వెంకటేశ్వర్లు బృందంతో పాటు కాంట్రాక్టర్లను అభినందించారు. పనులను ఇదే ఊపులో కొనసాగించి జూన్‌ 10లోపు అంతా సిద్దం చేయాలని సూచించారు.

ఇక కన్నెపల్లి పంపుహౌస్‌లోని ఐదు మోటార్లకు ఈనెలాఖరులోగా.. లేదంటే జూన్‌ మొదటి వారంలో వెట్‌రన్‌ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అక్కడి నుంచి పంపుహౌస్‌లోని ఫోర్‌బే, హెడ్‌ రెగ్యులేటరీలను ఆయన పరిశీలించారు. మళ్లీ త్వరలోనే వస్తానని చెప్పిన కేసీఆర్‌ అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజీకి హెలీకాప్టర్‌లో వెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీలో వ్యూపాయింట్‌ నుంచి మహారాష్ట్ర వైపు మీదుగా నిర్మిస్తున్న గైడ్‌ బండ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం ఇంజినీర్లతో మాట్లాడుతూ.. గత ఏడాది ఆగస్టులో 340, 570, సెప్టెంబర్‌లో 460 టీఎంసీల వర్షపు నీరు తరలిపోయిందని గుర్తు చేశారు. అయితే, ఈసారి బ్యారేజీ వద్ద నీటి నిల్వలను బట్టి పంపులు నడిపి ఖరీఫ్‌ అవసరాలకు నీటిని తరలించవచ్చన్నారు. ఇందుకోసం మిగిలి ఉన్న పనులన్నీ జూన్‌ 10లోపు ముగించాలని ఆదేశించారు. కాగా.. జనవరిలో సీఎం వచ్చిన సమయంలో బ్యారేజీకి సంబంధించి 85 గేట్లకు గాను 12 మాత్రమే బిగించగా.. ఇప్పుడు 78గేట్ల బిగింపు పూర్తికావడంపై కేసీఆర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరిగి గోదావరి మార్గం గుండా ఎల్‌ఎన్‌టీ క్యాంపు కార్యాలయానికి వెళ్లి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆరు గంటలు...
కేసీఆర్‌ ఉదయం 7.20 నుంచి మద్యాహ్నం 1.30 గంటల వరకు అంటే ఆరు గంటలకు పైగానే కాళేశ్వరాలయం, కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీల వద్ద గడిపారు. సీఎం హోదాలో అంతసేపు ఉండడంతో అధికారులు, పోలీసులు కాస్త కంగారుపడ్డారు. ఇక సుమారు 44–45డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్నా సీఎం పనులను పర్యవేక్షించడం విశేషం. ఈ పర్యటనలో సీఎం వెంట ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, కాళేశ్వరం బ్యారేజీ ఈఎస్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌ కే.జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, హోం సలహాదారు అనురాగ్‌శర్మ, సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, భూపాలపల్లి జయశంకర్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు వాసం వెంకటేశ్వర్లు కలెక్టర్‌ దేవసేన, ఎస్పీ ఆర్‌.భాస్కరన్, ఏఎస్పీలు రాజమహేంద్ర నాయక్, సాయిచైతన్య, శరత్, ఇరిగేషన్‌ బోర్డు చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఎల్‌ఎన్‌టీ ప్రతినిధి విపీ బాలగన్, పీఎం రాజు, ఈఈ రమణారెడ్డి, డీఈఈ సురేష్‌ తదితరులు ఉన్నారు.
 
కట్టుదిట్టమైన భద్రత
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటనను పురస్కరించుకుని ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రా>ష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్, కాళేశ్వరాలయం వద్ద కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శని, ఆదివారాల్లో ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన సుమారు 1000మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. కాగా, సీఎం పర్యటన ఖరారైనప్పటి నుంచే ఎస్పీతో పాటు పోలీసు యంత్రాంగం   ముందస్తు భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. కాళేశ్వరం, కన్నెపల్లి, మేడిగడ్డ క్యాంపు, పనుల ప్రాంతాల్లో ఎస్పీ స్వయంగా పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు. ఇక మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 19న ఆదివారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చన నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. దీంతో కాళేశ్వరం నుంచి మేడిగడ్డ వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర ఎటు చూసినా పోలీసులే కనిపించారు. ఈ మేరకు సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

సీఎం టూర్‌ సాగిందిలా...
 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన వివరాలిలా ఉన్నాయి. ఉదయం 7.20గంటలకు కన్నెపల్లికి హెలీకాప్టర్‌ వచ్చారు. అక్కడి నుంచి కాళేశ్వరాలయం రాజగోపురం వద్దకు కేసీఆర్‌ – శోభ దంపతులు 7.27గంటలకు చేరుకున్నారు. అక్కడ వారికి అర్చకులు పూర్ణకుంభస్వాగతం పలికారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలోకి 7.30 గంటలకు వెళ్లిన వారు 8.30 గంటల వరకు ఆలయంలో పూజలు, అర్చకులతో గడిపారు. ఆ తర్వాత 8.40గంటలకు త్రివేణి సంగమ గోదావరి వద్దకు చేరుకుని పూజలు చేశారు. అక్కడి నుంచి 9గంటలకు కన్నెపల్లిలోని మెగా క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

