ఎట్టకేలకు...రుణమాఫీకి తొలగిన అడ్డంకులు | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు...రుణమాఫీకి తొలగిన అడ్డంకులు

Published Mon, Sep 22 2014 11:10 PM

ఎట్టకేలకు...రుణమాఫీకి తొలగిన అడ్డంకులు - Sakshi

తొలివిడతలో భాగంగా నాలుగోవంతు నిధులు విడుదల
మార్గదర్శకాల ఆధారంగా మాఫీ ప్రక్రియ అమలు


సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు రైతుల రుణమాఫీపై సర్కారు ముందడుగు వేసింది. కొంత కాలంగా అర్హుల ఎంపిక, జాబితాల రూపకల్పన తదితర అంశాలపై కసరత్తు చేశారు. ఈ ప్రక్రియ దాదాపు నెలరోజుల పాటు కొనసాగగా.. రైతువర్గాల్లో మాత్రం ఉత్కంఠ మరింత పెరిగింది. రుణమాఫీపై కేబినెట్ సబ్‌కమిటీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో పూర్తిస్థాయి రుణాలకు సంబంధించి నాలుగో వంతు నిధులు విడుదల చేస్తూ సోమవారం సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో 2.10 లక్షల మంది రైతులకు గాను రూ. 1035 కోట్లు మాఫీ చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
 
ఈక్రమంలో ప్రభుత్వం నాలుగోవంతు నిధులు విడుదల చేసిన నేపథ్యంలో.. జిల్లాలోనూ పలువురు రైతులకు తొలివిడతలో రుణాలు మాఫీ కానున్నాయి. అయితే తొలివిడతలో ఏ కేటగిరీకి చెందిన రైతుల రుణాలు మాఫీ చేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం మాఫీ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలోని రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసే అంశంపై స్పష్టత ఉండడంతో తొలివిడతలో ఇక్కడి రైతులకు అవకాశం దక్కుతుందా.. లేదా..? అనేది తేలాల్సి ఉంది.
 
టీఆర్‌ఎస్ శ్రేణుల సంబరాలు

వికారాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రైతుల రుణమాఫీ ఫైల్‌పై సంతకం చేయడాన్ని హర్షిస్తూ స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో టీఆర్‌ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల రుణమాఫీ ఫైల్‌పై సంతకం చేశారని పేర్కొన్నారు. ఆయన వెంట స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు నాగేందర్‌గౌడ్, విజయ్‌కుమార్ తదితరులున్నారు.
 
నెలాఖర్లోగా రీషెడ్యూల్ పూర్తి చేయాలి: జేసీ ఎంవీరెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతుల పంటరుణాలకు సంబందించి ఈ నెలాఖర్లోగా జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు రీషెడ్యూల్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి బ్యాంకర్లకు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాల రీషెడ్యూల్‌పై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2వరకు నిర్వహించే బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఈ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో జేడీఏ విజయ్‌కుమార్, ఎల్‌డీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement