మన పల్లె సల్లగుండాలి: కేసీఆర్‌

KCR Says Use Of NREGS Funds For Rural Development In Telangana - Sakshi

ప్రతి గ్రామం.. ప్రతి రోజూ శుభ్రం కావాలి

ఈ ఏడాది రైతుల భూముల్లో లక్ష కల్లాలు ఏర్పాటు చేయాలి

2 నెలల్లో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం

4 నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలి

నాలుగేళ్లలో సంపూర్ణ ప్రణాళికలు రూపొందించాలి

జిల్లా కలెక్టర్లతో భేటీలో ముఖ్యమంత్రి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాకపోతే, ఇంకెప్పుడూ గ్రామాలు బాగుపడవని పేర్కొన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు, అవసరమైన పనులు చేసుకోవడానికి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రతి గ్రామం.. ప్రతి రోజూ శుభ్రం కావాల్సిందేనని, సీఎం సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరోటి లేదని స్పష్టం చేశారు. రెండు నెలల్లో అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం, 4 నెలల్లో రైతు వేదికల  నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మంగళవారం సమావేశమయ్యారు. గ్రామాల్లో కలెక్టర్లు, డీపీవో ఆధ్వర్యంలో జరగాల్సిన పనులపై సీఎం కేసీఆర్‌ మార్గదర్శనం చేశారు.

మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్‌ అలీ, ఈటల రాజేందర్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ 

ఆదేశాలు సీఎం మాటల్లోనే..

  • గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్లే. ప్లానింగ్‌ ఆఫ్‌ టౌన్, ప్లానింగ్‌ ఆఫ్‌ విలేజ్‌ అంటే ప్లానింగ్‌ ఆఫ్‌ స్టేట్‌ అన్నట్లే. వనరులు, అవసరాలను బేరీజు వేసుకుని గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళిక తయారు కావాలి. దాని ఆధారంగా డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రెస్‌ కార్డు రూపొందించాలి. దాని ప్రకారమే పనులు జరగాలి.
  • కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకుని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించింది. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పంచాయతీరాజ్‌ శాఖలో ఖాళీలు భర్తీ చేసింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా ప్రతినెలా రూ.308 కోట్ల Æనిధులు ప్రభుత్వం విడుదల చేస్తోంది. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.5 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీలకు అదనపు నిధులిచ్చి, 5 లక్షలకు చేరుకునేట్లు చేస్తాం.
  • ఏటా రూ.10 వేల కోట్ల నిధులు, 13,993 మంది అధికారులు, 1,32,973 మంది ప్రజాప్రతినిధులు, 8,20,727 మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, కలెక్టర్లకు విస్తృత అధికారాలున్నాయి. గ్రామాల వికాసాన్ని కాంక్షించే ప్రభుత్వం, అది తీసుకున్న విధానాలు గొప్పగా ఉన్నాయి. ప్రజల్లో అవగాహన, స్పూర్తి కలిగించి ఉద్యమ స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలను కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తమ భుజస్కంధాలపై వేసుకుని నడిపించాలి.
  •  ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వైకుంఠ ధామం, నర్సరీ, డంపు యార్డు దేశంలో ఎక్కడా లేవు. తెలంగాణలో మాత్రమే అవి సమకూరుతున్నాయి. ట్యాంకర్లు, ట్రాలీలు కూడా వస్తున్నాయి. ఈ నెలాఖరుకు అన్నీ సమకూరుతాయి.

    సమావేశంలో భౌతిక దూరం పాటిస్తూ పాల్గొన్న వివిధ జిల్లాల కలెక్టర్లు

ఆకస్మిక తనిఖీలు చేస్తా..

  • గ్రామాల్లో గుంతలు తొలగించాలి. పాడుపడిన బావులను, ఉపయోగించని బోర్లను పూడ్చాలి. పిచ్చి చెట్లను, సర్కారు తుమ్మను తొలగించాలి. నేను గ్రామాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తాను. రాష్ట్రంలో ఏ మూలకు పోయి చూసినా అంతా శుభ్రంగా కనిపించాలి. అప్పుడు ఈ చెత్తా చెదారం, ముళ్ల పొదలు కన్పిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
  • ఆర్థిక కమిషన్‌ నిధుల్లో 10 శాతం మండల పరిషత్‌లకు, 5 శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం విధుల నిర్వహణలో కానీ, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణలో గానీ అలసత్వం ప్రదర్శిస్తే క్షమించొద్దు. జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చింది. ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదు.
  • ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంది. 2020–21లో తెలంగాణకు 13 కోట్ల పని దినాలను లక్ష్యంగా ఇస్తే, ఇప్పటికే 9.81 కోట్ల పనిదినాలను (75.5 శాతం) పూర్తి చేసి కూలీలకు ఉపాధి కల్పించింది.

నరేగాను వాడుకోండి..

  • నర్సరీలు, మొక్కల పెంపకం, అన్ని రకాల రోడ్లపై చెట్లు, పొదల తొలగింపు, చెరువులో, చెరువు కట్టలపై చెట్ల తొలగింపు, కాల్వల మరమ్మతులు, పూడికతీత, వైకుంఠధామాలు, డంపు యార్డులు, అంతర్గత రహదారులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో టాయిలెట్లు, కల్లాలు, పంట చేలకు పశువులు రాకుండా ట్రెంచ్, ఇంకుడు గుంతలు, గొర్రెలు, మేకలు, బర్రెలు, కోళ్ల కోసం షెడ్లు, వర్మి కంపోస్టు, కంపోస్టు తయారీ షెడ్ల నిర్మాణం, పాఠశాలల్లో ఆట స్థలాల ఏర్పాటు, మురుగు నీరు, నిల్వ ఉన్న నీటి తొలగింపు, వ్యవసాయ భూమిని చదను, పాడుపడిన బావుల పూడ్చివేత, మంచినీటి బావుల్లో పూడిక తీత పనులు తదితర ప్రజోపయోగ పనులను ఉపాధి హామీ పథకం (నరేగా) ద్వారా చేపట్టాలి.
  • అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో మొత్తం లక్ష కల్లాలను ఈ ఏడాది నిర్మించాలని నిర్ణయించాం. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు కేటాయిస్తాం. రైతులకున్న భూమి, అవసరాన్ని బట్టి 50, 60, 75 చదరపు అడుగుల విస్తీర్ణాల్లో కల్లాల నిర్మాణానికి అనుమతులు ఇస్తాం. ఎక్కువ మంది రైతులు ముందుకొస్తే, లాటరీ ద్వారా ఎంపిక చేస్తాం. రూ.750 కోట్ల వ్యయం అయ్యే కల్లాల నిర్మాణానికి నరేగా నిధులు వినియోగించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో నిర్మించాలి. మిగతా వారు 10 శాతం లబ్ధిదారుడి వాటాగా చెల్లిస్తే, 90 శాతం సబ్సిడీ ఇస్తాం.
  • ఈసారి ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల లాంటి ఇంజనీరింగ్‌ శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నరేగా పనులు చేయాలని నిర్ణయించినందున నరేగా ఇంజనీరింగ్‌ ఆఫీసర్స్‌ (ఎన్‌ఈవో)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పీడీ యాక్టులు పెడతాం..

  • వెంటనే రైతులందరికీ రైతు బంధు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించాం. ఏ ఒక్క రైతునూ మినహాయించకుండా డబ్బులు వచ్చేలా చూడాలి. ఎవరికి రాకున్నా వారి వివరాలు తీసుకుని అందేలా చూడాలి. 
  • నకిలీ, కల్తీ విత్తనాల వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేయాలి. సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి పేర్లు గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది. 
  • రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెజ్‌లకు కనీసం 500 మీటర్ల దూరం వరకు నివాస గహాల నిర్మాణం కోసం లేఅవుట్లకు అనుమతి ఇవ్వొద్దు.
  • జూన్‌ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి.

అడవులను కాపాడుకోవాలి..

  • వైకుంఠధామం, డంపు యార్డుల చుట్టూ ప్రహరీగోడలు కాకుండా, చెట్లు పెంచాలి. 
  • అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్మల్, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, అచ్చంపేట, మెదక్‌ తదితర జిల్లాల్లో ఇంకా అడవి ఉంది. దాన్ని కాపాడాలి. స్మగ్లర్లను గుర్తించి, పీడీ యాక్టు నమోదు చేయాలి.
  • జూన్‌ 25 నుంచి జూలై వరకు మరోసారి మిడతల దండు వచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, నిజమాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
  • కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా స్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top