నల్లగొండతో విడదీయరాని బంధం

నల్లగొండతో విడదీయరాని బంధం - Sakshi


నల్లగొండ అర్బన్ : రాయలసీమ ఫ్యాక్షనిజం డైలాగులు పలికించాలన్నా, తెలంగాణ యాసను, కోస్తాంధ్ర భాషను అలవోకగా నోట నర్తించాలన్నా ప్రముఖ సినీ, నాటకరంగ కళాకారుడు తాడిపర్తి వీరజయప్రకాశ్‌రెడ్డికే (జేపీ) సాధ్యం. నాటక రంగ కళాకారుడిగా ఎన్నో ఉత్తమ ప్రదర్శనలిచ్చి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన సినీ రంగంలో కూడా విలనిజం, హాస్యరసం పండిస్తూ విలక్షణ నటుడుగా కొనసాగుతున్నారు. తండ్రి పోలీసుశాఖలో ఉద్యోగిగా ఉన్నప్పుడు 1979 నుంచి 1981 వరకు నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేశారు. ఆయనకు సినీరంగ అవకాశమొచ్చిందీ ఇక్కడినుంచే.. అందుకే తన జీవితానికి నల్లగొండతో విడదీయరాని సంబంధముందని చెబుతుంటారు. సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..

 

 నటనంటే నాకు ప్రాణం, సినీ నటుడిగా వేషాలేస్తున్నా గానీ టీచర్‌గా పని చేశానని చెప్పుకోవడానికే గర్వపడతాను. ఆ రోజుల్లో మేం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలోనే గడిపేవాళ్లం. తల్లిదండ్రుల బాధ్యత కూడా మాదే అన్నట్లుగా పిల్లలను లాలించి, బుజ్జగించి, అవసరమైతే మందలించేది. ఈ రోజు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రావడం ఆనందంగా ఉంది.  

 

 ఎప్పుడూ 100 శాతం ఫలితాలు వచ్చేవి.,

 ఎప్పుడో ఓసారి కాదు, ఈ పాఠశాలలో ఎప్పుడూ 100 శాతం ఫలితాలను సాధిం చిన విద్యార్థులున్నారు. అప్పటి ప్రిన్సిపాల్ బ్రధర్ జోయిస్ డానియల్ పనితీరు గొప్పగా ఉండేది. అప్పటికీ ఈ స్కూల్‌లో ఎయిడెడ్ అవకాశం లేదు. అనుకోకుండా గుంటూరు మున్సిపల్ స్కూల్‌లో ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం లభించింది. సినిమాల్లో నటించడం వల్ల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) తీసుకున్నాను. ఇప్పటికీ ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నాను.

 

 సినీ రంగంలో రాణించలేవన్నారు.

 మక్కుసూటిగా వెళ్లే నీకు అవకాశాలు కష్టం, రాణించలేవని మా నాన్న హెచ్చరించేవారు. ముందొక మాట, వెనకొకమాట చెప్పే సమర్థత లేకపోతే అక్కడ కష్టమని ఆయన భావన. పలు అనుభవాలు ఎదుర్కొన్నా, రెండో ఇన్నింగ్స్‌లో నిలదొక్కుకోగలిగాను.

 

 మాది చిన్న కుటుంబం...

 నాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అమ్మాయి గృహిణి, అల్లుడు ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అబ్బాయి ఇటీవలే అమెరికా నుంచి వచ్చి వ్యాపారాలు చేస్తున్నాడు. సినిమాల్లో ప్రవేశించాలనే ఆలోచన ఏ కోశాన లేదు. అతడికి అంతకన్నా ఆసక్తి లేదు.

 

 నాలుగు నందులు....

 నా నట జీవితంలో వందలకొద్ది అవార్డులు అందుకున్నాను. 2000 సంవత్సరంలో జయం మనదేరా సినిమాలో నటనకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది. నాటక రంగంలో రాణి రుద్రమ, వేట, కొత్త సైన్యం అనే సినిమాలకు కూడా నంది అవార్డులు వచ్చాయి.

 

 

 దాదాపు 265 సినిమాల్లో నటించా...

 నేను ఇప్పటి వరకు 265 సినిమాల్లో నటించాను. 1984లో సినిమా అవకాశం వచ్చాక 1992 వరకు 25 సినిమాల్లో నటించగలిగాను. కానీ ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఈ రంగాన్ని అర్ధంతరంగా వదిలేసి మళ్లీ గుంటూరుకు వెళ్లి మున్సిపల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ  చేసిన అ ప్పులు తీర్చుకున్నాను. 1997లో ప్రేమించుకుందాం రా అనే సినిమా ద్వారా రామానాయుడు గారు మరో అవకాశం కల్పించారు. 1999లో సమర సింహారెడ్డి సినిమా ద్వారా మళ్లీ సినిమా రంగంలో నిలదొక్కుకోగలిగాను.

 

 సినిమాలకన్నా నాటికలు కష్టం...

 సినిమాల్లోకన్నా నాటికల్లో నటించడం చాలా కష్టం. అయినా నాకు రంగస్థలం అంటేనే చాలా ఇష్టం. ఇక్కడ టేక్‌లు ఉండవు. ప్రేక్షకులు చూస్తుంటారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అప్రతిష్ట తప్పదు. సెకండ్ టేక్‌లు ఉండవు. చాలా ప్రాక్టీస్ జాగ్రత్తగా ప్రేక్షకులను మెప్పించేలా సంకల్పంతో నటించాల్సి ఉంటుంది.

 

 ఫ్యాక్షనిజం సినిమాలకు నేను ఆద్యుడిని...

 ఫ్యాక్షనిజం సినిమాలు నాతోనే ఆరంభమయ్యాయి. ఊపందుకున్నాయి. పక్కాగా రాయలసీమ భాష మాట్లాడగలగడం నా అదృష్టం. భాష రాని వారు ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్లుగా ఎక్కువ కాలం నిలబడలేరనేది నా అభిప్రాయం. రాయలసీమ భాషకు ప్రత్యేక గుర్తింపు తె చ్చిన నేనంటే ఆ ప్రాంతం వారికి ప్రాణం. వారి యాసలో మాట్లాడటం నా ప్రత్యేకత, ఒక్క రాయలసీమ యాసే కాదు, నెల్లూరు, శ్రీకాకుళం, కోస్తా, ఆంధ్ర, తెలంగాణ ఇలా అన్ని ప్రాంతాల మాండలికాలపై నాకు పట్టుంది. నాకు చదువు చెప్పడమన్నా, నటించడమన్నా చాలా ఇష్టం. 30 ఏళ్లు చదువు చెప్పా, 30 ఏళ్లుగా నటిస్తున్నా. సమాజానికి ఉపయోగపడే పాత్రలకు ప్రాధాన్యమిస్తూ నటనను కొనసాగించాలనేది నా లక్ష్యం.  

 

 నటనకు తొలి అడుగు పడింది నల్లగొండలోనే...

 సినీ రంగంలోకి వెళ్లేందుకు తొలి అడుగు ప డింది నల్లగొండలోనే. ఇది నా సొంత భూ మి, ఈ జీవితాన్నిచ్చిన గడ్డ, ఇక్కడికొస్తె సొంత ఇంటికొచ్చినట్లు అనిపిస్తుంది. 19 84లో అనుకుంటా నల్లగొండ జిల్లా పరిషత్ ఆవరణలో ప్రజా పోరు పత్రిక మొదటి వార్షికోత్సవం సందర్భంగా ‘గప్‌చుప్’ అనే నాటికను ప్రదర్శించాను. ఆ రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న  దాసరి నారాయణరా వు, సినీ నిర్మాత రామానాయుడు ద్వారా బ్రహ్మపుత్రుడు సినిమాలో అవకాశం కల్పించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top