కాళేశ్వరానికి.... ‘అనంత’ కష్టాలు

Kaleshwaram Irrigation Project Has A problem To Shift A Village - Sakshi

అనంతగిరి గ్రామ తరలింపులో జాప్యం.. రిజర్వాయర్‌ నింపేందుకు ఇబ్బందులు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మిడ్‌మానేరు నుంచి దిగువకు తరలించేందుకు అనంతగిరి గ్రామం తరలింపు అడ్డంకిగా మారింది. ఈ రిజర్వాయర్‌ నిర్మాణం కింద పూర్తిగా ముంపునకు గురౌతున్న ఈ గ్రామాన్ని ఖాళీ చేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో నీటిని పంపడం సాధ్యం కావడం లేదు. ఈ ఒక్క గ్రామాన్ని తరలిస్తే కొండపోచమ్మసాగర్‌ వరకు నీటిని తరలించే అవకాశం ఉండటంతో దీని తరలింపును వేగిరం చేయాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులకు ఆదేశించారు.

ఒక్క గ్రామం తరలిస్తే దిగువకు గోదావరి.. 
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే లక్ష్మీ, సరస్వతి, పార్వ తి బ్యారేజీలను పూర్తిగా నింపారు. వీటి దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజీని ప్రస్తుతం నింపుతున్నా రు, ఇప్పటికే బ్యారేజీలో 20.18 టీఎంసీలకు గానూ 13 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఎగువన పార్వతి బ్యారేజీ నుంచి 11,197 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. మరో వారం రోజు ల్లో ఇదికూడా నిండనుంది.  వీటి దిగువనున్న మిడ్‌మానేరు రిజర్వాయర్‌ను ఇప్పటికే నింపారు. ఇక్కడ 25.87 టీఎంసీల నిల్వలకు గానూ 20.10 టీఎంసీల నిల్వ ఉంది. వాటర్‌ ప్రోటోకాల్‌ ప్రకారం ఇంతవరకే నీటిని నింపి, లీకేజీలు గమనించాక మరో 15 రోజుల తర్వాత పూర్తిగానింపనున్నారు.

మిడ్‌మానేరు నుంచి నీటిని అనంతగిరి రిజర్వాయర్‌లోకి తరలించేలా 64.5 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులు సిద్ధమయ్యాయి. 12.03 కి.మీల టన్నెల్‌ పూర్తయింది. అనంతగిరి కింద కొచ్చగుట్టపల్లి, అనంతగిరి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురౌతున్నాయి. ఈ గ్రామాల్లో 2వేల ఎకరాల భూసేకరణతో పాటు సహాయ పునరావాసం కింద వెయ్యి గృహాలను తరలించాల్సి ఉంది. రూ.75కోట్లతో భూసేకరణ ప్రక్రియ చేపట్టి, కొచ్చ గుట్టపల్లిలోని 102 నిర్వాసిత కుటుంబాలను తరలించినా, అనంతగిరిలో మాత్రం పూర్తి కాలేదు. ఇక్కడనుంచి 839 గృహాలను, 1140 కుటుంబాలను తరలించాల్సి ఉన్నా, పునరావాస సాయం పూర్తిగా అంద లేదు. రూ.150 కోట్లకు గాను రూ.100 కోట్లు ఇచ్చి మరో రూ.50కోట్లు చెల్లించలేదు.

పునరావాస సాయం అందకపోవడంతో గ్రామంలోనే నిర్వాసితులు ఈ యాసంగిలోనూ సాగుకు సిద్ధమయ్యారు.  నీటిని ఎత్తిపోసేందుకు అనంతగిరి గ్రామం ఖాళీ చేయాల్సి ఉందని ప్రాజెక్టు ఇంజనీర్లు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో దీన్ని పరిశీలించాలని తన కార్యాలయ కార్యదర్శిస్మితా సబర్వాల్‌ను సీఎం ఆదేశించారు. ఇటీవలే అక్కడ పర్యటించిన ఆమె, పునరావాస సాయం కింద రూ.50 కోట్లను విడుదల చేయాలని ఆర్ధిక శాఖను ఆదేశించారు. దీంతో బోర్లకు, బోరు బావుల మోటార్లకు కరెంట్‌ సరఫరా నిలిపివేయాలని సిరిసిల్లా జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మీన్‌ భాషా ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top