జైలు మ్యూజియం

Jailbird for a day in sangareddy  - Sakshi

అన్ని హంగులతో ప్రజల ముందుకు తెచ్చిన రాష్ట్ర జైళ్ల శాఖ

సంగారెడ్డి నుంచి మంగళపర్తి నర్సింలు: రెండు శతాబ్దాల పైచిలుకు చరిత్ర కలిగిన నిర్మాణం ఇప్పుడు మ్యూజియంగా మారింది. నిజాం కాలంలో గుర్రాల పునరుత్పత్తి కేంద్రంగా వెలిగి అనంతరం జైలుగా రూపాంతరం చెంది సుమారు 60 సంవత్సరాలు సేవలు అందించిన నిర్మాణంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం దీన్ని పూర్తి స్థాయి జైలు మ్యూజియంగా తీర్చిదిద్దుతున్నారు. దేశంలోనే ఓ జైలు మొదటిసారిగా ఇలా పర్యాటక కేంద్రంగా మారింది. రాష్ట్ర జైళ్లశాఖ డీఐజీ వినయ్‌కుమార్‌సింగ్‌ ఆలోచనలతో రూపుదిద్దుకున్న మ్యూజియం.. నేడు పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. జైలులో బ్యారక్‌ల నిర్మాణం, కేటాయించే గదులు, యూనిఫాం, వంటశాల, ఖైదీలతో పని చేయించిన విధానం.. తదితరాలు కళ్లకు కట్టినట్టు కన్పిస్తాయి.

220 ఏళ్ల క్రితమే నిర్మాణం
సంగారెడ్డి సంస్థానంగా కొనసాగుతున్న క్రమంలో సుమారు రెండు శతాబ్దాల క్రితం భారీ కోటగోడలు నిర్మించారు. అనంతరం ఈ ప్రాంతం గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్లడంతో హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడం, సైనిక సంపత్తిలో భాగంగా అవసరమైన గుర్రాల పునరుత్పత్తి  కేంద్రంగా, సైన్యం విడిది కేంద్రంగా దీన్ని ఉపయోగించారు. స్వాతంత్య్రం వచ్చాక జైలుగా మారింది.

ప్రాభవం కోల్పోకుండా..
అన్ని హంగులతో కంది ప్రాంతంలో సువిశాలమైన సంగారెడ్డి జిల్లా జైలును 2012లో ప్రారంభించడంతో కొన్నాళ్లపాటు పాత జైలు ఉనికి కోల్పోయి శిథిలావస్థకు చేరింది. ఈ సమయంలో జైళ్లశాఖ డీజీగా పనిచేస్తున్న వీకే సింగ్‌ ఆలోచనతో జైలుకు మరమ్మతులు చేసి  2016 జూన్‌ 5న మ్యూజియంగా మార్చి ప్రారంభించారు. ఈ మ్యూజియంలోకి ప్రవేశ రుసుంగా రూ.10 వసూలు చేస్తున్నారు.  

ఆయుర్వేదిక్‌ విలేజ్‌...
ప్రజలకు ఆయుర్వేదిక్‌ సేవలు అందించడానికి మ్యూజియం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సోమవారం (నేడు) హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆయుర్వేదిక్‌ విలేజ్‌ను ప్రారంభిస్తారు. కేరళలో ప్రసిద్ధి చెందిన పంచకర్మ వైద్య విధానాన్ని ఇక్కడ అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top