అర్థరాత్రి వరకే పబ్‌లు, క్లబ్‌లు | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి వరకే పబ్‌లు, క్లబ్‌లు

Published Wed, Jul 26 2017 2:22 AM

అర్థరాత్రి వరకే పబ్‌లు, క్లబ్‌లు - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీసలు పబ్‌ యజమానులకు షాక్‌ ఇచ్చారు. పబ్‌లలో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో పనిచేసే వేళలను కుదించారు. ఇకపై రాత్రి 12 గంటల వరకే అనుమతిస్తూ కొత్తగా ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితమే పబ్‌లు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట సహా అన్ని పోలీస్‌ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇక నుంచి అర్థరాత్రి 12 గంటలకు బంద్‌ చేయాల్సి ఉంటుంది. మొన్నటి వరకు రాత్రి 12 గంటల వరకు లిక్కర్‌ సరఫరాచేసి ఒంటి గంట వరకు ఫుడ్‌ సరఫరా చేసేవారు. ఇప్పుడు అన్నింటికి ఒకే లెక్క.

రాత్రి 12 గంటలకు తమ పరిధిలో ఉన్న బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్‌లు, హోటళ్లు మూసివేసిన తర్వాతనే సెక్టార్‌ ఎస్‌ఐలు ఇంటికి వెళ్లాలని తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆదివారం రాత్రి నుంచే పోలీసులు రంగంలోకి దిగారు. సరిగ్గా 12 గంటలకు పబ్‌లను మూసివేయించి ఇంటికి వెళ్తున్నారు. సోమవారం రాత్రి 12తర్వాత అన్ని పబ్‌లు, క్లబ్‌లు, హోటళ్ల వద్ద నిరంతర నిఘా ఉంచారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. కేసులు బనాయించాలని యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 12 గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా అనుమతించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇక పబ్‌లు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హుక్కా సెంటర్లు అధికంగా ఉన్న బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వాటిముందు రాత్రి 12 తర్వాత కార్లు ఆగినా, యువత అనుమానాస్పదంగా తిరిగినా వెంటనే ప్రశ్నించాలని తెల్లవారుజాముదాకా గస్తీకాయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు ఆయా పోలీస్‌ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లను బాధ్యులుగా చేశారు.

Advertisement
Advertisement