 
													
సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటల రాజేందర్‌కు బీజేపీ సంఘీభావం ప్రకటించింది.
సాక్షి, హైదరాబాద్ : సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటల రాజేందర్‌కు బీజేపీ సంఘీభావం ప్రకటించింది. తెలంగాణ కోసం పోరాడిన ఈటలపై ఎంత ఒత్తిడి ఉందో ఆయన మాటలను బట్టి తెలుస్తోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు అన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌లో రాజకీయ అనిశ్చితితో గ్రూపు రాజకీయాలు మొదలై తిరుగుబాటు జరుగుతోందన్న వాదనను ఈటల వ్యాఖ్యలు బలపరుస్తున్నాయని తెలిపారు.
మంత్రి పదవి ఎవరో ఇచ్చిన భిక్ష కాదన్న మాటలు కేసీఆర్‌ను ఉద్దేశించినవని అర్థమవుతోందని, దీనిపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజలకు ఎప్పుడు వివరణ ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ కేసీఆర్‌కు బహిరంగంగా ఛాలెంజ్ చేసినట్టేననీ, టీఆర్‌ఎస్ అంతానికి ఇది ఆరంభమన్నారు. పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనూ గ్రూపులున్నాయని దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. (చదవండి: మంత్రి పదవి భిక్ష కాదు)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