అల్పాహారం పూర్తయ్యాక 9.52గంటలకు కన్నెపల్లి పంపుహౌస్‌కు బయలుదేరి 9.56గంటలకు చేరుకున్నారు. ఉదయం 10గంటలకు పంప్‌హౌస్, కంట్రోల్‌రూంల్లో పరిశీలించాక 10.55 గంటలకు పంపుహౌస్‌ మీదుగా ఏరియల్‌ సర్వే చేస్తూ మేడిగడ్డకు బయలుదేరారు. 11.10 గంటలకు మేడిగడ్డలో ల్యాండ్‌ అయిన కేసీఆర్‌ వంతెన పైనుంచి బ్యారేజీ పనులను పరిశీలించారు. ఇక 11.33గంటలకు మహారాష్ట్ర వైపు గైడ్‌బండ్స్‌ పరిశీలించాక అక్కడి కార్మికులతో మాట్లాడారు. 11.59గంటలకు బ్యారేజీ వద్ద నుంచి ఎల్‌ఎన్‌టీ కార్యాలయం వద్దకు చేరుకుని ఇరిగేషన్‌ అధికారులు, కాంట్రాక్టర్ల బృందంతో సమీక్ష నిర్వహించాక 1.30 గంటలకు హెలీకాప్టర్‌లో పెద్దపల్లి జిల్లా రామగుండం బయలుదేరారు.

మరో యాదాద్రిగా కాళేశ్వరం 
రాష్ట్రంలోనే అతి ప్రాచీనమైన దేవాలయాల్లో ఒక్కటైన శ్రీకాళేశ్వరముక్తీశ్వరాలయం, గ్రామ అభివృద్ధి్దకి రూ.100కోట్ల నిధులను వచ్చే బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌–శోభ దంపతులు మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరాలయానికి శనివారం వచ్చారు. ఆలయ అధికారులు, అధికారులు వేదమంత్రోచ్ఛరణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో మహన్యాసక రుద్రాభిషేక పూజలతో పాటు శుభానందదేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అక్కడ అర్చకుడు లక్ష్మీనారాయణశర్మ కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్య రూపంలో చదివి వినిపించారు.

దేవాదాయ కమిషనర్‌ అనిల్‌కుమార్, ఈఓ మారుతిలు సీఎం దంపతులకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అర్చకులు బెల్లం లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం అర్చకులతో సీఎం కాసేపు ముచ్చటించారు. కాళేశ్వరాలయం మరో యాదాద్రిగా మారబోతోందని తెలిపారు. నిత్యం లక్ష మంది భక్తులు ఆలయంలో దర్శించుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్చకులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేకంగా క్వార్టర్లు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆలయంతో పాటు గ్రామాభివృద్ధికి రూ.100కోట్ల నిధులను బడ్జెట్‌లో ప్రవేశపెట్టాక ఆలయ పరిసరాల్లో 100 ఎకరాల భూమి సేకరిస్తామని చెప్పారు.

అవసరమైతే ప్రైవేట్, ప్రభుత్వ, ఫారెస్టు భూములను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుకు సూచించారు. ఇక ఆలయంలో హైందవ సంప్రదాయం పెంపొందేలా అర్చకులు, అధికారలు పాటుపడాలన్నారు. ఈ మేరకు సుమారు గంటపాటు ఆలయంలో సీఎం దంపతులు గడిపారు. కాగా, సీఎం కేసీఆర్‌ 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టు భూమి పూజ చేసిన సమయంలో ఆలయ అభివృధ్ధికి రూ.25కోట్ల నిధులు ప్రకటించిన విషయం విదితమే. ఇప్పుడు రూ.100కోట్లు ఆలయానికి, గ్రామ అభివృద్ధికి ఇవ్వనున్నట్లు చెప్పడంతో స్థానికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

రెండుగంటల పాటు రాకపోకలు బంద్‌ 
కాళేశ్వరం: సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరంలో పోలీసులు రాకపోకలను బంద్‌ చేశారు. ఆదివారం ఉదయం 6.30గంటల నుంచి 8.30గంటల వరకు రహదారులపై బారికేడ్లు కట్టారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్‌ వాహనాలను రెండు గంటల పాటు నిలిపివేశారు. కాళేశ్వరంలోని హమాలీ సంఘం వద్ద, మహారాష్ట్ర నుంచి వచ్చే వారిని అంతరాష్ట్ర వంతెన వద్ద నిలిపారు. ఇక గ్రామంలో హోటళ్లు, కిరాణ దుకాణాలు, ఇతర దుకాణాలు సైతం రెండు గంటల పాటు బంద్‌ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top