వాహన రిజిస్ట్రేషన్ల ఆదాయానికి గండి


వివరాలను ఆరా తీసిన సీఎం కేసీఆర్‌

సాక్షి , హైదరాబాద్‌: ప్రభుత్వ ఆదాయ వనరుల్లో ప్రధానమైన వాహన రిజిస్ట్రేషన్లు గణనీయంగా పడిపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో కొత్త వాహనాల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదని, ఫలితంగా టెంపరరీ రిజిస్ట్రేషన్ల (టీఆర్‌)తోపాటు లైఫ్‌ ట్యాక్స్‌ ద్వారా రావాల్సిన ఆదాయానికి బ్రేక్‌ పడినట్లు రవాణా శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. వాహన కొనుగోళ్లు,  రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలపై సీఎం కేసీఆర్‌  ఆరా తీయడంతో ఈ మేరకు రవాణా శాఖ అధికారులు శుక్రవారం ఒక నివేదికను   అందజేశారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా రోజూ 3750 నుంచి 4 వేల వాహనాల టీఆర్‌లు జరిగేవి.


పెద్ద నోట్ల రద్దుతో ఈ సంఖ్య సగానికి పడిపోయిందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో గతంలో వెయ్యి వాహనాలకు టీఆర్‌లు జరగగా, ఇప్పుడు అవి 350కి పడిపోయినట్లు అధికారులు తెలిపారు.  గతంలో రోజూ ప్రభుత్వానికి రూ.6 కోట్ల దాకా ఆదాయం సమకూరగా, తాజాగా అది రూ.3 కోట్ల నుంచి రూ.3.50 కోట్లకు పడిపోయిందని అధికారులు పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహన కొనుగోళ్లు 70%కి పడిపోయినట్లు గుర్తించారు.  లగ్జరీ కార్ల విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో రోజూ కనీసం 50 లగ్జరీ కార్లు అమ్ముడు పోగా, ఇప్పుడు వాటి సంఖ్య మూడు, నాలుగుకు పడిపోయినట్లు సమాచారం. లగ్జరీ కార్లు కొనుగోలు చేసే వారిలో పూర్తి నగదు చెల్లించేవారే అధికమని, పెద్ద నోట్లు రద్దు కావడంతో వీటి విక్రయాలపై ప్రభావం పడిందంటు న్నారు. మొత్తంగా వాహనాల కొనుగోళ్లు,  రిజిస్ట్రేషన్లు సగానికి సగం పడిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని రవాణా శాఖ అధికారులు సీఎం కేసీ ఆర్‌ కు పంపించిన నివేదికలో పేర్కొన్నారని సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top