అటాక్ హుస్నాబాద్


సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ‘అటాక్ హుస్నాబాద్’ పిలుపునిచ్చారు. ఒకేరోజు హుస్నాబాద్‌లో లక్ష మొక్కలు నాటి సత్తా ఏమిటో చూపిద్దామన్నారు. అందుకోసం త్వరలో తాను మళ్లీ హుస్నాబాద్‌కు వస్తానన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రెండ్రోజుల పర్యటనకు వచ్చిన కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కరీంనగర్ జిల్లా సరిహద్దులో అడుగుపెట్టారు. తొలిరోజు కోహెడ మండలం బస్వాపూర్ వద్ద మొక్కలు నాటి జిల్లాలో హరితహారానికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి నాగసముద్రం, హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయం, చిగురుమామిడి, ముల్కనూర్, నుస్తులాపూర్, తిమ్మాపూర్, అల్గునూర్ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. మధ్యలో హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి 27 నిమిషాలు ప్రసంగించారు.

 

 పట్టుబడితే

 పచ్చటి గుట్ట అవుతుంది..

 ప్రధానంగా హుస్నాబాద్‌లో నెలకొన్న సమస్యలను ప్రస్తావించడంతో నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై మాట్లాడుతూ ‘ఎటాక్ హుస్నాబాద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ‘‘హుస్నాబాద్ గుట్టమీద 140 ఎకరాల స్థలముంది. చూస్తుంటే ఎండిపోయి బోడ గుట్టలాగా ఉంది. మనమంతా పట్టుపడితే అద్భుతమైన పచ్చటి కొండ అవుతుంది. అందుకోసం ఒక రోజు మనమంతా ‘అటాక్ హుస్నాబాద్’ కార్యక్రమం పెట్టుకుందాం. ఒకే రోజు లక్ష మొక్కలు నాటుదాం.

 

  పెద్ద పెద్ద మొక్కలు సరఫరా చేయిస్తా. ఎండా కాలంలో నీటి సరఫరా ఎట్లనో మీరే ఆలోచన చేయండి. కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలి. ఈ కార్యక్రమానికి నేనొస్తేనే మీరు కదిలేటట్లున్నరు. ఎన్ని తిప్పలు పడైనా ఒకరోజు హెలికాప్టర్‌లో ఇక్కడికి వస్తా. నాలుగు గంటలు ఇక్కడే తిరుగుతా. కొండమీదతో పాటు హుస్నాబాద్ పట్టణం మొత్తం చెట్లు పెడదాం. అందుకోసం ఎన్ని ట్రీ గార్డ్స్ అవసరమో అంత డబ్బు మంజూరు చేయిస్తా. ఒకే రోజు లక్ష మొక్కలు నాటి మన ప్రతాపమేందో చూపిద్దాం’’ అని అన్నారు.

 

 ‘తోటపల్లి’ గురించి నాకు తెలుసు..

 హుస్నాబాద్‌లో దరిద్రం ఎక్కువగా ఉందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనది పక్కనే ఉన్న సిద్దిపేట కాబట్టి హుస్నాబాద్ గురించి అంతా తెలుసునన్నారు. హుస్నాబాద్‌లో దరిద్రాన్ని పోగొట్టేందుకు వచ్చే ఏడాదిలోపు గౌరవెల్లి ద్వారా నీరందించేలా చేస్తానని అన్నారు. ఈ దశలో సభలో కొందరు వ్యక్తు లు తోటపల్లి రిజర్వాయర్ అంశంపై నినాదాలు చేస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. అందులోని ఓ వ్యక్తి వేదిక ముందుకొచ్చి గట్టిగా అరవడం మొదలుపెట్టారు.

 

  వెంటనే కేసీఆర్ ‘‘ఏయ్ అరవకు... నీకు నాకంటే ఎక్కువ తెలుసా... ఇటు రా మైకు ఇస్త మాట్లాడుదువ్ రా... నువ్వు తోటపల్లి రిజర్వాయ్ కట్టి నీళ్తు తెస్తవా? ఇక్కడ నీలాగే ఆడొకడు ఇడొకడు మోపైనారు? చెబుతుంటే వినే తెలివి లేదా? నాకే అడ్డం మాట్లాడతావా? బుద్దుండాలి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి దగ్గరకు పోలీస్ వెళ్లగా ‘‘ఏయ్... పోలీస్ ఏమనకయ్యా... అక్కడి నుండి జరుగు’ అని చెబుతూ ఆ వ్యక్తిని ఉద్దేశించి ‘నీకంటే నాకు ఎక్కవ బాధ్యత లేదా? ఒక్క హుస్నాబాద్ ఎందయ్యా... అన్ని బాద్‌లకు నీళ్లు రావాలి. ఏ ఒక్క బాద్‌కు రాకపోయినా నాకే బాధ’’ అన్నారు.

 

 ‘కాళేశ్వరం’ నుంచి నీళ్లిస్తా..

 కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొమరవెల్లి దగ్గర కాలువ కట్టి అక్కడి నుండి హుస్నాబాద్‌కు నీళ్లు తెప్పిస్తానని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటినీ సస్యశ్యామలం చేస్తామని చెప్పా రు. ఈ పథకం పూర్తయితే కరీంనగర్ జిల్లాలో 90 శాతం భూభాగంలో రెండు పంటలు పండించవచ్చని అన్నారు. తద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి కంటే మిన్నగా కరీంనగర్ తెలంగాణ ధాన్యాగారంగా తయారు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 

 ఇక్కడ దుస్థితి చూసి ఏడ్చిన...

 హుస్నాబాద్ పరిసర ప్రాంతాల దుస్థితిని వివరిస్తూ ‘2004లో బచ్చన్నపేట మండలానికి వెళితే 90 శాతం ముసలోళ్లే వచ్చిండ్రు, యువకులేరని అడిగితే బతకడానికి పోయిం డ్రని చెప్పిండ్రు. నేను మైకు పట్టుకుని అక్కడే ఏడ్చిన’ అని వాపోయారు. ఇప్పుడున్న దరిద్రం పోయేలా హుస్నాబాద్‌కు సాగు, తాగు నీరు తెప్పిస్తా. నీళ్లే కాదు కరెంటు, కాలువ సహా అభివృద్ధి పనులు చేసే బాధ్యత మీ ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్‌లదే. ఇక్కడ ఇద్దరు మంత్రులున్నరు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నడు. వాళ్లను అడగండి.

 

 మీకు ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తా. కానీ మీ కర్తవ్యాన్ని మాత్రం మరువొద్దని కోరారు. కార్యక్రమాల్లో రాష్ర్ట ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరమారావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు వి.సతీష్‌కుమార్, పుట్ట మధు, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top