3 నెలలు.. 5,318 పోస్టులు

Job notification in Gurukul Educational institutions  - Sakshi

గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ద్వారా భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈ–ఐఆర్‌బీ) ద్వారా మూడు నెలల్లో 5,318 పోస్టులు భర్తీ చేయనున్నట్లు బోర్డు చైర్మన్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. ఇప్పటికే 3,213 ఉద్యోగాలకు సంబంధించి రెండు నోటిఫికేషన్లు జారీ చేశామని, వారాంతం లోగా మరో 465 డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని పోలీస్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో టీఆర్‌ఈ–ఐఆర్‌బీ కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు.

గురుకుల విద్యా సంస్థల్లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకే ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసిందని, ఇందులో గురుకుల సొసైటీల్లోని ఉద్యోగులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పద్ధతిలో తీసుకుని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బోర్డు నిర్వహణకు గురుకుల సొసైటీల ద్వారా ఆర్థిక సహకారాన్ని తీసుకుంటున్నామని, అక్టోబర్‌ ఆఖరుకల్లా అభ్యర్థులకు అర్హత పరీక్షలు నిర్వహించి నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు.

ఇటీవల టీఎస్‌పీఎస్సీ ద్వారా నియమితులైన టీజీటీ, పీజీటీలకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వారికి క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, జీవనశైలి తదితర అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కొత్త టీచర్లను విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు పంపుతున్నామని వివరించారు. రెండ్రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో టీచర్లకు విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు అర్థమవుతాయని, దీంతో బోధన కార్యక్రమాలెలా నిర్వహించాలనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు.

స్వేరోస్‌.. విద్యార్థి సంఘం కాదు..
స్వేరోస్‌ సంస్థ విద్యార్థి నాయకుల సంఘం కాదని ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. స్వేరోస్‌ కార్యక్రమాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గురుకుల పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులతో ఏర్పాటైన సంస్థ స్వేరోస్‌ అని తెలిపారు. ఎస్సీ గురుకులాల్లోని కాంట్రాక్టు పనులను ఎస్సీలకే కేటాయించే క్రమంలో భాగంగా జిల్లాల్లో కలెక్టర్ల ద్వారా స్వేరోస్‌కు కాంట్రాక్టులు ఇస్తున్నామని, సొసైటీ నిబంధనల్లోనే ఈ అంశం ఉందని, ప్రభుత్వ ఆమోదంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

స్వేరోస్‌ వచ్చిన తర్వాత గురుకులాల్లో చాలా మార్పులు వచ్చాయని, సివిల్‌ సర్వెంట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్‌ ఇందులో ఉన్నారని, వీరిని ఆదర్శంగా తీసుకుంటూ విద్యార్థులు ముందుకెళ్తున్నారని వివరించారు. విద్యార్థులపై లైంగిక దాడులు జరిగితే సహించబోమని, బాధ్యులు ఎవరైనా వదిలేది లేదన్నారు. అన్ని గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రత కట్టుదిట్టంగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బోర్డు కన్వీనర్‌ నవీన్‌ నికోలస్, సభ్యులు మల్లయ్యభట్టు, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top