హనుమాన్‌ శోభాయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Hyderabad Police Ready For Hanuman Shobha Yatra - Sakshi

కంటోన్మెంట్,సుల్తాన్‌బజార్‌: హనుమాన్‌ జయం తిని పురస్కరించుకుని ఈ నెల 19న నిర్వహించనున్న శోభాయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నగరపోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఇతర అధికారులతో కలిసి శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. తాడ్‌బంద్‌ హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శోభాయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1,200 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. యాత్రామార్గంలో 450 ప్రత్యేక సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం గౌలిగూడ నుంచి ప్రారంభం కానున్న శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నందున మార్గమధ్యంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ తెలిపారు. రహదారుల మరమ్మతులు పూర్తి చేశామని. వేసవి దృష్ట్యా భక్తులకు మంచినీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని పెద్ద సంఖ్యలో శోభాయాత్ర విధులకు కేటాయించినట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తాడ్‌బంద్‌ హనుమాన్‌ ఆలయం వద్ద యాత్ర ముగుస్తుందన్నారు. యాత్రా మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు తాడ్‌బంద్‌ దేవాలయ కమిటీ చైర్మన్‌ బూరుగు వీరేశం అధికారులకు ఘనంగా స్వాగతం పలికారు.  

ట్రాఫిక్‌ మళ్లింపులపై విస్తృత ప్రచారం
సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం శోభాయాత్ర నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్‌ మందిర్‌ నుంచి తాడ్‌బండ్‌ హనుమాన్‌ టెంపుల్‌ వరకు జరిగే ఈ భారీ ఊరేగింపునకు నగర పోలీసులు భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆ రోజు తీసుకోవాల్సిన చర్యలపై ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ బుధవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ఉరేగింపు మార్గాల్లో అధికారులు స్వయంగా పర్యటించి సమస్యలను గుర్తించాలని సూచించారు. ఏ ప్రాంతంలో అయినా అత్యవసర వాహనాలు, అంబులెన్స్‌లకు కచ్చితంగా దారివదిలేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ మళ్లింపులు విధిస్తున్న ప్రాంతాల్లో బారికేడ్లు, సైనేజెస్‌ ఏర్పాటు చేయాలన్నారు. వీటి వల్ల సామాన్య వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు రావని, ఊరేగింపునకు ఆటంకం ఉండదని ఆయన పేర్కొన్నారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో ఎత్తైన స్థంభాలపై ఏర్పాటు చేసిన, మెబైల్‌ వేరియబుల్‌ మెసేజ్‌ బోర్డుల ద్వారా వాహనచోదకులకు ఎప్పటికప్పుడు సమాచారం, సలహాలు, సూచనలు అందించాలన్నారు. ట్రాఫిక్‌ మళ్లింపులు, ఆయా మార్గాల్లో ఉన్న రద్దీని గూగుల్‌ మ్యాపుల్లోనూ కనిపించేలా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ట్రాఫిక్‌ డీసీపీలు ఎల్‌ఎస్‌ చౌహాన్, కె.బాబూరావు తదితర అధికారులు పాల్గొన్నారు. 

రూట్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీపీ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ తదితరులు
మద్యం విక్రయాలు బంద్‌
హనుమాన్‌ జయంతి ర్యాలీ నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 వరకు నగరంలోని మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు తదితరాలు మూసి ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. రిజిస్టర్డ్‌ క్లబ్బులు, స్టార్‌ హోటల్స్‌లో ఉన్న బార్లకు మినహాయింపు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top