సిటీ శివార్లలోడేంజర్‌ గోడౌన్స్‌! | Illegal Chemical Storage In Hyderabad Godowns | Sakshi
Sakshi News home page

సిటీ శివార్లలోడేంజర్‌ గోడౌన్స్‌!

Apr 30 2018 1:56 AM | Updated on Sep 5 2018 9:47 PM

Illegal Chemical Storage In Hyderabad Godowns - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతాల్లో డేంజర్‌ గోడౌన్లు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటవుతున్న ఈ గోదాముల్లో ప్రమాదకరమైన రసాయనాలను భారీ ఎత్తున నిల్వ చేస్తున్నారు. అసలే మండు వేసవి.. పైగా మండే స్వభావం కలిగిన రసాయనాలు కావడంతో చిన్న షార్ట్‌సర్క్యూట్‌ జరిగినా భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫిబ్రవరి–ఏప్రిల్‌ మధ్యకాలంలోనే సుమారు 10 అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉపాధి కోసం నగరానికి వలస వచ్చిన కార్మికులు ఈ అగ్నికీలలకు ఆహుతైపోతున్నారు. 

అలాగే కోట్లాది రూపాయల ఆస్తినష్టం సైతం సంభవిస్తోంది. రానున్నది మే నెల.. ఎండలు మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా జీడిమెట్ల, పాశమైలారం, ఖాజిపల్లి, బొంతపల్లి, కాటేదాన్, మల్లాపూర్, బొల్లారం తదితర పారిశ్రామిక వాడల్లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్‌ సంస్థలకు సంబంధించిన పలు రకాల రసాయనాలు, సాల్వెంట్స్‌ను సుమారు వెయ్యి వరకు ఉన్న అక్రమ గోడౌన్లలో నిల్వ చేశారు. వీటికి అడ్డుకట్ట వేయడంలో పరిశ్రమలు, కార్మిక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి విఫలం అవుతుండటంతో వరుస అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. 

నిబంధనలకు నీళ్లు.. 
గ్రేటర్‌ శివార్లలోని పారిశ్రామిక వాడల్లో ఏర్పాటైన పలు గోదాములు నిబంధనలకు విరుద్ధంగా వెలిసినవే. కార్మిక, పరిశ్రమల శాఖలు, పీసీబీ అనుమతులు లేనివే అధికం. కానీ ఆయా శాఖలు వీటిని కట్టడి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ గోదాముల నిర్వాహకులు బడా బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్‌ కంపెనీలకు సంబంధించిన అత్యంత గాఢత కలిగిన రసాయనాలను అధిక రుసుములు వసూలు చేస్తూ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. 

మరికొందరు వీటిని శుద్ధి చేసే పనులు చేపడుతున్నారు. ఈ రసాయనాల్లో చాలా వాటికి మండే స్వభావం అధికం. వేసవి కావడంతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. గోదాముల్లో చిన్నపాటి విద్యుదాఘాతం చోటు చేసుకున్నా నిప్పురవ్వలు ఎగిసి రసాయనాలపై పడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయక కార్మికుల జీవితాలు బుగ్గవుతున్నాయి. 

పొరుగు రాష్ట్రాల వారే ఎక్కువ.. 
ఈ గోదాముల్లో సెక్యూరిటీ గార్డులు, స్టోర్‌ ఇన్‌చార్జులు, కార్మికులు అధిక శాతం ఒడిశా, బిహార్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన వారే. వీరంతా ఆయా గోదాముల్లో ప్రమాదం అంచున పనిచేస్తున్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ ఫైర్‌ ఇంజిన్లు తిరిగేందుకు అవసరమైన ఖాళీస్థలం కూడా వీటి పరిసరాల్లో లేదు. దీంతో ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ చుట్టూ ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా మంటలు వ్యాపించి కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరుగుతోంది. తరచూ అగ్నిప్రమాదాల కారణంగా స్థానికులకు కూడా కంటిమీద కునుకు కరువవుతోంది. ఇన్సూరెన్స్‌ లబ్ధి కోసం కొందరు నిర్వాహకులు స్వయంగా ఆయా గోదాముల్లో షార్ట్‌ సర్క్యూట్‌కు కారణమౌతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

ఇటీవల సంభవించిన కొన్ని అగ్ని ప్రమాదాలివే.. 
– ఏప్రిల్‌ 24న జీడిమెట్ల గంపలబస్తీలోని భవానీ ట్రేడర్స్‌లో అగ్నిప్రమాదం కారణంగా కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. 
– ఫిబ్రవరి 23న సూటిక్‌ ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement