ఆదిలాబాద్‌లో ‘జోగు’ హ్యాట్రిక్ | jogu ramanna hattrick win in adilabad | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌లో ‘జోగు’ హ్యాట్రిక్

May 17 2014 12:59 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొదటి సారిగా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి టీఆర్‌ఎస్ అభ్యర్థి జోగు రామన్న రికార్డు సృష్టించారు.

 ఆదిలాబాద్, న్యూస్‌లైన్ :  ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొదటి సారిగా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి టీఆర్‌ఎస్ అభ్యర్థి జోగు రామన్న రికార్డు సృష్టించారు. శుక్రవారం వెలువడిన శాసనసభ ఫలితాల్లో రామన్న మరోసారి విజయదుందుభి మోగించారు. 2009లో టీడీపీ, టీఆర్‌ఎస్ మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రారెడ్డిపై 27వేల ఓట్ల మెజార్టీతో మొదటిసారి గెలుపొందారు. 2011లో టీడీపీ రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన 2012 మార్చి 18న జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంచంద్రారెడ్డిపై 33వేల ఓట్ల మెజార్టీతో రెండోసారి విజయం సాధించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. టీఆర్‌ఎస్ హవా కొనసాగినా గతంలో కంటే మెజార్టీ తగ్గడం గమనార్హం.

 ప్రతీ రౌండ్‌లోనూ ఆధిక్యం..
 ఆదిలాబాద్ శాసనసభ స్థానానికి 15 మంది పోటీ పడ్టారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీలతోపాటు పలువురు స్వత్రంత్ర అభ్యర్థు లు బరిలో నిలిచారు. ఏప్రిల్ 30న జరిగిన పో లింగ్‌లో నియోజకవర్గంలోని 2,23,175 మంది ఓటర్లకు గాను పోస్టల్ బ్యాలెట్ కలుపుకుని 1,45,098 మంది ఓటు వేశారు. ఓట్ల లెక్కింపు శుక్రవారం ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ బాలుర కళాశాలలో నిర్వహించారు. మొత్తం 18 రౌండ్లలో ఓట్లు లెక్కించారు. మూడో రౌండ్ మినహా ప్రతి రౌండ్‌లోనూ జోగు రామన్న ఆధిక్యత కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకొని రామన్నకు 58,705 ఓట్లు రాగా, తన సమీ ప ప్రత్యర్థి బీజేపీకి చెందిన పాయల శంకర్‌కు 43,994 ఓట్లు వచ్చాయి. 14,711 ఓట్ల మెజార్టీతో రామన్న విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి 30,298 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

 ‘పాయల’కు మరోసారి చుక్కెదురు..
 పాయల శంకర్‌కు మరోసారి చుక్కెదురైంది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసి మూడోస్థానంతో సరిపెట్టుకున్నా రు. టీడీపీలో ఉన్నప్పుడు జోగు రామన్నకు పాయల శంకర్ అనంగు అనుచరుడుగా ఉన్నారు. రామన్న టీఆర్‌ఎస్‌లో చేరడం, ఆ తర్వాత శంకర్ కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో విజయంపై ఆశలు పెంచుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. గతంలో మూడో స్థానంలో నిలువగా ఈసారి రెండవ స్థానం సాధించడం ఆయనకు కొంత ఊరటనిచ్చింది. దీనికి తోడు గతం కంటే ఓట్ల శాతం పెరగడం గమనార్హం.

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్‌దేశ్‌పాండే ఆది లాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ సాధించినప్పటికీ గెలుపు మాత్రం ఆయనను వరించలేదు. రాంచంద్రారెడ్డిని కాదని భార్గవ్‌దేశ్‌పాండేకు అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. మొదటి ప్రయత్నంలో 30 వేల ఓట్లు సాధించడంతో భార్గవ్ వర్గీయుల్లో కొంత సంతోషం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో రాజకీయంగా ఎదిగేందుకు ఈ ఓట్లు తోడ్పడుతాయని వారిలో ఆశాభావం వ్యక్తమవుతోంది.

 నోటా..
 ఆదిలాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీకి 813 మంది నోటాను ఉపయోగించుకున్నారు. పార్లమెంట్లు పరిధిలో 1975 మంది పార్లమెంటు అభ్యర్థులెవరికీ ఓటు వేయకుండా నోటా బటన్ నొక్కారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement