‘కాకతీయ’పై ఇక్రిశాట్‌ అధ్యయనం

Icrisat study on mission Kakatiya - Sakshi

నీటిపారుదల శాఖతో కుదిరిన ఒప్పందం

వర్షాభావం ఉన్నప్పుడూ చెరువులు నింపాలన్నది ప్రభుత్వ యోచన: హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఐదు దశల ‘మిషన్‌ కాకతీయ’ ఫలితాలు, ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌తో నీటిపారుదల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలోని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో ఈ మేరకు శుక్రవారం ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మంత్రి హరీశ్‌ సమక్షంలో ప్రభుత్వం తరఫున కాడా కమిషనర్‌ మల్సూర్, ఇక్రిశాట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ కిరణ్‌ శర్మ సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం కింద రెండేళ్ల పాటు మిషన్‌ కాకతీయ ఫలితాలు– వాటి ప్రభావంపై ఇక్రిశాట్‌ అధ్యయనం చేసి, ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. చెరువు మట్టి ద్వారా రైతులు ఎలాంటి లాభాలు పొందారు, పంట దిగుబడి ఎంత పెరిగిందన్న అంశాలను ఈ అధ్యయనంలో పరిశీలించనున్నారు. చెరువుల పునరుద్ధరణ జరిగిన ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు జరిగిన తీరును ఇక్రిశాట్‌ అధ్యయనం చేయనుంది. చెరువు మట్టి ద్వారా పంట దిగుబడి మాత్రమే కాకుండా రైతుకు ఆర్థికంగా చేకూర్చిన లాభాలను ఇక్రిశాట్‌ పరిశీలనలోకి తీసుకోనుంది.  

ఇక్రిశాట్‌తో ఒప్పందం సంతోషకరం
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరంలో గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయ పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రతిష్టాత్మక సంస్థలతో సాగునీటి శాఖ కలసి పని చేస్తోందన్నారు.

ఇరిగేషన్‌ సమాచార వ్యవస్థను రూపొందించడానికి గతంలో ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నామని, వారు రూపొందించిన సమాచార వ్యవస్థ ఆధారంగా ప్రభుత్వం గొలుసు కట్టు చెరువులను మేజర్, మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తున్నామని అన్నారు. వర్షాభావ సంవత్సరాల్లో కూడా చెరువులను నింపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సమగ్ర అధ్యయనం అనంతరం సూచనలు, సలహాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.  

నీహాల్‌ చదువుకు ఆర్థిక సాయం
నీటిపారుదల శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిన నీహాల్‌కు మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సచివాయంలో రూ.35 వేల చెక్‌ను అందజేశారు. మాస్టర్‌ నీహాల్‌ను సాగునీటి శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించి, ఆయన డిగ్రీ చదువు వరకు అయ్యే ఖర్చును సాగునీటి శాఖ భరిస్తుందని మంత్రి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top