breaking news
elkathurthi
-
వరంగల్‌లో మరో దారుణం.. ప్రియుడు మోసం చేశాడని..
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్‌లో దారుణం వెలుగుచూసింది. మెడికల్ విద్యార్థి ప్రీతి, బీటెక్ స్టూడెంట్ రక్షిత సుసైడ్ ఘటనలు మరవక ముందే మరో యువతి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ప్రేమికుడు మోసం చేశాడన్న కారణంతో ఉరివేసుకొని ప్రాణాలు వదిలింది. ఎల్కతుర్తి మండలం గోపాలపూర్‌కు చెందిన పోగుల ఉషారాణి అనే యువతి.. డిగ్రీ పూర్తి చేసి ల్యాబ్ టెక్నీషియన్ ఒకేషనల్ కోర్సు చేస్తోంది. ఈ క్రమంలో భూపాలపల్లికి చెందిన ప్రశాంత్ కిషోర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ స్నేహం ప్రేమగా మారింది. అయితే ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఉషారాణి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతురు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఉషారాణి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీనియర్ వేధింపులతో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య.. రాష్ట్రంలో ర్యాగింగ్ విష సంస్కృతికి నిరసనగా నేడు(సోమవారం) తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కళాశాలల బంద్‌కు ఏబీవీపీతో పాటు ఓయూ జేఏసీ పిలుపునిచ్చాయి. ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వైద్య విద్యార్థి మృతికి కారణమైన సైఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
అప్పుడు పారిపోయి.. ఇప్పుడు తిరిగొచ్చాడు..
ఎల్కతుర్తి : ఆరేళ్ల వయసులో హాస్టల్ నుంచి పారిపోయిన ఓ విద్యార్థి... పదిహేనేళ్లయ్యూక ఇంటిమీద మమకారంతో గురువారం తిరిగి వచ్చాడు. విధి వక్రించి తల్లిదండ్రులు మరణించగా.. ఉన్న ఒక్కగానొక్క తమ్ముడిని కలుసుకుని ప్రేమ ఆప్యాయతలు పంచుకున్న దృశ్యం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన రాధ, లింగయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. దంపతులిద్దరు పని చేస్తేనే ఇల్లు గడిచేది. పెద్దకొడుకు పున్నంచందర్‌ను చదువు కోసం ఆరేళ్ల వయసులోనే బొల్లికుంట హాస్టల్లో చేర్పించారు. చదువుపై శ్రద్ధలేని అతడు మరో విద్యార్థి సహాయంతో పారిపోయాడు. లారీల్లో విజయవాడ చేరుకున్నాడు. అక్కడ అనాథగా తిరుగుతూ దొరికిన చోటల్లా పనిచేశాడు. దువ్వెన్లు, అద్దాలు అమ్ముకుంటూ కాలం వెళ్లదీశాడు. చిన్ననాటి జ్ఞాపకాలను ఎప్పుడూ తోటివారితో చెప్పుతుండే అతడికి ఇటీవల ఇంటికి వెళ్లాలనే తపన బాగా పెరిగింది. వెంటనే రైలులో కాజీపేట్ వచ్చి అక్కడినుంచి ఓ లారీలో గురువారం ఎల్కతుర్తి చేరుకున్నాడు. పదిహేనేళ్ల తర్వాత ఇంటికి రావడం... నాటి పరిస్థితులు లేకపోవడంతో గ్రామంలో తన తల్లిదండ్రుల గురించి చెప్పాడు. గుర్తించిన కొందరు తల్లి అనారోగ్యంతో 15 ఏళ్ల క్రితమే మరణించగా, తండ్రి మూడేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడని చెప్పారు. ఒక తమ్ముడు ఉన్నాడని హోటల్లోనే పనిచేస్తున్నాడని చెప్పి నాగరాజును పిలిపించారు. తమ్మున్ని చూసిన ఆనందంలో పున్నంచందర్ అతడిని హత్తుకుని వివరాలు తెలుసుకున్నాడు. తాను తమ్ముడిని విడిచిపెట్టి వెళ్లనని, తమ్ముడితో ఇక్కడే ఉండి కష్టాన్ని ఇద్దరం పంచుకుంటామని చెప్పాడు. ఇన్నాళ్లకు తిరిగి వచ్చి తమ్ముడి ఆప్యాయత పంచుకున్న తీరు చూసిన గ్రామస్తుల కళ్లు చెమ్మగిల్లాయి.