మూలాలకు తిరిగి వెళ్దాం | Sakshi
Sakshi News home page

మూలాలకు తిరిగి వెళ్దాం

Published Mon, Jan 14 2019 2:11 AM

Indian Vice President Venkiah Naidu Started The Kite Festival In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మన సంస్కృతి, సంప్రదాయాలను పునఃపరిశీలించుకొని తిరిగి మన మూలాలకు వెళ్లాల్సిన సరైన తరుణమిదేనని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. తద్వారా మన మూలాలను మరింత పటిష్టం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహిస్తున్న 4వ తెలంగాణ అంతర్జాతీయ పతంగుల పండుగ, అంతర్జాతీయ మిఠాయిల పండుగ –2019 సంబరాలను ఆదివారం ఉప రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మన పండుగలు, పర్వదినాల ద్వారా ప్రజల్లో సమైక్యతా భావన పెరుగుతుంది. పండుగల్లోని ముఖ్యోద్దేశాలు అర్థం చేసుకోవాలి. తెలుగువారి వ్యవసాయ పండుగ సంక్రాంతి. మకర సంక్రమణం లో వచ్చే ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో ఘనంగా జరుపుకుంటారు. కొత్త ధాన్యం ఇంటికి వచ్చి, పాడిపంటలతో రైతులు తులతూగే పండుగే సంక్రాంతి’అని వెంకయ్య పేర్కొన్నారు.  

ఇదీ గాలిపటాల్లోని భావం! 
గాలిపటాలను ఎగరేయడం వెనక భావాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని వెంకయ్య నాయుడు తెలిపారు. నేలపై నిలబడి మన ఊహలను గాలిపటాలుగా ఆకాశంలో ఎగురవేస్తున్నామని.. ఆకాశంలోని లక్ష్యాలను అందుకునేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. పతంగులు, ముగ్గులు, గొబ్బెమ్మలతో పోటీలు వంటివి ప్రజల్లో పోటీతత్వం పెంపొందిస్తాయన్నారు.  వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన తీపి పదార్థాలు ఒకే వేదికపై ప్రదర్శించడం భారతీయ తత్వంలో ఉన్న వసుధైక కుటుంబానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. మన ఆహారపు అలవాట్లను ఆరోగ్యకరంగా మార్చుకుందామని వెంకయ్య పిలుపునిచ్చారు. విదేశీ ఆహార, విహార పద్ధతులకు స్వస్తి చెప్పాలన్నారు. ఇందుకోసం ఈ సంక్రాంతి సం దర్భంగా ప్రతిజ్ఞ తీసుకుందామని పిలుపునిచ్చారు. తద్వారా ‘ఏక్‌ భారత్, శ్రేష్ఠ్‌ భారత్‌’నినాదాన్ని నిజం చేద్దామన్నారు. ఒకే చోట వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన 1,200 రకాల మిఠాయిలను ప్రదర్శించడం అరుదైన విషయమని ప్రశంసించారు. 

పరేడ్‌ గ్రౌండ్‌ జనసంద్రం
అంతర్జాతీయ పతంగుల, మిఠాయిల పండగలో పాల్గొనేందుకు నగర ప్రజలు ఆసక్తి కనబరిచారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే ఓ ప్రవాహంలా పొటెత్తారు. ఇందులో భాగంగా నిర్వహించిన çఫుడ్‌కోర్టులు, హ్యాండీక్రాఫ్ట్‌ మేళాలు జనంతో నిండిపోయాయి.  మూడు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలో 20 దేశాల నుంచి 42 మంది అంతర్జాతీయ కైట్‌ ప్లేయర్స్, 60 దేశవాళీ కైట్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ స్వీట్‌ ఫెస్టివల్‌లో భాగంగా 22 దేశాలు, దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 1,200 రకాల స్వీట్లను పదుల సంఖ్యలో స్టాల్స్‌లో అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు కైట్‌ ఫెస్టివల్‌లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఆ రోజులు గుర్తొచ్చాయ్‌! ‘తెలుగు వారందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిం దంటే స్నేహితులతో కలిసి డాబాలపై పతంగులను ఎగురవేస్తూ సందడి చేసేవారం. ఈ పండగ సందడిని చూస్తుంటే ఆ రోజులు గుర్తొచ్చాయ్‌’అని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ తన చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ ప్రసంగిస్తూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లను దేశ, విదేశాల్లో ఇనుమడింపజేసేందుకు పర్యాటక శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సంక్రాంతి వచ్చిందంటే కూతుళ్లు–అల్లుళ్లు, కొడుకులు – కోడళ్లు ఒకే చోట చేరడం.. వివిధ వంటకాలు.. ఇవన్నీ మరిచిపోలేని అనుభూతిని కల్పిస్తాయన్నారు.

పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. ‘2020 నాటికి తెలంగాణ పతంగుల పండగను దేశంలోనే అతిపెద్ద పండగ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నానన్నారు. ఇది 4వ అంతర్జాతీయ పతంగుల పండగ, రెండో ఇంటర్నేషనల్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ అని తెలిపారు. ప్రజ లందరూ ఆసక్తిగా వచ్చి తిలకించి, ఈ వేడుకను ఆస్వాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్‌ శ్రీనివాసరావు, వరల్డ్‌ కల్చర్‌ టూరిజం అసోషియేషన్‌ అధ్యక్షుడు యూంగ్, ఢిల్లీలో తెలంగాణ ప్రభు త్వ ప్రతినిధి డాక్టర్‌ వేణుగోపాలాచారి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, టూరిజం ఇన్‌చార్జి కమిషనర్‌ దినకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

స్వీట్‌ఫెస్టివల్‌లో మిఠాయి తింటున్న స్వామిగౌడ్‌. చిత్రంలో బుర్రా, మామిడి హరికృష్ణ తదితరులు 

Advertisement

తప్పక చదవండి

Advertisement