రాజయ్యకు ఉద్వాసన? | KCR disappointed on T rajaiah work attitude | Sakshi
Sakshi News home page

రాజయ్యకు ఉద్వాసన?

Jan 22 2015 1:38 AM | Updated on Aug 16 2018 1:18 PM

రాజయ్యకు ఉద్వాసన? - Sakshi

రాజయ్యకు ఉద్వాసన?

ఏడు నెలల పాలన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సంచలనం చోటు చేసుకోనుందా? వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం టి.రాజయ్యపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా!?

* డిప్యూటీ సీఎం పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి
* వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతిపై సీఎంకు ‘ఇంటెలిజెన్స్’ నివేదిక?
* తాజాగా ‘స్వైన్‌ఫ్లూ’ వ్యవహారంతో వేటు వేయడానికే నిర్ణయం

 
 సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల పాలన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సంచలనం చోటు చేసుకోనుందా? వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం టి.రాజయ్యపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా!? ఆయనకు ఉద్వాసన పలకాలని సీఎం భావిస్తున్నారా?.. ఈ ప్రశ్నలన్నింటికీ టీఆర్‌ఎస్ అత్యున్నత వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. రాజయ్య పనితీరు, వైద్యారోగ్య శాఖలో అవినీతి వ్యవహారాలతో పాటు తాజాగా ‘స్వైన్‌ఫ్లూ’ వ్యవహారం వంటివన్నీ డిప్యూటీ సీఎం రాజయ్య మెడకు చుట్టుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికిప్పుడు కాకున్నా, త్వరలోనే ఆయనకు ‘కత్తెర’ పెడతారన్న ప్రచారం జరుగుతోంది.
 
 తీవ్రంగా పరిగణించిన సీఎం..: రాష్ట్రంలో ఏ ఇతర శాఖలపై రాని అవినీతి ఆరోపణలు, ప్రతికూల వార్తలు వైద్య, ఆరోగ్య శాఖపై రావడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ శాఖలో జరిగినట్లుగా చెబుతున్న రూ. 15 కోట్ల అవినీతిపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. వైద్య, ఆరోగ్య శాఖలో ఒక అధికారి పోస్టింగ్ కోసం ఏకంగా రూ. 40 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.
 
 108 సర్వీసులకు వాహనాల కొనుగోలుకు సంబంధించి ఒక్కో వాహనానికి రూ. 50 వేల వరకూ పర్సంటేజీ మాట్లాడుకున్నారన్న ఫిర్యాదులు కూడా సీఎంకు అందినట్లు తెలుస్తోంది. సీఎం అసంతృప్తిని చూపుతున్న పలు ఉదంతాలనూ కొందరు ఉదహరిస్తున్నారు. వైద్య, పారామెడికల్ ఉద్యోగాల భర్తీలో అవకతవకల ఆరోపణలు వార్తలు వచ్చినరోజున డిప్యూటీ సీఎం రాజయ్య తన కార్యాలయంలో ఏజెన్సీల ఎంపిక పారదర్శకంగా ఉందని ప్రకటిస్తున్న సమయంలోనే.. సీఎం కే సీఆర్ ఆ శాఖ ఉన్నతాధికారులను పిలిపించుకుని ‘క్లాస్’ తీసుకున్నారు. అప్పటికప్పుడు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేశారు కూడా. ఇక ‘స్వైన్‌ఫ్లూ’ విషయంలోనూ రాజయ్య సరిగా స్పందించలేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించడంలో విఫలమయ్యారన్న అభిప్రాయంతో సీఎం ఉన్నారని సమాచారం. ఈ కారణంగానే బుధవారం స్వైన్‌ఫ్లూ అంశంపై సీఎం నిర్వహించిన సమీక్ష సమాచారం కూడా డిప్యూటీ సీఎంకు లేదని తెలుస్తోంది. ఇక మరోవైపు మంచిర్యాల పర్యటనలో ఆసుపత్రి సిబ్బంది వసూళ్ల గురించి రోగుల బంధువులు ఫిర్యాదు చేస్తే... ‘వందా, రెండు వందలు తీసుకుంటే తప్పేంట’ని రాజయ్య మాట్లాడాన్ని కూడా కేసీఆర్ తీవ్రంగా పరిగణించారని అంటున్నారు.
 
 విభజన చట్టం ద్వారా అందివచ్చిన ఎయిమ్స్ ఏర్పాటు కోసం స్థల సేకరణ అంశాన్నీ సీరియస్‌గా తీసుకోలేదని, బీబీనగర్ నిమ్స్‌ను ప్రారంభించడానికి చొరవ తీసుకోలేదన్న అసంతృప్తీ రాజయ్యపై ఉందని చెబుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం రాజయ్య పేషీలోని ఓఎస్డీల పనితీరుపైనా ఫిర్యాదులు ఉన్నాయి. వారే అన్నీ తామై అనధికారికంగా సమీక్షలు జరుపుతున్న విషయం సీఎం దృష్టికి వెళ్ళింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీకి తొలి రిజిష్ట్రార్‌గా నియమించిన అధికారిపై గతంలోనే ఫిర్యాదులు ఉన్నా, ఎంపిక చేయడాన్ని సీఎం తప్పు పట్టారని... మరో జీవో ద్వారా నియమకాన్ని నిలిపివేశారని అంటున్నారు.
 
  ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే రాజయ్యకు ఉద్వాసన పలకాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బహిరంగంగా సీఎం ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. చివరకు బుధవారం కేబినెట్ భేటీ తర్వాత విలేకరుల సమావేశంలో రాజయ్యను వెనకేసుకొచ్చే తీరులోనే కేసీఆర్ మాట్లాడారు. కానీ పార్టీ వర్గాల్లో మాత్రం మరో రకమైన ప్రచారమే జరుగుతోంది. అంతేగాకుండా నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేకు కేబినెట్‌లో చోటు కల్పించాల్సిన అత్యవసర పరిస్థితి పార్టీకి ఉందని, ఈ లెక్కన ఒకరిని తగ్గించడం ఖాయమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement