పంజాగుట్టలో స్టీల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

పంజాగుట్టలో స్టీల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభం

Published Fri, Jun 19 2020 11:05 AM

Hyderabad: Punjagutta Steel Bridge opened By Home Minister Mahmood Ali - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మొట్టమొదటి స్టీల్‌ బ్రిడ్జి శుక్రవారం ప్రారంభమైంది.  రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ స్టీల్‌ బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా లాక్‌డౌన్‌ తరుణంలో జీహెచ్‌ఎంసీ వేగంగా చేసిన ప్రాజెక్టుల్లో ఇదొకటి. పంజగుట్ట శ్మశానవాటిక (చట్నీస్‌) సమీపం నుంచి రహదారి విస్తరణకు అవకాశం లేక తీవ్ర బాటిల్‌నెక్‌తో బ్లాక్‌స్పాట్‌గా మారింది. దీంతో వాహన ప్రమాదాలు జరుగుతుండేవి. సమస్య పరిష్కారం కోసం క్యారేజ్‌వే పెంచేందుకు చిన్న ఫ్లైఓవర్‌ అవసరమని భావించారు.

ట్రాఫిక్‌ రద్దీ, ఇతరత్రా సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని స్టీల్‌బ్రిడ్జి నిర్మాణాన్ని తలపెట్టారు. బ్రిడ్జి మొత్తం పొడవు వంద మీటర్లు. స్టీల్‌బ్రిడ్జి స్పాన్‌ 43 మీటర్లు. గత ఫిబ్రవరి నెలాఖరులో పనులు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌లో ట్రాఫిక్‌ లేకపోవడం, మంత్రి కేటీఆర్, మేయర్‌ రామ్మోహన్‌ ప్రత్యేక శ్రద్ధ వహించిన నేపథ్యంలో అధికారులు వడివడిగా పనులు పూర్తిచేశారు. ఈ నెల మొదటి వారంలోనే ప్రారంభించాలనుకున్నప్పటికీ.. తుది మెరుగుల కోసం ఆగాల్సి వచ్చింది. ఈ బ్రిడ్జి వినియోగంతో ముఫకంజా కాలేజ్‌ వైపు నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వైపు వాహనాల రాకపోకలకు ట్రాఫిక్‌ సమస్య తీరడంతోపాటు వాహనదారులకు ప్రయాణ సమయం కలిసివస్తుందని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. లాక్‌డౌన్‌ సమయాన్ని సమర్థంగా వినియోగించుకొని మూడు నెలల్లోనే బ్రిడ్జిని పూర్తి చేసినట్లు తెలిపింది. బ్రిడ్జి ఆరు మీటర్లతో పాటు మొత్తం 12 మీటర్ల క్యారేజ్‌వేతో బాటిల్‌నెక్‌ సమస్య తీరుతుందని పేర్కొంది.  మెయిన్‌గర్డర్లు, క్రాస్‌గర్డర్లు స్టీల్‌వి వాడినట్లు తెలిపింది. 


స్టీల్‌ బ్రిడ్జి విశేషాలు.. 

  • మొత్తం పొడవు: 100 మీటర్లు 
  • స్టీల్‌ బ్రిడ్జి స్పాన్‌: 43 మీటర్లు (సింగిల్‌ స్పాన్‌) 
  • అప్రోచెస్‌ పొడవు: 57 మీటర్లు 
  • (ఎన్‌ఎఫ్‌సీఎల్‌ వైపు 35 మీటర్లు,  
  • ముఫకంజా కాలేజ్‌ వైపు 22 మీటర్లు) 
  • వెడల్పు: 9.60 మీటర్లు 
  • క్యారేజ్‌ వే: 6 మీటర్లు 
  • (రెండు లేన్లు, వన్‌వే), 1 మీటరు ఫుట్‌పాత్‌ 
  • రద్దీ సమయంలో ట్రాఫిక్‌: 11,305 పీసీయూ  
  • 2035– 36 నాటికి ట్రాఫిక్‌: 17,613 

Advertisement
Advertisement