హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ 

Justice Raghvendra Singh Chauhan Appointed As Telangana High Court CJ - Sakshi

హిమాచల్‌ప్రదేశ్‌ సీజేగా జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ 

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో నంబర్‌ 2 స్థానంలో ఉన్న జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ను హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు సీజేగా నియమిస్తూ మరో ఉత్తర్వు విడుదల చేసింది. వీరికి పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగొయ్, జస్టిస్‌ బాబ్దే, జస్టిస్‌ ఎన్‌.వి.రమణలతో కూడిన కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించడంతో వాటికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో నోటిఫికేషన్‌ జారీ అయింది. జస్టిస్‌ రామసుబ్రమణియన్‌కు గురువారం హైకోర్టు వీడ్కోలు పలకనుంది. ఈ నెల 22న సీజేగా జస్టిస్‌ చౌహాన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. ఆయనతో గవర్నర్‌ ప్రమాణం చేయిస్తారు. 

జస్టిస్‌ చౌహాన్‌ నేపథ్యం... 
జస్టిస్‌ చౌహాన్‌ 1959 డిసెంబర్‌ 24న జన్మించారు. 1980లో అమెరికాలో ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ఇటీవల కలకత్తా హైకోర్టుకి బదిలీ అయ్యారు. దీంతో జస్టిస్‌ చౌహాన్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై అదే పోస్టులో కొనసాగుతున్నారు. 

జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేపథ్యం... 

జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ 1958 జూన్‌ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సినీయర్‌ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టి.ఆర్‌.మణిల వద్ద న్యాయవాద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్‌ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తర్వాత కేంద్రం ఆయన్ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. ఇప్పుడు పదోన్నతిపై హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top