అప్పుడు పారిపోయి.. ఇప్పుడు తిరిగొచ్చాడు.. | karimnagar student return to home after 15 years | Sakshi
Sakshi News home page

అప్పుడు పారిపోయి.. ఇప్పుడు తిరిగొచ్చాడు..

Jun 12 2015 7:54 PM | Updated on Sep 3 2017 3:38 AM

తమ్ముడితో అన్న పున్నంచందర్

తమ్ముడితో అన్న పున్నంచందర్

ఆరేళ్ల వయసులో హాస్టల్ నుంచి పారిపోయిన ఓ విద్యార్థి... పదిహేనేళ్లయ్యూక ఇంటిమీద మమకారంతో గురువారం తిరిగి వచ్చాడు.

ఎల్కతుర్తి : ఆరేళ్ల వయసులో హాస్టల్ నుంచి పారిపోయిన ఓ విద్యార్థి... పదిహేనేళ్లయ్యూక ఇంటిమీద మమకారంతో గురువారం తిరిగి వచ్చాడు. విధి వక్రించి తల్లిదండ్రులు మరణించగా.. ఉన్న ఒక్కగానొక్క తమ్ముడిని కలుసుకుని ప్రేమ ఆప్యాయతలు పంచుకున్న దృశ్యం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన రాధ, లింగయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. దంపతులిద్దరు పని చేస్తేనే ఇల్లు గడిచేది. పెద్దకొడుకు పున్నంచందర్‌ను చదువు కోసం ఆరేళ్ల వయసులోనే బొల్లికుంట హాస్టల్‌లో చేర్పించారు. చదువుపై శ్రద్ధలేని అతడు మరో విద్యార్థి సహాయంతో పారిపోయాడు. లారీల్లో విజయవాడ చేరుకున్నాడు. అక్కడ అనాథగా తిరుగుతూ దొరికిన చోటల్లా పనిచేశాడు. దువ్వెన్లు, అద్దాలు అమ్ముకుంటూ కాలం వెళ్లదీశాడు.

చిన్ననాటి జ్ఞాపకాలను ఎప్పుడూ తోటివారితో చెప్పుతుండే అతడికి ఇటీవల ఇంటికి వెళ్లాలనే తపన బాగా పెరిగింది. వెంటనే రైలులో కాజీపేట్ వచ్చి అక్కడినుంచి ఓ లారీలో గురువారం ఎల్కతుర్తి చేరుకున్నాడు. పదిహేనేళ్ల తర్వాత ఇంటికి రావడం... నాటి పరిస్థితులు లేకపోవడంతో గ్రామంలో తన తల్లిదండ్రుల గురించి చెప్పాడు. గుర్తించిన కొందరు తల్లి అనారోగ్యంతో 15 ఏళ్ల క్రితమే మరణించగా, తండ్రి మూడేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడని చెప్పారు.

ఒక తమ్ముడు ఉన్నాడని హోటల్‌లోనే పనిచేస్తున్నాడని చెప్పి నాగరాజును పిలిపించారు. తమ్మున్ని చూసిన ఆనందంలో పున్నంచందర్ అతడిని హత్తుకుని వివరాలు తెలుసుకున్నాడు. తాను తమ్ముడిని విడిచిపెట్టి వెళ్లనని, తమ్ముడితో ఇక్కడే ఉండి కష్టాన్ని ఇద్దరం పంచుకుంటామని చెప్పాడు. ఇన్నాళ్లకు తిరిగి వచ్చి తమ్ముడి ఆప్యాయత పంచుకున్న తీరు చూసిన గ్రామస్తుల కళ్లు చెమ్మగిల్లాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement